జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న భారతీ సిమెంట్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెనక్కు ఇచ్చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ అభయ్ ఎస్.ఓక, జస్టిస్ సంజయ్ కరోల్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. మంగళవారం ఈ కేసు విచారణ ప్రారంభమవగానే ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. ఈ కేసులో ఎఫ్‌డీలు, బ్యాంకు గ్యారంటీల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలని న్యాయస్థానం సూచించిందని.. తాము ఎఫ్‌డీలనే ఎంచుకున్నామని చెప్పారు. బ్యాంకు గ్యారంటీలను వెనక్కు ఇచ్చేస్తామని ధర్మాసనానికి విన్నవించారు. జస్టిస్ అభయ్ ఎస్.ఓక జోక్యం చేసుకుంటూ ఎఫ్‌డీలను మీరు నగదుగా మార్చుకున్నారని ప్రతివాదులు చెబుతున్నారని ఈడీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. జస్టిస్ ఓకా స్పందిస్తూ దీనిపై పరిశీలించాల్సిన అవసరమున్నందున తాము విచారణ జరుపుతామంటూ ఎఫ్‌డీ మొత్తాన్ని వెనక్కు ఇచ్చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. బ్యాంకు గ్యారంటీలను వెనక్కు తీసుకోవడాన్ని ప్రతివాదుల స్వేచ్ఛకు వదిలిపెడుతున్నామని చెప్పారు.