శాసనసభలో ప్రతిపక్షాల తీరుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సభ 30 రోజులు నిర్వహించాలని డైలాగులు కొడుతారు.. కానీ సభలో 30 నిమిషాలు కూర్చునే ఓపిక లేదు అని కేటీఆర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిన్న బీఏసీ సమావేశం జరిగింది అని కేటీఆర్ గుర్తు చేశారు. శాసనసభ సమావేశాలు 30 రోజులు జరపాలని బీజేపీ నాయకుడు ఉత్తరం రాశాడు. కాంగ్రెసోళ్లేమో 20 రోజులు జరపాలని డిమాండ్ చేశారు. కానీ ప్రశ్నోత్తరాల సమయంలో మేమందరం ఉన్నాం.. కానీ కాంగ్రెస్, బీజేపీల నుంచి ఒకరి చొప్పున మాత్రమే సభలో ఉన్నారు. దీన్ని బట్టి వీరికి ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది. ప్రజల పట్ల వీరికున్న ప్రేమ, అభిమానం తెలుస్తుంది. బయటనేమో డైలాగులు.. 20 రోజులు కావాలి.. 30 రోజులు కావాలి అని. కానీ 30 నిమిషాలు కూర్చొనే ఓపిక లేదు వీళ్లకు. వీళ్లను ప్రజలు కూడా గమనిస్తున్నారు. వీళ్ల సంగతేందో ప్రజలే చూసుకుంటారని కేటీఆర్ పేర్కొన్నారు.