ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారంనాడు స్టే ఇచ్చింది.ఇళ్ల నిర్మాణం నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇవాళ ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.అమరావతి పరిధిలో భూ పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై అమరావతి రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఏపీ హైకోర్టు తీర్పుపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ ఏడాది జూలై 24న ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాజధాని ఆర్ -5 జోన్ 47, 516 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గుంటూరు, పెద్దకాకాని,విజయవాడ, దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన పేదలకు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది.
ఆర్-5 జోన్ లో ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని అమరావతి రైతులు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో గతంలో సవాల్ చేశారు.ఆర్-5 జోన్ లో పట్టాలిచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. అయితే ఏపీ హైకోర్టు తుది తీర్పు తర్వాతే చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పులోని ఈ అంశాన్ని హైకోర్టులో విచారణ సందర్భంగా రైతుల తరపు న్యాయవాదులు ప్రస్తావించారు.ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణం విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ఈ లోపుగానే ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తే ఈ నష్టం ఎవరు భరిస్తారని కూడ విచారణ సందర్భంగా హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.