* తల్లిని చంపిన కొడుకు
మద్యం తాగేందుకు తల్లిని డబ్బులు అడిగే ఇవ్వకపోవడంతో కుమారుడు కృరంగా మారాడు.. డబ్బులు ఇవ్వడం లేదంటూ కోపంతో తల్లిని కొడవలితో కొట్టి చంపిన ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం తొగిటలో ఇవాళ (శుక్రవారం) జరిగింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. తోగిట గ్రామానికి చెందిన పుస్థి నర్సమ్మ వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆమెకు ఇద్దరి పిల్లలు భాను ప్రసాద్, బాలు ఉన్నారు.అయితే, భాను ప్రసాద్ నిన్న (గురువారం) రాత్రి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తల్లిని అడిగారు.. ప్రతి సారి డబ్బుల కోసం వేదిస్తుండడంతో మనీ ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. దీంతో తల్లి కొడుకుల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇక, కోపంతో ఊగిపోయిన కొడుకు భాను ప్రసాద్ తల్లిపై కొడవలితో దాడి చేయగా తీవ్ర గాయాలైన ఆమె రక్తపు మడుగుల్లో కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. విషయం తెలుసుకున్న హావేలి ఘనపూర్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఐదు సంవత్సరాల క్రితం భాను ప్రసాద్ తో కలిసి నరసమ్మ తన తల్లిని బాలమ్మను ఆస్తికోసం ఇంటిపై నుంచి తోసేసి హత్య చేసిన కేసులో జైలుకెళ్లి వచ్చిన భానుప్రసాద్.. మళ్లీ ఇప్పుడు మద్యం కోసం తల్లిని చంపడంపై స్థానికంగా ఈ హత్యలపై చర్చించుకుంటున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
* మహిళ అంత్యక్రియల్లో చితిపై నాగుపాము
ఇటీవల కాలంలో టెక్నాలజీ ఎంత అభివృద్ది చెందినా కానీ చాలా మంది మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. భూతవైద్యులను నమ్ముతూ వారి చెప్పిందల్లా పాటిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ఝార్ఖాండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళకు పాము కాటు వేయగా ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో కాసేపటికి మరణించింది. దీంతో పగ తీర్చుకోవాలని పామును కూడా ఆమె చితిపై పెట్టి అంత్యక్రియలు నిర్వహించారు.వివరాల ప్రకారం..ఝర్ఖాండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో 37 ఏళ్ల వివాహి సుగియా దేవి కుటుంబంతో కలిసి జీవిస్తుంది. అయితే ఒకరోజు పాలిథిన్ బ్యాగ్‌లోంచి చక్కెర తీస్తుండగా అకస్మాత్తుగా ఓ నాగుపాము ఆమెను కాటేసింది. దీంతో మహిళ గట్టిగా అరవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించకుండా భూతవైద్యుడుని పిలిపించారు. అతడు రాత్రంత తనదైన శైలిలో చికిత్స చేయడంతో ఆమె కన్ను మూసింది. ఆ గ్రామ ప్రజలు నాగుపామును బంధించి చంపేశారు. మహిళను పామును ఒకే చితిపై పెట్టి అంత్యక్రియలు చేశారు.
* విజయనగరంలో కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి
ఆంధ్ర ప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. గురువారం నాడు విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సోమన్నపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. దీనిమీద విజయనగరం సిఐ ఉపేంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.పాండ్రంకి రామినాయుడు అనే వ్యక్తి సోమన్నపేటలో కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆయన చిన్నకొడుకు కేసరి (22) ఇసుకను పై అంతస్తుకు తీసుకువెడుతుంటే ఇనుప చువ్వలు అడ్డంగా ఉన్నాయి. వాటిని అడ్డు తొలగించడం కోసం కాలితో పక్కకి నెట్టాడు. అవి ఇంటి దగ్గర్లో ఉన్న కరెంటు తీగలకు తగిలాయి. వెంటనే కరెంట్ షాక్ రావడంతో కేసరి కొట్టుకోసాగాడు.అదే గ్రామానికి చెందిన కేసరి స్నేహితుడు గండ్రేటి చంద్రశేఖర్ (18) సామాగ్రి తరలించేందుకు సహాయం కోసం వచ్చాడు. కేసరికి కరెంట్ షాక్ తగలడంతో గట్టిగా అరుస్తూ అతడిని రక్షించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో చంద్రశేఖర్ కు కూడా కరెంట్ షాక్ కొట్టింది. ఈ మొత్తం ఘటనను ఎదురుగా ఉన్న అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తున్న దూబరేయ్యమ్మ (57) చూసింది. కుర్రాళ్ళు ఇద్దరు షాక్ తో విలవిలలాడుతుండడంతో కాపాడడం కోసం ప్రయత్నించింది. దీంతో ఆమె కూడా కరెంట్ షాక్ కు గురైంది.ఈ హడావుడి అంతా గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్ సరఫరాను ఆపడానికి ప్రయత్నించారు. ఆ ముగ్గురుని రక్షించాలని చూశారు. కానీ, అప్పటికే ఆ ముగ్గురు చనిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలుముకున్నాయి. ఈ విషాద ఘటనపై స్పందించిన రాజాం ఎమ్మెల్యే కంబాల జోకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
* నీట్ కోచింగ్ సెంటర్‌లో విద్యార్ధి ఆత్మహత్య కలకలం
దేశ వ్యాప్తంగా గత కొంతకాలంగా విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్ధి రాసిన సూసైడ్ నోట్ ప్రతి ఒక్కరినీ కంటనీరు పెట్టిస్తోంది. సూసైట్ నోట్‌లో తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. రాజస్థాన్‌లోని కోటా నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..రాజస్థాన్‌లోని కోటా సిటీలోని ఓ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నీట్ పరీక్షకు సిద్ధమవుతోన్న మంజోత్ సింగ్ (18) గురువారం (ఆగస్టు 3) తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యార్ధి గదిలోని గోడపై మూడు లెటర్లను అతికించాడు. సూసైడ్ నోట్‌లలో ఏముందంటే.. ‘సారీ’ అని ఓ నోట్‌లో రాశాడు. నేను నా ఇష్టాను సారంగానే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారు. దయచేసి నా తల్లిదండ్రులు, స్నేహితులను ఇబ్బంది పెట్టవద్దని సూసైడ్‌కి ముందు మంజోత్ రాసిన మరో లెటర్‌లో పేర్కొన్నాడు. మూడో లెటర్‌లో ‘హ్యాపీ బర్త్ డే పాపా’ అంటూ రాశాడు. ఉన్నట్టుండి విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడం చర్చణీయాంశంగా మారింది.మంజోత్ తెలివైన విద్యార్థి అని, సరదాగా కలుపుగోలు తనంతో ఉండేవాడని తోటి స్నేహితులు పోలీసులకు చెప్పారు. మంజోత్ మెరిట్ స్టూడెంట్. 12వ తరగతిలో దాదాపు 93 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందాడు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించే సాధారణ పరీక్షలలో కూడా రాణించేవాడని వారు తెలిపారు.
* బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు గిరిజన వ్యక్తిపై గన్‌తో కాల్పులు
బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఒక గిరిజన వ్యక్తిపై గన్‌తో కాల్పులు జరిపాడు (BJP MLA’s Son Opens Fire). దీంతో గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సింగ్రౌలికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రామ్ లల్లూ వైశ్య కుమారుడు వివేకానంద గురువారం సాయంత్రం 6 గంటలకు కారులో వెళ్తున్నాడు. ఒక ఆలయం సమీపంలోని ఇరుకైన రోడ్డులో కారుకు అడ్డుగా ఉన్న కొందరితో ఘర్షణకు దిగాడు. ఈ సందర్భంగా సూర్య కుమార్ ఖైర్వార్ అనే గిరిజన వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. కుడి చేతికి బుల్లెట్ గాయం కావడంతో అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కాగా, ఈ సంఘటనకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు వివేకానందపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే బాధిత గిరిజన వ్యక్తి కుల ధ్రువీకరణ పత్రం చూపించనందుకు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్‌ను కేసులో చేర్చలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు వివేకానంద గత ఏడాది జూలైలో కూడా అటవీ శాఖ సిబ్బందిని బెదిరించేందుకు గన్‌తో కాల్పులు జరిపాడు. దీనిపై కేసు నమోదు కావడంతో కొంతకాలం కనిపించకుండా పోయాడు. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక కోర్టులో లొంగిపోయాడు. అయితే బెయిల్ వచ్చే వరకు 45 రోజుల పాటు వైద్య కారణాలతో పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యాడు. అనంతరం హైకోర్టు నుంచి బెయిల్ పొందిన వివేకానంద, తాజాగా గిరిజన వ్యక్తిపై గన్‌తో కాల్పులు జరిపాడు.
* రాజస్థాన్‌లో 9వ తరగతి బాలిక కిడ్నాప్
రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాలో ఓ బాలికను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ తరువాత ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. 9వ తరగతి చదువుతున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో ముగ్గురు వ్యక్తులపై బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ మేరకు దోవర స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) హేమంత్ చౌహాన్ వివరాలు తెలిపారు.నిందితుల్లో బాలికకు పరిచయం ఉన్న వ్యక్తి కూడా ఉన్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.ఎఫ్ఐఆర్ ప్రకారం, బుధవారం బాలిక యధావిధిగా పాఠశాలకు బయలుదేరింది. ఆ సమయంలో నిందితులు ఆమెను కిడ్నాప్ చేసి.. కారులో అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు, అక్కడ వారు ఆమెపై అత్యాచారం చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఓ వ్యక్తికి ఫోక్సో చట్టం కింద 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీంతో పాటు 50వేల జరిమానా కూడా విధించారు. బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో ఆటో డ్రైవర్ కు ఈ మేరకు శిక్ష విధిస్తూ గురువారం నాడు తీర్పు వెలువడింది. విశాఖలోని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జీ ఆనందిని ఈ మేరకు గురువారంనాడు తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించలేని పక్షంలో అదనంగా మరో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారని తీర్పు ఇచ్చారు.
* రోడ్డు దాటుతున్న తండ్రీ కూతుళ్లను ఢీకొట్టిన లారీ
పశ్చిమ బెంగాల్లోని బెహలాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా, అతని తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం 7 గంటలకు బెహలాలోని బరిషా హైస్కూల్ ముందు రోడ్డు దాటుతుండగా చిన్నారి, అతని తండ్రిని మట్టి లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, స్థానిక ప్రజలు చిన్నారి తండ్రిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. జరిగిన ప్రమాదం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. దీని ఫలితంగా డైమండ్ హార్బర్ రోడ్‌లో భారీ నిరసనలు జరిగాయి. నిరసనకారులు పోలీసు కారుకు, బైక్‌కు నిప్పు పెట్టడంతో నిరసన తీవ్ర రూపం దాల్చింది. అలాగే లారీ డ్రైవర్ నుంచి పోలీసులు లంచం తీసుకుని విడిచిపెట్టారంటూ ఆందోళనకారులు ప్రభుత్వ బస్సును ధ్వంసం చేశారు.
* Haryana violence : మసీదుల్లో శుక్రవారం ప్రార్ధనలు రద్దు
హరియాణలో (Haryana violence) హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లోని మసీదుల్లో శుక్రవారం ప్రార్ధనలు రద్దు చేశారు. ప్రజలు ఇండ్లలోనే నమాజ్ చేసుకోవాలని కోరారు. నుహ్, గురుగ్రాం సహా హరియాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన మత ఘర్షణల్లో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే.అల్లర్లు చెలరేగిన నుహ్, గురుగ్రాం సహా ఇతర ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. హింస ప్రజ్వరిల్లిన ప్రాంతాల్లోని మసీదుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. హింసతో అట్టుడికిన గురుగ్రాంలో శుక్రవారం ప్రార్ధనలు రద్దు చేశామని నగర ముస్లిం కౌన్సిల్ పేర్కొంది. ప్రజలు ఇండ్లలోనే నమాజ్ చేసుకోవాలని అభ్యర్ధించింది.ఈనెల 1న కొందరు దుండగులు గురుగ్రాం సెక్టార్ 57లోని ఓ మసీదును దగ్ధం చేసి ఇమాంను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఇక వీహెచ్‌పీ ప్రదర్శన సందర్భంగా అల్లర్లు చెలరేగిన నుహ్‌లోనూ మసీదుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం ప్రార్ధనలు ఇండ్లలోనే ముగించాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.
* గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడి
మండల పరిధిలోని దిమ్మదుర్తి గ్రామంలో శుక్రవారం గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. తనిఖీల్లో భాగంగా గ్రామంలోని డాబాపై రహస్యంగా గుడుంబా తయారి కోసం సిద్ధంగా ఉన్న 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై రవికుమార్ తెలిపారు. గ్రామానికి చెందిన శివరాత్రి చిన్న రాజన్నపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం అన్ని గ్రామాల్లో తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా గుడుంబా తయారు చేసినా, అమ్మినా.. చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది నరేందర్, రషీద్, ముత్యం ప్రకాష్ వెంకటేష్, ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.
* లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోలీసులు
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఐదుగురు కానిస్టేబుళ్లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. లంచం తీసుకున్న వారిని నిర్థోషులు ప్రకటించడమేంటని అనుకుంటున్నారా? ఆ కేసు రెండు, మూడేళ్ల క్రితంది కాదు.. దాదాపు 37 ఏళ్ల నాటి కేసు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఒక్క సాక్షిని కూడా హాజరుపరచలేదు.అదే సమయంలో గత 10 సంవత్సరాలుగా ఈ కేసులో జరుగుతున్న విచారణలో కేసు డైరీని కూడా సమర్పించలేదు. దీంతో ఈ కేసులో నిందుతులుగా ఉన్న ఐదుగురు కానిస్టేబుళ్లను నిర్దోషులుగా విడుదల చేయాలని కోర్టు తీర్పు వెల్లడించింది. పాత విషయాన్ని ఎక్కువ రోజులు పెండింగ్‌లో ఉంచకూడదు. అందుకే సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదలయ్యారు.
కేసు వివరాలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. 1986 జూన్ 10న రాత్రి సమయంలో భాగల్‌పుర్ పరిధిలోని ఓ చెక్‌పోస్ట్ వద్ద ఐదుగురు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.వారు వచ్చి వెళ్లే వాహనాల నుండి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారనే విషయం అప్పటి బెగుసరాయ్ జిల్లా ఎస్పీకి రహస్య సమాచారం అందింది. ఈ మేరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న పోలీసులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ఎస్పీ ప్లాన్ వేశారు.ఈ క్రమంలో ఎస్పీ రెండు రూపాయల నోటుపై సంతకం చేసి.. ఓ లారీ డ్రైవర్ కు ఇచ్చారు. పోలీసులు లంచం అడిగితే.. ఆ నోటును లంచంగా ఇవ్వాలని ఆ లారీ డ్రైవర్ కు చెప్పాడు. అనుకున్న విధంగానే ఆ లారీ డ్రైవర్ ఆ నోటును పోలీసులకు లంచంగా తీసుకున్నారు. ఈ క్రమంలో ఎస్పీ వెంటనే చెక్‌పోస్ట్ వద్ద వద్దకు వెళ్లి కానిస్టేబుల్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జేబులో నుంచి తాను సంతకం చేసిచ్చిన నోటును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఐదుగురు పోలీసులు కైలాష్ శర్మ, రామ్ రతన్ శర్మ, రామ్ బాలక్ రాయ్, గియానీ శంకర్ సింగ్,యుగేశ్వర్ మహ్తోలపై కేసు నమోదు చేశారు.