తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనసభను 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. అయితే సమావేశాలు ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించారనేది ముఖ్యం కాదని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఎన్ని పని గంటలు నిర్వహించడమనేది ముఖ్యమని గుర్తించాలని మంత్రి హరీష్ రావు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తెచ్చారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదలపై రేపు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఎల్లుండి రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు బిల్లులను ప్రవేశ పెట్టనుంది. అవసరమైతే నాలుగు రోజు శాసనసభ సమావేశాలను పొడిగించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపం తెలిపిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ వాయిదా పడిన కొద్దిసేపటికి అసెంబ్లీ బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వం తరపున మంత్రులు హరీష్ రావు ,వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీజేపీకి ఆహ్వానం అందలేదు.
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు కనీసం 15 నుండి 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని కోరారు. ఏ సమస్యపైనా చర్చకు తాము సిద్దంగా ఉన్నట్టుగా ప్రభుత్వం తరపున మంత్రులు తెలిపారు. మూడు రోజుల పాటే సమావేశాలు నిర్వహించడంపై సీఎల్పీ నేత అసంతృప్తి వ్యక్తం చేశారు. పని రోజుల కంటే ఎన్ని పని గంటలు సభ జరిగిందో చూడాలని మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు సూచించారు.