Politics

ఈ మూడు పార్టీలూ ఒకేతాను ముక్కలే: కిషన్ రెడ్డి

ఈ మూడు పార్టీలూ ఒకేతాను ముక్కలే: కిషన్ రెడ్డి

రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రజలకు ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. వరద ప్రభావిత  ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్రం నిధులు రూ. 900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయని.. అయినప్పటికీ వరద బాధితులకు ప్రభుత్వం సాయం అందించడం లేదని అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలు కూడా చేరుకున్నాయని తెలిపారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒకే తాను ముక్కలు అని విమర్శించారు. మూడు పార్టీలు గతంలో పొత్తులు పెట్టుకున్నాయని.. కలిసి పనిచేశాయని అన్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు కుటుంబ, అవినీతి, నియంత పార్టీలు అని విమర్శించారు.

రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని కిషన్ రెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గిరిజిన రిజర్వేషన్లపై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కిషన్ రెడ్డి  అన్నారు. సోయం బాపూరావు వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై పార్టీ వివరణ కోరుతుందని తెలిపారు. లంబాడీలకు రిజర్వేషన్‌కు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే లంబాడీలకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.