తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు TSTET 2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఈమేరకు పాఠశాల విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రేపటి నుంచి ఈనెల 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబరు 15న టెట్ పరీక్ష, సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇక, బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు. టెట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ఇదిలాఉంటే, గతంలో టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేళ్ల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. తాజా అంచనాల ప్రకారం.. రాష్ట్రంలో 1.5 లక్షల డీ.ఎడ్, 4.5 లక్షల మంది బీ.ఎడ్ అభ్యర్థులు ఉన్నారు. పైగా గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్ వారికే ఇవ్వగా, ఇటీవలే బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు. తాజాగా టెట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో.. గతంలో టెట్ క్వాలిఫై అయినవారికి మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం దక్కనుండగా, కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తిచేసినవారికి కూడా పోటీపడే అవకాశం దక్కుతుంది. ఇక, తెలంగాణలో చివరిసారిగా టెట్ గతేడాది జూన్‌లో నిర్వహించారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 2
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16
పరీక్ష తేదీ: సెప్టెంబర్ 15
పేపర్-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
పేపర్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
పరీక్ష ఫీజు: రూ.400
వెబ్‌సైట్: https://tstet.cgg.gov.in