* ఢిల్లీ అధికారాల ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన అమిత్ షా
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసే ఢిల్లీ అధికారాల ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పాస్ అయితే ఢిల్లీలోని అధికారులపై పెత్తనం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుంది. అధికారుల నియామకాలు, బదిలీల అంశం కేంద్రం నియంత్రణలోకి వెళ్తుంది. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవు.ఈ బిల్లును ఆప్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విపక్ష ఇండియా కూటమి పార్టీలు కేజ్రీవాల్ కు అండగా నిలిచాయి. బిల్లును అమిత్ షా సభలో ప్రవేశపెడుతున్నప్పుడు ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల వరకు సభను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు.
* ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కాంగ్రెస్ విజయమే
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ విజయమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా తాము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించామని.. దీన్ని దృష్టిలో ఉంచుకోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దిగివచ్చారని అన్నారు. గతంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో వీలినం చేయాలని తాము డిమాండ్ చేయగా.. అప్పట్లో సీఎం కేసీఆర్ ఈ విషయంపై ఏం మాట్లాడారో అందిరికీ గుర్తుందని అన్నారు. పనికిమాలిన మాలిన పార్టీలు, పని లేని మాటలు మాట్లాడుతున్నాయని అన్నారని.. ఆర్టీసీ విలీనం చేయడం అసంభవమని సీఎం గతంలో అన్నారని భట్టి గుర్తుచేశారు. ఆర్టీసీ ఆస్తులన్నీ కూడా ప్రజల ఆస్తులని.. వీటన్నంటిని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 43,373 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వీరందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఇప్పటినుంచి వాళ్లకు జీతాలు ప్రభుత్వమే చెల్లించనుంది. ఇందుకోసం విధివిధానాల రూపకల్పనకు కూడా ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆర్టీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును రానున్న శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతామని మంత్రివర్గం పేర్కొంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో సోమవారం రోజున ఆరుగంటల పాటు మంత్రిమండల సమావేశం జరిగింది.
* ఒకే వేదికపై మోదీ, శరద్ పవార్
రాజకీయాల్లో కొన్ని ఆసక్తికర విషయాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఈరోజు అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ప్రధాని మోదీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లు ఒకే వేదికను పంచుకున్నారు. మహారాష్ట్రలోని పూణేలో తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని మోదీ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శరద్ పవార్ ను మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇవి తనకు గుర్తుండిపోయే క్షణాలని చెప్పారు. ఇండియా కూటమి మూడో సమావేశం త్వరలో ముంబైలో జరగబోతున్న తరుణంలో ప్రధానితో వేదికను పంచుకోవడం సరికాదని కొందరు నేతలు చెప్పినప్పటికీ శరద్ పవార్ పట్టించుకోలేదు. లోక్ సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో బీజేపీ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన శరద్ పవార్, మోదీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లడం వారికి మింగుడు పడటం లేదు.
* మంత్రి కొప్పుల పిటిషన్ కొట్టివేత
తన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ధర్మపురి నియోజకవర్గం నుంచి అక్రమ పద్ధతుల్లో కొప్పుల ఈశ్వర్ గెలిచారని.. ఆయన ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ 2018లో పిటిషన్ దాఖలు చేశారు
* తెలంగాణలో అధికారం ఎవరబ్బా సోత్తు కాదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగా కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్యాంప్ ఆఫీస్ లో మాజీ ఎంపీ పొంగులేటి మరోసారి అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భద్రాచలం పరంగా ఇచ్చిన హామీల సంగతేంటి అని ఆయన ప్రశ్నించారు. నిన్న కేబినెట్ లో మున్నేరుకు సైడ్ వాల్స్ కడతామని చెప్పడం నాకు నవ్వొస్తుంది.. తెలంగాణ మనిషి ఈ రాష్ట్రాన్ని పాలిస్తే ప్రజల కష్టాలన్నీ తొలగిపోతాయని అందరూ భావించారు.. కానీ అది నిరవేరలేదు.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తుండటం.. మరో మూడు నెల రోజుల్లో ఎన్నికలు ఉంటడంతో వీళ్లకు ఇప్పుడే గుర్తొచ్చిందా అని పొంగులేటి అన్నారు.వర్షాలతో రాష్ట్రం మొత్తం ఇబ్బందులు పడుతుంటే అదంతా వదిలేసి కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లి ఆయన పార్టీలోకి నాయకులను ఆహ్వానిస్తున్నారు అని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మీకు కేవలం అధికారముంటే చాలా..?ప్రజలు ఏమైపోయిన పర్వాలేదా..?.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ శ్రేణులు ముంపుగు గురైన వారికి చేదోడు వాదోడుగా ఉన్నందుకు అభినందనలు.. కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని ఆయన తెలిపారు.అధికార పార్టీ నేతలందరూ అనుకుంటున్నట్లు అధికారం ఎవరబ్బా సోత్తు కాదు అని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి సపోర్టు వస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.
* బీజేపీలో ప్రక్షాళనకు రంగం సిద్దం చేసుకున్న పురంధేశ్వరి
భారతీయ జనతాపార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి భాద్యతలు చేపట్టిన నాటి నుంచి దూకుడుగా ముందుకెళ్తున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యంగా కీలక నిర్నయాలు తీసుకుంటున్నారు. బాధ్యతలు తీసుకున్న మొదటి రోజునుంచే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య రహస్య బంధం ఉందనే ఆరోపణలు తీవ్రంగా ఉండేవి. అలాంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా ముందుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీ పర్యటనలతో క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేసుకున్న బీజేపీ చీఫ్.. పార్టీ అనుబంధ విభాగాలతోనూ సమావేశమై కీలక సూచనలు చేసారు. ఇక ఆగస్ట్ నుంచి ప్రజాక్షేత్రంలో ఉద్యమాలకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో అడుగుపెట్టడానికి ముందుగానే పార్టీలో కీలక మార్పులను చేస్తున్నారు పురంధేశ్వరి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభాగంలో అధ్యక్షులుతో నలుగురు జనరల్ సెక్రటరీలు, పదిమంది వైస్ ప్రెసిడెంట్లు, మరో పదిమంది సెక్రటరీలు, ఒక ట్రెజరర్ ఉంటారు. ప్రస్తుతం ఉన్న ఈ కమిటీలో చాలామందిని మారుస్తూ కొత్త లిస్ట్ సిద్దం చేసుకున్నారు పురంధేశ్వరి. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కొత్త జాబితాకు కేంద్రపెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.స్టేట్ కమిటీలో జనరల్ సెక్రటరీల స్థానాల్లో ప్రస్తుతం ఉన్న ఒకరిద్దరిని మార్పు చేసి కొత్త వారికి అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. బీసీ, ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త కూర్పు సిద్దం చేసారు. ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ జాబితా సిద్దం చేసారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు వైస్ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెప్పాయి. ఇక వీటితో పాటు మోర్చాల నేతలను కూడా మార్పులు చేస్తున్నట్లు తెలిసింది. కొత్త జాబితాను ఇప్పటికే డిల్లీకి పంపిన పురంధేశ్వరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మార్పులు చేర్పులతో తన టీంను సిద్దం చేసుకుని మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు పురంధేశ్వరి కసరత్తు చేస్తున్నారు.
* అలాంటి వారికి హారతి ఇవ్వాలా..?: సీఎం యోగి
ఉత్తర్‌ప్రదేశ్ లో బుల్డోజర్లతో నేరస్థుల ఇళ్ల కూల్చివేతను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్థించారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం బుల్డోజర్లతో నేరస్థుల ఇళ్లను ఎందుకు కూల్చివేస్తోందని అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందిస్తూ.. అక్రమంగా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన వారికి హారతి ఇవ్వాలా? అంటూ ప్రశ్నించారు.
* తెల్లవారుజామునే కూరగాయల మార్కెట్‌లో రాహుల్ గాంధీ
దేశంలోని సమస్యలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలతో మమేకమవుతున్నారు. మెకానిక్‌లతో, ట్రక్కు డ్రైర్లతో, రైతులతో.. ఇలా అవకాశం చిక్కినప్పుడల్లా వారిని కలిసి మాట్లాడుతున్నారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూరగాయల మార్కెట్‌లో ఆయన ప్రత్యక్షమయ్యారు.ఈ రోజు తెల్లవారుజామున ఢిల్లీలో ఓ మార్కెట్ ను రాహుల్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఆజాద్‌పూర్ మండీలో కలియదిరిగారు. కూరగాయలు, పండ్ల వ్యాపారులతో మాట్లాడారు. ధరల వివరాలను ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ట్వీట్ చేసింది.అంతకుముందు శనివారం రామేశ్వర్ అనే వ్యాపారి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. టమాట ధరలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని కొనేందుకు తన దగ్గర డబ్బులు లేవని ఆ వ్యాపారి కన్నీళ్లు పెట్టుకున్నాడు.‘‘మేం వాటిని ఏ ధరకు విక్రయిస్తామో మాకే తెలియదు. అవి వర్షంలో తడిసిపోయినా, లేదా ఇంకేమైనా జరిగినా.. మేం మొత్తం నష్టపోతాం” అని చెప్పాడు. రోజుకు రూ.100 నుంచి రూ.200 కూడా రావడం లేదని వాపోయాడు.‘‘ఈ దేశం రెండు వర్గాలుగా విడిపోయింది. ఓవైపు ప్రభుత్వ మద్దతు ఉన్న ధనికులు.. మరోవైపు ధరల పెరుగుదలతో ఇక్కట్లు పడుతున్న పేదలు ఉన్నారు. ధనికులు, పేదల మధ్య అంతరం పెరిగిపోతోంది. దీన్ని మనం మార్చాలి. ఈ కన్నీళ్లను తుడవాలి” అంటూ ఈ వీడియోపై రాహుల్ రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే కూరగాయల మార్కెట్‌కు రాహుల్ వెళ్లినట్లు సమాచారం.
* BRS మంత్రులకు మావోయిస్టు పార్టీ హెచ్చరిక
తెలంగాణలో సంభవించిన వరదల వల్ల నష్టపోయిన వారికి తక్షణమే నష్టపరిహారం అందించాలని సీపీఐ మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు పునరావాసం కల్పించాలని, దెబ్బతిన్న ఇళ్లను తిరిగి ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ సీపీఐ (మావోయిస్ట్) పార్టీ ప్రతినిధి జగన్ ఒక ప్రటకన విడుదల చేశారు. వరదల కారణంగా రైతులు అపారంగా నష్టపోయారని, వారికి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.రియల్ ఎస్టేట్ మాఫియాలు, మంత్రుల భూ ఆక్రమణలు వీలైనంత త్వరగా ఆపాలని బీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరించారు. వరదలకు కారణం బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలే అని వీరు అంబానీ, అదానీలకు ఏజెంట్లు అని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని తెలంగాణ సీపీఐ (మావోయిస్టు) పార్టీ రాష్ట్ర కమిటీ అన్ని వర్గ, ప్రజా సంఘాలకు పిలుపునిచ్చింది.
* దుర్గమ్మని దర్శించుకున్న సాయి తేజ్, బ్రో చిత్ర బృందం
మెగా హీరోలైన పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ మూవీగా బ్రో.. సిల్వర్ స్క్రీన్ పై సందడి చేశారు. మామ అల్లుడు కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్రో’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. రిలీజైన అన్ని చోట్లా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో ‘బ్రో’ విజయోత్సవాలను చిత్ర బృందం నిర్వహిస్తోంది. దీంతో ఈ రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సుప్రీం హీరో సాయి తేజ్ సహా చిత్ర యూనిట్ దర్శించుకుంది.సాయి తేజ్ సహా చిత్ర బృందానికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించకుని, ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి చిత్రపటం, లడ్లను అందించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి తొలిసారి‘బ్రో’ సినిమాలో నటించారు. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే, తమన్ సంగీతం అందించారు. విడుదలైన అన్ని సెంటర్లలో బ్రో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.