Sports

నేడే భారత్-విండీస్ తొలి టీ20

నేడే భారత్-విండీస్ తొలి టీ20

టెస్టు, వన్డే సిరీస్‌ తర్వాత భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య టీ20 పోరుకు రంగం సిద్ధమైంది. టెస్టు, వన్డే సిరీస్‌లు ఏకపక్షంగా సాగినా.. పొట్టి సిరీస్ రసవత్తరంగా సాగనుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో మెరుపులు మెరిపించే విండీస్‌ ప్లేయర్స్ ఓ వైపు.. కుర్రాళ్లతో నిండిన భారత జట్టు మరోవైపు ఉంది. టీ20ల్లో టీమిండియాకు కచ్చితంగా సవాల్‌ ఎదురుకానుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో భారత్-విండీస్ తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. నేటి రాత్రి 8 గంటలకు ఆరంభం కానున్న ఈ మ్యాచ్.. డీడీ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

వెస్టిండీస్‌తో జరగనున్న 5 టీ20ల సిరీస్‌లో సీనియర్లకు విశ్రాంతిని ఇచ్చి.. పూర్తిగా కుర్రాళ్లకు అవకాశం ఇచ్చింది బీసీసీఐ. దాంతో భారత తుది జట్టు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌ వర్మతో పాటు మరో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ టీ20 అరంగేట్రం చేసే అవకాశముంది. శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి యశస్వి ఓపెనింగ్‌ చేయనున్నాడు. ఇషాన్‌ కిషన్‌ మూడో స్థానంలో ఆడుతాడు. ఇషాన్ జట్టులో ఉంటే.. సంజు శాంసన్‌ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. తిలక్‌ వర్మ నాలుగో స్థానంలో ఆడనున్నాడు.

కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, వైస్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 5,6 స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. అక్షర్‌ పటేల్‌, కుల్దీప్ యాదవ్‌ స్పిన్‌ బాధ్యతలను పంచుకోనున్నారు. మూడో స్పిన్నర్‌ అవసరం అనుకుంటే యుజ్వేంద్ర చహల్‌, రవి బిష్ణోయ్‌లలో ఒకరిని ఎంచుకునే అవకాశం ఉంది. టెస్టుల్లో, వన్డేల్లో అరంగేట్రం చేసి మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న పేసర్ ముకేశ్‌ కుమార్ టీ20ల్లో కూడా ఆడనున్నాడు. ఇక ఉమ్రాన్‌ మాలిక్‌, అవేష్‌ ఖాన్‌లలో ఒకరు తుది జట్టులో ఉంటారు. మూడో స్పిన్నర్‌ వద్దనుకుంటే ఇద్దరు ఆడే అవకాశం ఉంది.

టీ20ల్లో విండీస్‌ వీరులు ఎంత ప్రమాదకారులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నికోలస్ పూరన్‌, కైల్‌ మేయర్స్‌, రోమన్‌ పావెల్‌, షిమ్రాన్ హెట్‌మయర్‌, జాసన్ హోల్డర్‌, రోస్టన్‌ చేజ్‌, ఒడియన్‌ స్మిత్‌, రొమారియో షెఫర్డ్‌ వంటి హిట్టర్లు జట్టులో ఉన్నారు. వీళ్లంతా ప్రమాదకారులే. ఇందులో హెట్‌మయర్‌ మినహా అందరూ ఆల్‌రౌండర్లే. ఏ సమయంలో అయినా రెచ్చిపోయే సత్తా వీరి సొంతం. నిమిషాల్లో మ్యాచ్‌ ఫలితాలను మార్చేస్తారు. కాబట్టి భారత యువ జట్టుకు సవాల్ తప్పదు.

తొలి టీ20కి ఆతిథ్యమివ్వనున్న బ్రయాన్‌ లారా స్టేడియంలోని పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. భారత్‌, విండీస్‌ చివరి వన్డే జరిగింది ఇదే మైదానంలో. బౌలర్లకు కూడా పిచ్‌ నుంచి మంచి సహకారం ఉంటుంది. పేసర్లతో పాటు స్పిన్నర్లకూ వికెట్ తీసే అవకాశం ఉంటుంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సూచనలు ఉన్నాయి.

తుది జట్లు (అంచనా):
భారత్‌: శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్‌/రవి బిష్ణోయ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌/అవేష్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌.

వెస్టిండీస్‌: కైల్ మేయర్స్‌, బ్రాండన్ కింగ్‌, షైయ్ హోప్‌, నికోలస్ పూరన్‌, షిమ్రాన్ హెట్‌మయర్‌, రోమన్‌ పావెల్‌ (కెప్టెన్‌), రోస్టన్‌ చేజ్‌, జేసన్‌ హోల్డర్‌, రొమారియో షెఫర్డ్‌/ఒడియన్‌ స్మిత్‌, అకీల్‌, అల్జారి జోసెఫ్‌.