రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ (RTC) కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా తమ వద్దే అట్టిపెట్టుకోవడాన్ని నిరసిస్తూ.. శనివారం రెండు గంటల పాటు బస్సులను నిలిపివేయాలని కార్మికులు నిర్ణయించారు. దీంతో ఎక్కడికక్కడ డిపోల ముందు ధర్నాలు చేయనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనాన్ని (RTC govt merger) అడ్డుకునేలా ఉన్న బీజేపీ వైఖరిపై మండిపడుతున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అడ్డుపడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. గవర్నర్ బిల్లును ఆమోదించకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ఇప్పటికే పలు కార్మిక సంఘాలు హెచ్చరించాయి.గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆర్టీసీ బిల్లును ఆమోదించకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీలో ఉన్న 43,373 మంది కుటుంబాలలో కేసీఆర్ వెలుగులు నింపితే.. గవర్నర్ మాత్రం అంధకారం నింపేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం సరికాదన్నారు. ఇది 43 వేల మంది ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు. గవర్నర్ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మా జీవితాలలో వెలుగులు నింపే ఈ బిల్లును వెంటనే ఆమోదించాలన్నారు. లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికులంతా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలను చేపడతామని, అవసరమైతే రాజ్ భవన్ ముట్టడికి కూడా వెనకాడమని థామస్ రెడ్డి హెచ్చరించారు.