* టీ ఇవ్వడం ఆలస్యమైందని భార్య గొంతుకోసి చంపిన భర్త
మధ్యప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఉదయాన్నే ఛాయ్ ఇవ్వడం ఆలస్యమయిందని భార్యను దారుణంగా హత్య చేశాడో దుర్మార్గపు భర్త. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. టీ ఇవ్వడంలో ఆలస్యం చేశారనే ఆరోపణతో ఓ వ్యక్తి తన భార్యను గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటన గ్వాలియర్ జిల్లా పరిధిలోని తాటిపూర్ గ్రామంలో చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం, మోహిత్ రజక్ (27), అతని భార్య సాధన (22) తాటిపూర్ గ్రామంలో ఉంటున్నారు. ఈ దంపతులు ఉదయం స్థానిక ఆలయానికి వెళ్లాలనుకున్నారు. భార్య పట్టుబట్టడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది.వారిని శాంతింపజేసేందుకు కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఆ తరువాత అక్కడితో పోనివ్వకుండా.. మోహిత్ తన భార్య ఉదయం టీ ఇవ్వడం ఆలస్యం చేస్తుందని ఆరోపించడంతో దంపతులు మళ్లీ గొడవ ప్రారంభించారు.ఆ తరువాత నిందితుడు ఆమెను కొట్టడం ప్రారంభించాడని, పట్టరాని కోపంతో ఆమె గొంతుకోసి చంపాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె ఒంటిపై గాయాల గుర్తులు ఉండడంతో హత్యగా భావించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అరెస్టు చేశామని, టీ ఇవ్వడానికి ఆలస్యం చేసినందుకు తన భార్యను హత్య చేశానని నేరం అంగీకరించాడని, అయితే పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారని విశ్వవిద్యాలయ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మనీష్ ధాకడ్ తెలిపారు.
* ఫేక్ సర్టిఫికెట్స్ తో ప్రభుత్వానే బురిడీకొట్టించి
వైసిపి ప్రభుత్వం ఏర్పాటుచేసిన వాలంటీర్, సచివాలయల వ్యవస్థలపై రాజకీయ దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష టిడిపి,జనసేన పార్టీలు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ పథకాల కోసం కొందరు సచివాలయ ఉద్యోగులు అడ్డదారులు తొక్కారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించుకుని ప్రభుత్వ పథకాలను పొందుతూ సచివాలయ ఉద్యోగులు, వారికి సహకరించి ఓ వాలంటీర్ అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళితే… అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ కాలనీలో గ్రామ సచివాలయం వుంది. ఇందులో డిజిటల్ సహాయకుడిగా సుధీర్, మహిళా పోలీసులుగా బురుగుబెల్లి రాజేశ్వరి, పైలా వెంకటలక్ష్మి పనిచేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు ప్రభుత్వ పథకాలను పొందేందుకు అర్హులు కాకున్నా ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించుకున్నారు. అవివాహితుడైన సుధీర్ డిజిటల్ కీ ఉపయోగించిన పెళ్లియనట్లు ఫేక్ సర్టిఫికేట్ సృష్టించాడు. అలాగే పెళ్లయి భర్తలతో కలిసివుంటున్న రాజేశ్వరి, వెంకటలక్ష్మి విడాకులు తీసుకున్నట్లు నకిలీ పత్రాలు తయారుచేసుకున్నారు. ఈ నకిలీ పత్రాలతో పథకాలను పొందుతూ ఏకంగా ప్రభుత్వాన్నే బురిడీ కొట్టించారు ముగ్గురు ఉద్యోగులు. నకిలీ పత్రాలతో సచివాలయ ఉద్యోగులు అక్రమంగా ప్రభుత్వ పథకాలను పొందేందుకు వాలంటీర్ చొక్కాకుల నానాజీ సహకరించాడు. అయితే ఈ ఘరానా మోసాన్ని దిబ్బపాలెంకు చెందిన మరో ఉద్యోగి భయటపెట్టాడు. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ స్థానిక పంచాయితీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో ఈ ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
* ఫోన్ ఛార్జర్ పిన్ను నోట్లో పెట్టుకొని మృతి చెందిన 8 నెలల చిన్నారి
జీవితం ఎంత చిన్నది అనేది మనం చెప్పలేము.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం అతి కష్టం.. మృత్యువు ఎప్పుడు ఎలా పలకరిస్తుందో అంచనా వెయ్యలేము.. మన చేతుల్లో లేని పని.. తాజాగా ముక్కు పచ్చలు ఆరని చిన్నారి 8 నెలలకే మృత్యువు ఒడిలోకి వెళ్లింది.. మొబైల్ చార్జర్ పిన్ను నోట్లో పెట్టుకొని విధ్యుత్ ఘాతుకంతో ప్రాణాలను విడిచింది.. ఈ విషాద ఘటన కర్ణాటక లో వెలుగు చూసింది..ఈ ఘటన కర్ణాటకలోని కార్వార్ తాలూకాలో చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.వివరాల్లోకి వెళితే..కార్వార్ ప్రాంతంలో సంతోష్ హెస్కామ్ (హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ)లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.. ఆయనకు భార్య సంజన, ఎనిమిది నెలల కూతురు సానిధ్య ఉంది. అయితే ఎప్పటిలాగే ఆయన మంగళవాంర కూడా విధులకు వెళ్లే ముందు సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టారు. అనంతరం ఛార్జింగ్ తీసి విధులకు వెళ్లారు. కానీ స్విచ్చ్ ఆఫ్ చేయడం చేయడం మర్చిపోయారు. అదే సమయంలో ఇంట్లో కూతురు ఆడుకుంటోంది. ఛార్జర్ వైర్ కిందికి వేలాడుతూ ఉండటంతో ఆ పసి పాప..దానిని నోట్లో పెట్టుకుంది.ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.కానీ అప్పటికే ఆ బాలిక మరణించింది. హాస్పిటల్ కు చేరుకున్న వెంటనే చిన్నారి మరణించిందని డాక్టర్లు ప్రకటించారు. దీంతో తమ ముద్దుల కుమార్తెను కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు.. నెలల చిన్నారి కరెంట్ షాక్ తో చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి వాటి గురించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని పోలీసులు హెచ్చరిస్తున్నారు..
* ఐదేళ్ల చిన్నారిపై స్కూల్లో అత్యాచారం
జార్ఖండ్‌లోని రాంచీలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల ఏళ్ల బాలికపై ఆమె చదువుతున్న స్కూలు ఆవరణలోనే గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి ఎల్‌కేజీ విద్యార్థిని. ఈ ఘటన వెలుగులోకి రావడంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.ఈ ఘటన నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రతుల్ షా డియో రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “INDIA పాలిత రాష్ట్రంలో 5 ఏళ్ల చిన్నారిపై దారుణమైన అత్యాచారం చేసిన మరో షాకింగ్ సంఘటన. జార్ఖండ్‌లో సిఎం హేమంత్ సోరెన్ పాలనలో ఇప్పటికి 5 అత్యాచార కేసులు నమోదయ్యాయి. పసిపాపపై దారుణంగా అత్యాచారం చేసిన రాక్షసుడిని తక్షణమే అరెస్టు చేయాలి. సాధ్యమైనంత కఠిన శిక్ష విధించాలి” అని డిమాండ్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా, రాజస్థాన్ లో ఘోరమైన ఘటన వెలుగు చూసింది. దేశాన్ని కాపాడే బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న ఓ ఆర్మీ జవాన్ తన భార్య, కూతురిని దారుణంగా హతమార్చాడు. వారు నిద్రపోతుండగా చంపేశాడు. ఆ తరువాత దానిని ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. అతడిని మంగళవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడు రామ్ ప్రసాద్ ఆదివారం తెల్లవారుజామున ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోస్ట్‌మార్టం నివేదికలో వారిద్దరినీ ముందు గొంతు నులిమి చంపి, తరువాత కాల్చడంతో.. తీవ్రమైన కాలిన గాయాలతో మరణించినట్లు తెలిందని.. దీంతో అతడిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.
* ఎమ్మెల్యే ఊళ్లోకి రావొద్దంటూ ఫ్లెక్సీలు
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. మా ఊరికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ రావొద్దంటూ గ్రామస్తులు ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. బీఆర్ ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నించగా.. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. రంగంలోకి దిగిన పోలీసుల ఇరువర్గాలకు నచ్చ జెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు.
* మహిళని బెదిరించి 22 లక్షలు దోచేశాడు
బెంగళూరులో ఒక విచిత్రమైన దోపిడీ జరిగింది. ఫోన్‌లో ఒక మహిళ మాట్లాడిన ‘ఎఫైర్’ మాటలు విని.. క్యాబ్ డ్రైవర్ ఆమెను బెదిరించి, రూ.22 లక్షలు దోచేశాడు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని హర్సగట్టకు చెందిన కిరణ్ ఒక క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గతేడాది డిసెంబర్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న వివాహిత.. ఇంద్రానగర్ నుంచి బనస్వాడాకి ఒక క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో.. ఆ మహిళ తన ఫోన్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న మాటల్ని విన్నాడు.కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత ఆ క్యాబ్ డ్రైవర్ కిరణ్ ఆమెకు ఒక మెసేజ్ చేశాడు. తనని తాను చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్న అతను.. తాను ఆర్థిక సమస్యల్లో ఉన్నానని, కొంచెం డబ్బు అవసరం ఉందని అడిగాడు. అప్పుడు ఆమె వెంటనే అతని బ్యాంక్ అకౌంట్‌కి రూ.22 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసింది. కొన్ని రోజులు గడిచాక అతడు తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ కాదని తెలుసుకున్న ఆ మహిళ.. అతనితో మాట్లాడటం మానేసింది. కానీ.. కిరణ్ మాత్రం ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తాను చెప్పినట్టు చేయకపోతే.. నీకు మరొకరితో ఎఫైర్ ఉందన్న విషయం నీ భర్తకు చెప్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆమె.. అతడు అడిగినట్లుగానే ఈ నెల ఏప్రిల్‌లో తన బంగారం (750 గ్రాములు) మొత్తం ఇచ్చేసింది.కొన్ని రోజులు గడిచాక ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో.. భర్త ఆమెను నిలదీశాడు. అప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ గురించి ఆమె తన భర్తకు వివరించింది. ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్‌లో ఆ క్యాబ్ డ్రైవర్‌పై ఫిర్యాదు నమోదు చేసింది. తనని బెదిరించి రూ.22 లక్షలతో పాటు 750 గ్రాముల బంగారం దోచుకున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. క్యాబ్ డ్రైవర్ కిరణ్‌ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
* వైయస్‌ఆర్ జిల్లాలో వాలంటీర్ల చేతివాటం
పింఛన్ల పంపిణీలో వాలంటీర్లు చేతివాటం ప్రదర్శించారు. లబ్ధిదారులకు అందించాల్సిన నగదులో కోత విధించారు. వైయస్‌ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠం మండలం ముడుమాళ్ల, సిద్దయ్యమఠం తదితర గ్రామాల్లో పింఛనుదారులకు రూ.2,750 ఇవాల్సి ఉండగా.. రూ 2,700 మాత్రమే పంచారు. పింఛనుదారులు ప్రశ్నించగా కార్యాలయ ఖర్చులు, వేలిముద్రల యంత్రాల మరమ్మతు కోసమని తెలిపినట్లు సమాచారం. కోత విధించిన వాలంటీర్లను తాత్కాలికంగా విధులనుంచి తొలగించామని ఎంపీడీవో వెంగమునిరెడ్డి తెలిపారు. పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.
* పెద్దపెల్లి జిల్లాలో క్షుద్ర పూజల కలకలం
మండలంలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. గురువారం ఉదయాన్నే చిన్నారాతుపల్లి-మొట్లపల్లి గ్రామాల రహదారి మూలపై క్షుద్ర పూజ చేసిన ఆనవాళ్లు కనిపించాయి. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరికాయలతో పూజ చేసి పంది పిల్లను బలి ఇచ్చారు. ఉదయాన్నే అటువైపుగా వెళ్లిన ప్రయాణికులు, గ్రామస్తులు భయాందోళన గురయ్యారు. కాగా, గత కొన్నాళ్లుగా ఆదివారం, బుధవారం వచ్చిందంటే చాలు గ్రామ కూడల్లో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు దర్శనం ఇస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, క్షుద్ర పూజలు పాల్పడుతున్న వారిని పట్టుకోని శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
* భద్రత లేని ప్రైవేట్ పాఠశాల బస్సు
అనుభవం లేని డ్రైవర్లు.. అర్హత లేని క్లీనర్లు.. నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు.. డ్రైవర్ లైసెన్స్ ఉందా..? బస్సు కండిషన్ ఎలా ఉంది..? విద్యార్థుల భద్రకు తీసుకున్న చర్యలు ఏమిటి..? అనే విషయాల్లో నిరంతరం తనిఖీలు చేపట్టాల్సిన అధికారుల మామూళ్ల మత్తు.. వెరసి విద్యార్థుల ప్రాణాలు గాలిలో దీపంలా మారుతున్నాయి.రోజురోజుకూ ప్రైవేట్ స్కూల్స్, కళాశాల బస్సుల్లో ప్రయాణం దినదిన గండంగా మారుతోంది. ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఏదైనా ప్రైవేట్ పాఠశాల వద్దకు వెళ్లి విద్యార్థులను తీసుకొచ్చే బస్సులను గమనిస్తే గుండె ఆగిపోవడం ఖాయం. బాక్స్‌లో అన్నం కుక్కినట్లు చిన్నారులను బస్సుల్లో కుక్కి తీసుకొస్తున్న తీరు అశ్చర్యపరుస్తుంది.తమ పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లాడిపోయే తల్లిదండ్రులు వారిని పాఠశాలకు తరలించే బస్సుల విషయం మాత్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. బస్సు డ్రైవర్‌కు లైసెన్స్ ఉందా..? బస్సు కండిషన్‌లో ఉందా..? లేదా అనే విషయాలను పట్టించుకోవడం లేదు.
* కలకలం సృష్టిస్తున్న అమ్మాయిల వరుస మిస్సింగ్
ఒకే రోజు నలుగురు అమ్మాయిల మిస్సింగ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది. జిల్లాలోని వేరు వేరు ప్రాంతాల్లో అమ్మాయిలు కనబడకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అమ్మాయిల మిస్సింగ్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తిరుపతి జిల్లా నారాయణవనంకు చెందిన మౌనిక బుధవారం రాత్రి నుండి కనిపించడం లేదు. ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడంతో పాటు బంధువుల ఇంటికేమైనా పోయిందేమోనని కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇక చిత్తూరు పట్టణంలోనూ ఇలాగే మరో యువతి కనిపించకుండా పోయింది. చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే రితిక గురువారం నుండి కనిపించడం లేదు.ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే చిత్తూరు జిల్లా వి.కోట ప్రాంతానికి చెందిన కోమల, పుంగనూరుకు చెందిన ఝూన్సీ కూడా బుధవారం నుంచి కనిపించడం లేదు. ఇలా ఒకేరోజు నలుగురు అమ్మాయిలు మిస్సవడం అనేక అనుమానాలకు రేకెత్తిస్తోంది. అమ్మాయిలను ఎవరైనా కిడ్నాప్ చేసి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా? లేక అమ్మాయిలే ఎక్కడికైనా వెళ్ళారా? ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారా? అన్న అనేక అనుమానాలు కలుగుతున్నాయి.బిడ్డలు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ అమ్మాయిల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అమ్మాయిల వివరాల పంపించి అలెర్ట్ చేశారు. నలుగురు అమ్మాయిలను క్షేమంగా ఇంటికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు గురువారం దిశ ప్రతినిధికి తెలిపారు.