అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవల్లో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 204 అంబులెన్స్‌లు (108), 228 అమ్మఒడి వాహనాలు, 34 హర్సె వెహికిల్స్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించిన సందర్భంగా ఆరోగ్య రంగ పురోగతిని ప్రశంసిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా హెల్త్ మినిస్టర్ హరీశ్‌రావుకు, ఆయన బృందానికి కేటీఆర్ కంగ్రాట్స్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో 466 అత్యవసర వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా 466 వాహనాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి ప్రతి లక్ష జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేదని, కాని ప్రస్తుతం 75 వేల మందికి ఒక 108 వాహనం అందుబాటులో ఉందని చెప్పారు. అమ్మఒడి వాహనాలకు నిధులు కావాలని కోరగానే ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారని వెల్లడించారు.