లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అందుకున్నారు. అయితే ఈ అవార్డుతో పాటు వచ్చిన ప్రైజ్ మనీని ప్రధాని ‘నమామి గంగే మిషన్ కు అందజేస్తున్నట్టు ప్రకటించారు. పూణేలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. లోకమాన్య బాలగంగాధర తిలక్ పేరులోనే ‘గంగ’ ఉందని అన్నారు. అందుకే ఈ ప్రైజ్ మనీని నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాని తెలిపారు. ఈ అవార్డును దేశంలోని 140 కోట్ల మందికి అంకితమిస్తున్నానని ప్రకటించారు.ఇది తనకు చిరస్మరణీయ ఘట్టమని అన్నారు. తన ప్రసంగంలో హిందుత్వ సిద్ధాంతకర్త వి.డి.సావర్కర్ గురించి ప్రధాని ప్రస్తావిస్తూ.. లోకమాన్య తిలక్ సావర్కర్ ను ఇంగ్లాండు నుండి బారిస్టర్ డిగ్రీని అభ్యసించడానికి ప్రోత్సహించారని అన్నారు. భారత స్వాతంత్ర్యంలో లోకమాన్య తిలక్ పాత్ర, ఆయన చేసిన కృషిని కొన్ని మాటల్లో చెప్పలేమని తెలిపారు.
‘‘యువ ప్రతిభావంతులను గుర్తించడంలో లోకమాన్య తిలక్‌కు ప్రత్యేకమైన సామర్థ్యం ఉంది, వీర్ సావర్కర్ అలాంటి ఒక ఉదాహరణ’’ అని ప్రధాని మోడీ అన్నారు. తనకు లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును అందించినందుకు హింద్ స్వరాజ్ సంఘ్‌కి ధన్యవాదాలని తెలిపారు. కాగా.. అంతకుముందు ఎన్సీపీ నేత శరద్ పవార్ తో కలిసి ప్రధాని మోడీ ఈ అవార్డు ప్రధానోత్సవ వేదికను పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’లో ఎన్సీపీ చేరడం, ఇలాంటి పరిస్థితిలో జరిగిన ఈ కార్యక్రమంలో శరద్ పవార్, ప్రధాని మోడీ ఒకే వేధికపై కూర్చోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.