ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అక్షరాల పది లక్షల 57 వేల కోట్ల రూపాయలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వెల్లడించారు. ఈ అప్పులకు వడ్డీలు చెల్లించడానికే ఏడాదికి 50 వేల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సిందేనని, ప్రతి నెల 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సిన దుస్థితిలోకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నెట్టిందని రఘురామకృష్ణ రాజు మండి పడ్డారు.పార్లమెంటులో రాష్ట్ర అప్పుల వివరాల గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని తాను అడిగిన ప్రశ్న వేరని… ఆమె చెప్పిన సమాధానం వేరని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి గారు అబద్ధం చెప్పకపోయినప్పటికీ, అసలు విషయాన్ని మాత్రం చెప్పలేదని, రాష్ట్ర ప్రభుత్వ అసలు అప్పు ఎంతో తాను చెప్పానని… ఇది తప్పని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, ఆయన వందిమాగాదులు భావిస్తే లెక్కలతో రావాలని సవాల్ విసిరారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వెధవ అప్పుల వివరాలన్నీ తనకు తెలుసునని, ఎఫ్ ఆర్ బి ఎం పరిమితికి మించి ఇంత దారుణంగా ఎలా అప్పులు చేస్తున్నారో అర్థం కావడం లేదని, ఈ ఏడాది రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎఫ్ ఆర్ బి ఎం పరిమితి 30 వేల కోట్ల రూపాయల కాగా, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 29 వేల రెండు వందల కోట్ల రూపాయల అప్పులను చేసిందను, ఇక మిగిలింది కేవలం 750 కోట్ల రూపాయలు మాత్రమేనని, అయినా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 3, 000 కోట్ల రూపాయల అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తోందని, ఏ ప్రాతిపదికన రాష్ట్రానికి మూడు వేల కోట్ల రూపాయల అప్పులు ఇవ్వనున్నారో అర్థం కావడం లేదని అన్నారు.