NRI-NRT

అమెరికా సెనేట్‌ భవనాల్లో కలకలం

అమెరికా సెనేట్‌ భవనాల్లో కలకలం

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ సెనేట్‌ భవనాల్లోకి ఆయుధాలు కలిగి ఉన్న ఓ అగంతకుడు ప్రవేశించినట్లు సమాచారం రావడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ సెనేట్‌ కార్యాలయాలను తమ ఆధీనంలోకి తీసుకొని ముమ్మరంగా గాలింపు చేపట్టారు. రస్సెల్‌ సెనేట్‌ భవనం, ఇతర సెనెట్‌ భవనాల్లో జల్లెడ పట్టిన తర్వాత సాయుధుడైన వ్యక్తి ఎవరూ లేరని నిర్ధారణకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటల సమయంలో ఆయుధాలు కలిగి ఉన్న ఓ వ్యక్తి క్యాపిటల్‌ సెనేట్‌ భవనాల్లో సంచరిస్తున్నట్లు 911కి ఫోన్‌ చేసి ఎవరో సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ భవనాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వెంటనే అక్కడున్నవారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. కొందరిని బయటకు తీసుకొచ్చారు. ‘‘క్యాపిటల్‌ సెనేట్‌ కార్యాలయాల భవనాల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ ప్రాంతం సమీపంలోకి ఎవరూ రావద్దు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మీతో సమాచారం పంచుకుంటాం’’ అని క్యాపిటల్‌ పోలీసులు ట్వీట్‌ చేశారు. అనంతరం ముమ్మర గాలింపుల తర్వాత ఎలాంటి కాల్పులు చోటుచేసుకోలేదని, సాయుధుడైన వ్యక్తి ఎవరూ లేరని, భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. భయభ్రాంతులు సృష్టించేందుకు బెదిరింపు ఫోన్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోన్‌ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.