ఈనెల 2న ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శించనున్నట్లు సమాచారం. గ్రేటర్ వరంగల్ మునిసిపాలిటీ పరిధిలో గవర్నర్ పర్యటించనున్నారు. గవర్నర్ ఉదయం 6గంటలకు రాజ్‌భవన్ నుంచి బయల్దేరి 8:30గంటలకు ఎన్ ఐటీకి చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం ఉదయం 9గంటల నుంచి 11 గంటల వరకు గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలైన జవహర్ నగర్, ఎన్టీఆర్ నగర్, ఎన్ ఎన్ నగర్, భద్రకాళి బండ్, నయీంనగర్ ఏరియాల్లో గవర్నర్ పర్యటిస్తారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హైజనిక్, క్లాత్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నిట్ కళాశాలకు చేరుకుని 12గంటలకు లంచ్ చేస్తారు. అనంతరం రాజ్ భవన్‌కు రోడ్డు మార్గంలో బయల్దేరి వెళ్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తడంతో పాటు ప్రాణ, ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లో ఒకరు వరద బాధితులు పరామర్శించేందుకు వస్తారని ప్రభుత్వ అధికార వర్గాలు భావించినా.. జరగలేదు. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ప్రథమ పౌరురాలి వరంగల్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.