అరటిపండు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సీజన్లతో సంబంధం లేకుండా దొరికే పండ్లలో అరటిపండు కూడా ఒకటి. సాధారణంగా అరటిపండును తిని ఆ తొక్కను పారేస్తుంటాం.. కానీ అరటి తొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అరటిపండు తొక్కతో చర్మంపై ఉండే ముడతలు, మొటిమలు, మచ్చలను, గాయాల వల్ల ఏర్పడిన మచ్చలను ఈజీగా తొలగించుకోవచ్చు. మరి దాన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా.
తాజా అరటిపండు తొక్కను తీసుకుని ముఖానికి రుద్దుకుని ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు, ముడతలు వంటి సమస్యలు తగ్గుతాయి.ముఖంపై మొటిమలున్నవారు.. అరటితొక్కను రాత్రి పడుకునే ముందు ముఖానికి రుద్దుకుని, ఉదయాన్నే నీటితో కడిగివేయాలి. ఇలా రోజూ చేస్తే మొటిమలను తగ్గించుకోవచ్చు.
ఒక మిక్సీ జార్ లో నాలుగు అరటిపండు తొక్క ముక్కల్ని, చిన్న అరటిపండు ముక్క వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని.. ఒక టీ స్పూన్ బియ్యం పిండి, అర టీ స్పూన్ తేనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని.. ఆరిపోయాక నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ఏర్పడిన మచ్చలు క్రమంగా తొలగిపోతాయి.
పైన తెలిపిన మిశ్రమంలోనే నిమ్మరసం, పెరుగు కూడా కలిపి ముఖానికి రాసుకుంటే.. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. త్వరగా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
మృతకణాలు, ట్యాన్ ఎక్కువగా ఉన్నవారు బియ్యం పిండికి బదులు శనగపిండి కలుపుకుని ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. మృతకణాలు, మురికి తొలగిపోయి ముఖం అద్దంలా మెరవడం ఖాయం. ఇలా అరటిపండు తొక్క మన ముఖ సౌందర్యాన్ని పెంచడంలో కూడా తోడ్పడుతుంది.