శుక్రవారం బండి సంజయ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ నియామకం జరిగింది. ప్రతిగా బండి సంజయ్‌ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. బండి సంజయ్ అధికారికంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే ముందు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి ముందు బండి సంజయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోడీని అంతకుముందు రోజు కలిశారు.
కాగా బండి సంజయ్ హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 3:30గంలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్‌కు చేరుకోనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ క్యాడర్, బండి అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎయిర్పోర్ట్ నుండి ర్యాలీగా ఎస్‌ఆర్ క్లాసిక్ గార్డెన్స్‌కు బీజేపీ జాయతీ ప్రధాన కార్యదర్శి వెళ్లనున్నారు. సాయంత్రం శంషాబాద్ ఎస్సార్ క్లాసిక్ గార్డెన్స్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో బండి పాల్గొంటారు.
త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మక ప్రణాళిక రచించడంపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ఈ లక్ష్యంలో భాగంగా, పార్టీలో సంస్థాగత మార్పులు ప్రారంభించబడ్డాయి, ఇది అనేక రాష్ట్రాలలో అధ్యక్షుల భర్తీకి దారితీసింది. ఇక బండి ఏపీ రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది.