హైదరాబాద్ నగరం నలువైపులా మెట్రో తీసుకువచ్చేందుకు తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో.. భవిష్యత్ లో ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైలు నిర్మాణం చేపడతామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి తెలిపారు. ఓఆర్ఆర్ మెట్రోను నాలుగు కారిడార్లుగా విభజించినట్లు చెప్పారు. ఓఆర్ఆర్ శంషాబాద్ జంక్షన్- తుక్కుగూడ జంక్షన్-బొంగులూరు జంక్షన్ – పెద్ద అంబర్ పేట్ జంక్షన్ వరకు 40 కిలోమీటర్లలో 5 స్టేషన్లు ఏర్పాటు చేస్తామని వివరించారు.ఈ కారిడార్ నిర్మాణానికి రూ.5,600 కోట్లు, ఓఆర్ఆర్ పెద్ద అంబర్ పేట జంక్షన్-ఘట్ కేసర్ జంక్షన్-షామీర్ పేట్ జంక్షన్-మేడ్చల్ జంక్షన్ వరకు 45 కిలోమీటర్లలలో 5 స్టేషన్లు వస్తాయని ఈ కారిడార్ నిర్మాణానికి రూ.6,750 కోట్లు, ఓఆర్ఆర్ మేడ్చల్ జంక్షన్-దుండిగల్ జంక్షన్-పటాన్ చెరు జంక్షన్ వరకు 29కిలోమీటర్లలో 3 స్టేషన్లు వస్తాయని ఈ కారిడార్ నిర్మాణానికి రూ.4,785 కోట్లు, ఓఆర్ఆర్ పటాన్ చెరు జంక్షన్- కోకాపేట జంక్షన్ -నార్సింగి జంక్షన్ వరకు 22 కిలోమీటర్లలలో 3 స్టేషన్లు ఉంటాయని ఈ కారిడార్ నిర్మాణానికి రూ.3,675 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. మొత్తం ఈ నాలుగు కారిడార్లను 136 కిలోమీటర్లలో ఏర్పాటు చేస్తామని 16 స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని, వీటి నిర్మాణానికి సుమారు రూ.20,810 కోట్లు అవసరం అవుతాయన్నారు.