Politics

పార్లమెంటులో మరోసారి నెహ్రూపై కామెంట్లు:అమిత్ షా

పార్లమెంటులో మరోసారి నెహ్రూపై కామెంట్లు:అమిత్ షా

అధికారంలోని బీజేపీ ప్రభుత్వం పలుమార్లు దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను, ఆయన విధానాలను తప్పుపట్టిన సంగతి తెలిసిందే. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వల్లే ఇప్పటికీ దేశంలో సమస్యలు ఉన్నాయని ఆరోపించింది కూడా. కాంగ్రెస్ పై విమర్శలు సంధించడానికి నెహ్రూను కేంద్ర ప్రభుత్వం పలుమార్లు పార్లమెంటులో తెర మీదికి తెచ్చిన దాఖలాలు ఉన్నాయి. అయితే, ఈ సారి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇందుకు భిన్నంగా సానుకూలంగా ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్ నేతలు షాక్ అయ్యారు. ఈ ఆసక్తికర పరిణామం గురువారం పార్లమెంటులో చోటుచేసుకుంది.

ఢిల్లీ సర్వీసుల బిల్లును లోక్ సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ, మెజార్టీ కలిగిన ఎన్డీయే సులువుగానే ఆమోదించుకోగలిగింది. ఈ బిల్లుపై చర్చిస్తున్న సందర్భంలో అమిత్ షా తన వాదనలకు బలం చేకూర్చడానికి తొలి ప్రధాని నెహ్రూను ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి వెంటనే నిలబడి హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు.‘ఈ రోజు నేను పార్లమెంటుకు వచ్చిన తర్వాత అమిత్ షా పలుమార్లు నెహ్రూను, కాంగ్రెస్ పార్టీని తరుచూ ప్రశంసించడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. అసలు నేను ఏం చూస్తున్నా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఇది పగలా? రేయా? వెంటనే నాకేం అనిపించిందంటే.. అమిత్ షా వద్దకు పరుగెత్తి ఆయన నోటిలో స్వీట్ పెట్టాలని అనిపించింది. ఎందుకంటే.. ఆయన నోటి నుంచి నెహ్రూ, కాంగ్రెస్ పార్టీలపై ప్రశంసలు వినడం మంచిగా అనిపించింది’ అని అధిర్ రంజన్ చౌదరి అన్నారు.

దీనికి వెంటనే అమిత్ షా లేచి.. తాను పండిట్ జవహర్ లాల్ నెహ్రూను పొగడలేదని, కేవలం ఆయనను ఉటంకించానని వివరించారు. దాన్నే వారు ప్రశంసలుగా తీసుకుంటే తనకే మీ అభ్యంతరం లేదని అన్నారు. దీనికి అధిర్ రంజన్ చౌదరి వెంటనే కౌంటర్ ఇచ్చారు.‘మీకు అవసరం పడినప్పుడు జవహర్ లాల్ నెహ్రూ సహాయం తీసుకుంటారు. కానీ, మీరు ఆయనలా వ్యవహరిస్తే ఇప్పుడు మనం మణిపూర్, హర్యానాలో ఇలాంటి దుర్ఘటనలు చూసి ఉండేవారం కాదు. ఇది ఢిల్లీ, ఇది మన హృదయం’ అని అధిర్ రంజన్ చౌదరి అన్నారు. అమిత్ షా, రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి.