పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్న సీఎం.. అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలన్నారు. గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టి పెట్టాలని, చేయూత కింద స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సీఎం జగన్ సూచించారు. అంతేకాకుండా.. లబ్ధిదారులు తొలివిడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే వారికి పూర్తి స్థాయిలో మేలు జరుగుతుందని ఆయన వెల్లడించారు.
గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలని, కార్యక్రమాల పని తీరుపై మదింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు సీఎం జగన్. నివేదికల ఆధారంగా యూనిట్లు విజయవంతంగా నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయూతనిచ్చి నడిపించడం చాలా కీలకమన్నారు. ఆగస్టు 10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు. అయితే.. ఈ సమావేశానికి సీఎస్ జవహర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఇదిలా ఉంటే.. రేపు సీఎం జగన్ విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కైలాసపురం పోర్టు ఆసుపత్రి సమీపంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. జీవీఎంసీకి చెందిన 50 అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేయనున్న సీఎం.. అనంతరం సిరిపురంలోని ఏయూ క్యాంపస్‌కు చేరుకోనున్నారు. ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబేషన్ సెంటర్, బయో మానిటరింగ్ హబ్‌తో సహా ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన భవనాలను సీఎం ప్రారంభించనున్నారు.