DailyDose

కేరళ బీచ్‌లో అమెరికా మహిళపై అత్యాచారం

కేరళ బీచ్‌లో అమెరికా మహిళపై అత్యాచారం

భారత్‌కు వచ్చిన అమెరికా మహిళ‌పై(44) ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తొలుత మహిళకు నిందితులు మద్యం ఇచ్చారు. ఆమె మత్తులో కూరుకుపోయాక తమతో పాటూ బైక్‌పై మరో చోటుకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, ఆమె జులై 22న భారత్‌కు వచ్చింది. కేరళలోని కొల్లమ్ జిల్లాలోని ఓ ఆశ్రమంలో నివసించసాగింది. జులై 31న ఆమె తన ఆశ్రమానికి సమీపంలోని ఓ బీచ్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు సమీపించి సిగరెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె తిరస్కరించడంతో మద్యం ఇచ్చారు. మద్యం మత్తులో ఉన్న ఆమెను తమ వెంట బైక్‌పై మరో ప్రాంతానికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. మరుసటి రోజు బాధితురాలు కరునగపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిఖిల్, జయన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై సెక్షన్ 376డి, 376(2)(ఎన్) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.