Business

ఇళ్ల కొనుగోలు దారులకు ఆర్‌బీఐ భారీ షాక్‌-TNI నేటి వాణిజ్య వార్తలు

ఇళ్ల కొనుగోలు దారులకు ఆర్‌బీఐ భారీ షాక్‌-TNI నేటి వాణిజ్య వార్తలు

* మైక్రోసాఫ్ట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా పునీత్ చందోక్‌

మైక్రోసాఫ్ట్ ఇండియా (Microsoft) కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా పునీత్ చందోక్ నియ‌మితుల‌య్యారు. చందోక్ భార‌త్‌తో పాటు ద‌క్షిణాసియాలో కంపెనీ కార్య‌క‌లాపాల‌ను ప‌ర్య‌వేక్షిస్తారు. సెప్టెంబ‌ర్ 1 నుంచి చందోక్ నూత‌న బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. చందోక్ గ‌తంలో అమెజాన్‌.కాం క్లౌడ్ డివిజ‌న్ ఏడ‌బ్ల్యూఎస్‌లో ప‌నిచేశారు.భార‌త్, ద‌క్షిణాసియా బిజినెస్‌కు ఆయ‌న సార‌ధ్యం వ‌హించారు. భార‌త్‌లో డిజిట‌ల్ మౌలిక స‌దుపాయాలు వేగంగా విస్త‌రిస్తున్నందున ఈ మిషన్ గతంలో కంటే ఇక్కడ ఇప్పుడు మరింత సందర్భోచితంగా ఉందని తాను భావిస్తున్నాన‌ని చందోక్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌, భూటాన్‌, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక స‌హా ద‌క్షిణాసియాలో మైక్రోసాఫ్ట్ బిజినెస్‌ల అనుసంధానాన్ని చందోక్ ప‌ర్య‌వేక్షిస్తారు.క్లౌడ్ టెక్నాల‌జీ మార్కెట్‌లో భారీ వాటాను ద‌క్కించుకోవ‌డంతో పాటు గ్లోబ‌ల్ ఇన్నోవేష‌న్ హ‌బ్‌గా ఎదిగిన భార‌త్‌లో మ‌రింత పెట్టుబ‌డులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ స‌న్న‌ద్ధ‌మైన క్ర‌మంలో చందోక్ నియామ‌కం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ట్విట్టర్ హెడ్ ఆఫీస్ పై ఉన్న లోగో డిస్ ప్లే తొలగింపు

కొన్ని రోజుల క్రితమే ట్విట్టర్ లోగో నుంచి బ్లూ కలర్ ఉండే పిట్టను తొలగించి.. దాని స్థానంలోకి ఎక్స్ గుర్తును అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ట్విట్టర్ ప్రధాన కార్యాలయంపై లోగో సింబల్ ను, ముందు ఏర్పాటు చేసిన డిస్ ప్లే బోర్డును తాజాగా తొలగించారు. చుట్టు పక్కల ఉండే వారప కంప్లైంట్ చేయడంతోనే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.అంతకుముందు ట్విట్టర్ హెడ్ ఆఫీస్ బిల్డింగ్ పై ఎక్స్ లోగో డిస్ ప్లే లోపల మెరిసే ప్రకాశవంతమైన లైట్లను అమర్చారు. అయితే ఆ కాంతి నేరుగా తమ ఇళ్లలోకి ప్రసరిస్తోంది.. దాని వల్ల వారి నిద్రకు ఆటంకం కలుగుతుందని 24మంది స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బిల్డింగ్ ఇన్ స్పెక్టర్లు రంగంలోకి దిగి ప్రజల సౌకర్యార్థం ట్విట్టర్ హెడ్ ఆఫీస్ పై ఉన్న లోగోను తొలగించారు.

ఇళ్ల కొనుగోలు దారులకు ఆర్‌బీఐ భారీ షాక్‌?

సొంతింటి కలల్ని నిజం చేసుకోవాలనుకునేవారికి, లేదంటే ఇప్పటికే ఇల్లు కొనుగోలు చేసి ఈఎంఐ ( equated monthly interest) చెల్లించే వారికి ఆర్‌బీఐ భారీ షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రుణ గ్రస్తులు హోంలోన్‌లపై కడుతున్న ఈఎంఐలు వచ్చే ఏడాది మార్చి వరకు తగ్గవని సమాచారం. అప్పటి వరకు రెపోరేటు (ప్రస్తుతం 6.50 శాతం) అలాగే కొనసాగనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల, ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ రాయిటర్స్‌ ఎకనమిస్ట్‌ సర్వే నిర్వహించింది. స్థిరంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఎక్కువ వడ్డీ రేట్లు మార్చి 2024వరకు కొనసాగనున్నాయని సర్వేలో ఆర్ధిక వేత్తలు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాలుగు నెలల తగ్గుదల ధోరణి కనిపించినప్పటికీ పెరిగిన ఆహార ధరల కారణంగా ద్రవ్యోల్బణం గత నెలలో 4.81 శాతానికి పెరిగింది.జూన్ సర్వేలో,ఆర్‌బీఐ మార్చి 2024 చివరి నాటికి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. కానీ ఈ అంచనాలు తలకిందులయ్యాయి. మొదటి రేటు తగ్గింపు 2024 రెండవ త్రైమాసికం వరకు ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హోం లోన్‌ ఈఎంఐ చెల్లిస్తుంటే 2024 వరకు తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. ఆర్‌బీఐ ప్రస్తుత రెపో రేటును కొనసాగిస్తున్నంత కాలం, బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదు, ఫలితంగా రుణగ్రహీతలకు ఎంఎంఐల భారం తగ్గదు. రెపో రేట్ల తగ్గింపు ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఉండవు. కాబట్టే వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు వడ్డీ రేట్లు అలాగే కొనసాగుతాయని భావిస్తున్నా’ అని అక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్‌ చీఫ్ ఎకనామిస్ట్ సుమన్ చౌధరి అన్నారు.

ఏఐ రాక‌తో 2030 నాటికి ఈ కొలువులు క‌నుమ‌రుగు

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI)తో రాబోయే రోజుల్లో కొలువుల ఊచ‌కోత త‌ప్ప‌ద‌నే ఆందోళ‌న నెల‌కొంది. ఓపెన్ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ విశేష ఆద‌ర‌ణ పొంద‌డంతో ఇంట‌రాక్టివ్ ఏఐ టూల్స్ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్ప‌టికే చాట్‌జీపీటీతో ప‌లు ఉద్యోగాలు క‌నుమ‌రుగ‌వుతుండ‌గా 2030 నాటికి ఏఐతో ల‌క్ష‌లాది ఉద్యోగాలు రీప్లేస్ అవుతాయ‌ని లేటెస్ట్ స‌ర్వే బాంబు పేల్చింది.ఏఐ టెక్నాల‌జీతో పెద్ద‌సంఖ్య‌లో ఉద్యోగాలు క‌నుమ‌రుగ‌వుతాయ‌ని, ఆయా కొలువుల‌కు హైరిస్క్ త‌ప్ప‌ద‌ని మెకిన్సే గ్లోబ‌ల్ ఇనిస్టిట్యూట్ తాజా అధ్య‌య‌నం వెల్ల‌డించింది. అమెరికాలో జాబ్ మార్కెట్‌పై ఏఐ పెను ప్ర‌భావం చూపుతుంద‌ని ఈ అధ్య‌య‌నం స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే ప‌నిచేస్తున్న ఉద్యోగులు ఏఐ రాక‌తో కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంద‌ని అంచ‌నా వేసింది.ఆర్ధిక ఆటోమేష‌న్‌కు ఏఐ దారితీస్తుంద‌ని 2030 నాటికి అమెరికా ఆర్ధిక వ్య‌వ‌స్ధ‌లో ఏఐ బ‌లీయ‌మైన శ‌క్తిగా అవ‌త‌రిస్తుంద‌ని పేర్కొంది. ఆటోమేష‌న్‌, డేటా క‌లెక్ష‌న్ వంటి ఉద్యోగాల‌ను ఏఐ స‌మ‌ర్ధంగా రీప్లేస్ చేస్తుంద‌ని పేర్కొంది. ఆఫీస్ స‌పోర్ట్‌, క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్‌, ఫుడ్ స‌ర్వీస్ ఎంప్లాయ్‌మెంట్ వంటి ప‌లు రంగాల్లో ఉద్యోగాలు ఏఐతో ప్ర‌భావిత‌మ‌వుతాయ‌ని తెలిపింది.1,60,000 క్ల‌రిక‌ల్ ఉద్యోగాలు, 8,30,000 రిటైల్ సేల్స్‌ప‌ర్స‌న్ ఉద్యోగాలు, ఏడు ల‌క్ష‌ల‌కుపైగా అడ్మిన్ జాబ్స్‌, ఆరు లక్ష‌ల‌కు పైగా క్యాషియ‌ర్ ఉద్యోగాలు క‌నుమరుగ‌వుతాయ‌ని మెకిన్సే అధ్య‌య‌నం వెల్ల‌డించింది. 1.8 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు 2030 నాటికి వేరే జాబ్‌ల‌ను వెతుక్కుంటూ విభిన్న రంగాల‌కు త‌ర‌లివెళ్లాల్సిన ప‌రిస్ధితి త‌లెత్తుతుంద‌ని అంచ‌నా వేసింది.

బ్యాంకులకు చేరిన 88 శాతం 2 వేల నోట్లు

భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మే మూడో వారంలో చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జులై చివరి నాటికి 88 శాతం రూ. 2 వేల నోట్లు బ్యాంకులు తిరిగొచ్చాయని ఆర్‌బీఐ మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. బ్యాంకులకు తిరిగి వచ్చిన పెద్ద నోట్ల విలువ రూ. 3.14 లక్షల కోట్లని తెలిపింది.ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 3.62 లక్షల కోట్లని, మే 19న ఉపసంహరణ ప్రకటన సమయంలో రూ. 3.56 లక్షల కోట్లకు తగ్గాయని ఆర్‌బీఐ వివరించింది.ప్రధాన బ్యాంకుల నుంచి లభించిన డేటా ప్రకారం, బ్యాంకులకు తిరిగి వచ్చిన మొత్తం నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో రాగా, మిగిలినవి ఇతర మార్గాల్లో మార్పిడి జరిగాయని ఆర్‌బీఐ పేర్కొంది. గడువు ముగిసే వరకు ఉన్న తర్వాత చివరి నిమిషంలో రద్దీని తగ్గించేందుకు ప్రజలు సెప్టెంబర్ 30 లోపు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను డిపాజిట్ లేదా మార్పిడి చేసుకోవాలని ఆర్‌బీఐ కోరింది.

పాన్ మసాలా, పొగాకు ఎగుమతిదారులకు షాక్

 పాన్ మసాలా, పొగాకు శరీరానికి చాలా హాని కలిగిస్తాయి. అయినా దేశంలో చాలా మంది పాన్ మసాలా, పొగాకును తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటికే దేశంలోని చాలా చోట్ల పాన్ మసాలా, పొగాకు నిషేధించబడింది. GST రూపంలో ప్రభుత్వానికి వచ్చే పాన్ మసాలా, పొగాకుపై కూడా ప్రభుత్వం పన్ను వసూలు చేస్తుంది. ఇంతలో పాన్ మసాలా, పొగాకుకు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్‌లు తెరపైకి వచ్చాయి. ఈ ఉత్పత్తులపై విధించిన జీఎస్టీకి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక సమాచారం ఇచ్చింది. దాని గురించి తెలుసుకుందాం.పాన్ మసాలా, పొగాకు, ఇతర సారూప్య వస్తువుల ఎగుమతిపై ఇంటిగ్రేటెడ్ GST (IGST) ఆటోమేటిక్ రీఫండ్ ప్రక్రియ అక్టోబర్ 1 నుండి ఆగిపోతుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. మంత్రిత్వ శాఖ ద్వారా జూలై 31న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అటువంటి వస్తువులను ఎగుమతి చేసేవారు తమ రీఫండ్ క్లెయిమ్‌లతో అధికార పరిధి పన్ను అధికారులను సంప్రదించి, వారి ఆమోదం తప్పకుండా పొందవలసి ఉంటుంది.ఈ మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎగుమతి చేసే వస్తువులు విలువైనవి కావడంతో పన్ను ఎగవేసే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పన్ను ఎగవేతను నిరోధించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు నిపుణులు తెలిపారు. ఈ క్రమంలోనే IGST వాపసు మొత్తం కూడా పెరగవచ్చు. అధికారులు రీఫండ్‌ల స్వీయ పరిశీలన ద్వారా అసెస్‌మెంట్ సాధ్యమైనంత పారదర్శకంగా.. అన్ని దశల్లో పన్ను చెల్లించబడుతుందని నిర్ధారిస్తుంది. పాన్ మసాలా, ముడి పొగాకు, హుక్కా, గుట్కా, ధూమపాన మిశ్రమం, మెంథా ఆయిల్ వంటి వాటిపై IGST వాపసు నిషేధించబడింది. ఇటువంటి వస్తువులపై 28 శాతం IGST, సెస్సులు ఉంటాయి.

హానర్ ప్యాడ్ X9 టాబ్లెట్ వచ్చేసిందోచ్

కొత్త ట్యాబ్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో (Honor Pad X9) లాంచ్ అయింది. ముందున్న వెర్షన్‌తో పోలిస్తే.. పెద్ద మెరుగైన డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ కలిగి ఉంది. ధర రూ. 14,499కు సొంతం చేసుకోవచ్చు. టాబ్లెట్ ప్రీ-ఆర్డర్ రూ.500 డిస్కౌంటు అందిస్తుంది.భారత్‌లో Honor Pad X9ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కలిగి ఉన్నారా? అయితే, 4GB RAM, 128GB స్టోరేజీతో ఒకే వేరియంట్‌లో వస్తుంది. ఈ మోడల్ ధర రూ. 14,499గా నిర్ణయించింది. టాబ్లెట్ స్లీక్ స్పేస్ గ్రే కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం, ఈ కొత్త ట్యాబ్‌ను ముందస్తుగా ఆర్డర్ చేయవచ్చు. అమెజాన్‌లో ఆగస్టు 2న అధికారిక సేల్ ప్రారంభమవుతుంది. మీరు డివైజ్ ప్రీబుక్ చేయాలనుకుంటే.. రూ. 500 డిస్కౌంట్‌తో పాటు ఫ్రీ హానర్ ఫ్లిప్ కవర్ కూడా పొందవచ్చు. సెప్టెంబరు 2022లో లాంచ్ అయిన Honor Pad X8కి సక్సెసర్ అని చెప్పవచ్చు. ఈ కొత్త టాబ్లెట్ అంతకంటే ముందున్న వెర్షన్‌తో పోలిస్తే.. అనేక అప్‌గ్రేడ్లను కలిగి ఉంది. పెద్ద, మెరుగైన డిస్‌ప్లేతో పాటు భారీ బ్యాటరీని కలిగి ఉంది.

హీరో మోటో కార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ ఇంటిపై ఈడీ దాడులు

దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తున్నది. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. హీరో మోటోకార్ప్ చైర్మన్‌పై భారీ ఆరోపణల నేపథ్యంలో ఈడీ కేసు తీవ్రంగా ఉండబోతోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో హీరో మోటార్స్ షేర్ 3 శాతం మేర పతనమైంది.

11,600 కోట్లు పెట్టి ఫ్లిప్‌కార్ట్‌లో వాటా కొన్న వాల్‌మార్ట్‌

దేశీయ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్‌ గ్లోబల్‌కు చెందిన పూర్తి వాటాను అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ కొనేసింది. 1.4 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.11,600 కోట్లు)కు ఈ మొత్తం వాటాను దక్కించుకున్నది. ఫ్లిప్‌కార్ట్‌ విలువను 35 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2.89 లక్షల కోట్లు)గా లెక్కించి ఈ డీల్‌ జరిగినట్టు చెప్తున్నారు. కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్‌ గ్లోబల్‌ నుంచి అదనపు షేర్లను కొన్నట్టు వాల్‌మార్ట్‌ ప్రతినిధి చెప్తున్నప్పటికీ, ఎంతకు కొన్నారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ‘గత కొన్నేండ్లుగా టైగర్‌ గ్లోబల్‌ సహకారం మరువలేనిది. ఫ్లిప్‌కార్ట్‌లో విలువైన భాగస్వామిగా కొనసాగింది’ అన్నారు.ఫ్లిప్‌కార్ట్‌ తొలినాళ్ల నుంచి టైగర్‌ గ్లోబల్‌ కీలక మదుపరిగానే ఉంటూ వస్తున్నది. 2009లో ఫ్లిప్‌కార్ట్‌లోకి టైగర్‌ గ్లోబల్‌ 9 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో వచ్చింది. 2018లో ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను వాల్‌మార్ట్‌ కొన్నప్పటికీ.. టైగర్‌ గ్లోబల్‌ పెట్టుబడులు మాత్రం అలాగే ఉన్నాయి. వాటాను పెంచుకునేందుకు 2021 లో అదనపు పెట్టుబడులనూ పెట్టింది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్‌ గ్లోబల్‌ వాటా దాదాపు 4 శాతానికి చేరింది. అయితే ఇప్పుడు ఆ వాటాను వాల్‌మార్ట్‌ పరమైంది. ఇదిలావుంటే ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సెల్‌ పార్ట్‌నర్స్‌ సైతం తమ 1 శాతం వాటాను వాల్‌మార్ట్‌కు సుమారు 350 మిలియన్‌ డాలర్లకు అమ్ముకున్నట్టు తెలుస్తున్నది.

మూడు నెలల కనిష్టానికి తగ్గిన తయారీ కార్యకలాపాలు

భారత తయారీ రంగ కార్యకలాపాలు జులైలో మూడు నెలల కనిష్టానికి తగ్గింది. అయినప్పటికీ కొనసాగుతున్న మెరుగైన డిమాండ్ కారణంగా భారత తయారీ రంగ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ(పీఎంఐ) 57.7 పాయింట్లకు వృద్ధి చెందింది. జూన్ నెలలో నమోదైన 57.8 పాయింట్ల కంటే ఇది అత్యల్పంగా తగ్గిందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ నెలవారీ సర్వే మంగళవారం వెల్లడించింది.డిమాండ్‌తో పాటు కొత్త ఆర్డర్లు వేగంగా పుంజుకున్నాయని, ఉత్పత్తిలోనూ స్వల్ప వృద్ధి నమోదైనట్టు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ఎకనమిక్స్‌ డైరెక్టర్ ఆండ్రూ హార్కర్ తెలిపారు. కంపెనీలు ఉపాధి, కొనుగోళ్లను పెంచినప్పటికీ తయారీ రంగంపై ద్రవ్యోల్బణ ప్రభావం ఉండటం వల్ల వృద్ధి స్వల్పంగా నెమ్మదించింది.సాధారణంగా పీఎంఐ సూచీ 50 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే వృద్ధిగానూ, తక్కువగా ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. కొత్త ఆర్డర్లు మళ్లీ పెరగడంతో తయారీ కంపెనీలు తదనుగుణంగా ఉత్పత్తిని పెంచాయి. తద్వారా కొత్త ఉద్యోగాల కల్పన జరిగినట్లు ఆండ్రూ తెలిపారు. అలాగే కంపెనీలు కొత్త ముడి సరకును సమకూర్చుకున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భారత తయారీ కంపెనీలకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.