Sports

వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం

వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు భారీ విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. రెండో వన్డేలో ప్రయోగాలు చేసి చేజేతులా పరాజయం పాలైన టీమిండియా మూడో వన్డేలో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఇషాన్ కిషన్ (77), శుభమన్ గిల్ (85), సంజు శాంసన్ (51), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (70) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 35 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ 35.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. శార్దూల్ ఠాకూర్, ముకేశ్ కుమార్ దెబ్బకు ఆతిథ్య జట్టు టపటపా వికెట్లు కోల్పోయింది. జట్టులో ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే అవుటయ్యారు. గుడకేష్ మోతీ చేసిన 39(నాటౌట్) పరుగులే జట్టులో అత్యధికం. అలిక్ అథనాజ్ 32, యనిక్ కరియ 19, అల్జారీ జోసెఫ్ 26 పరుగులు చేశారు.

శార్దూల్ 4, ముకేశ్ కుమార్ 3 వికెట్లు తీసుకోగా కుల్దీప్ యాదవ్‌కి రెండు, జయదేవ్ ఉనద్కత్‌కు ఒక వికెట్ దక్కింది. జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన శుభమన్ గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. రేపటి నుంచి ఇరు జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభమవుతుంది.