DailyDose

సిసోడియాకు దక్కని ఊరట-TNI నేటి తాజా వార్తలు

సిసోడియాకు దక్కని ఊరట-TNI నేటి తాజా వార్తలు

 సిసోడియాకు దక్కని ఊరట

మద్యం పాలసీ కేసు (Excise policy Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ (AAP) నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia )కు ఊరట లభించలేదు. ఈడీ (ED), సీబీఐ (CBI) విచారణ చేపడుతున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi excise policy)కి సంబంధించిన కేసుల్లో ఆయన దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) వాయిదా వేసింది.ఈ కేసుల్లో సిసోడియా బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భార్య అనారోగ్యం కారణంగా తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సిసోడియా తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. సిసోడియా సతీమణి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెను చూసుకునేందుకు వెళ్లడం కోసం మానవతా దృక్పథంతో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు.దీంతో న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం సిసోడియా భార్య వైద్య రికార్డులను పరిశీలించింది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అందువల్ల, ఈ కేసుల్లో సాధారణ బెయిల్ పిటిషన్‌లతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మధ్యంతర బెయిల్ పిటిషన్‌లను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు విచారణను సెప్టెంబరు 4కు వాయిదా వేసింది.

* రాహుల్ గాంధీకి సుప్రీంలో ఊరట

ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపేరు వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఇవాళ భారీ ఊరట లభించింది. సూరత్ కోర్టు తీర్పు పై తాజాగా స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్ట శిక్ష విధింపులు ట్రైల్ కోర్టు సరైన కారణం చూపించలేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయం తెలిపింది.కాగా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరును వ్యాఖ్యానిస్తూ.. రాహుల్ గాంధీ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో… కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎంపీ పదవి పోవడమే కాకుండా ఆయనకు జైలు శిక్ష కూడా విధించింది సూరత్ కోర్టు. అయితే ఈ కేసులో తాజాగా సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది.

మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అద్భుతం

మంగళగిరి  లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పెద కోనేరులో పూడిక తీత పనులు దాదాపుగా పూర్తయ్యాయి. 152 అడుగుల వరకూ పూడకతీత కొనసాగింది. అధికారుల సమక్షంలో గత ఆరు నెలలుగా పూడికతీత పనులు చేస్తున్నారు. అయితే, పూడిక తీసే సమయంలో విలువైన వస్తువులు బయటపడ్డాయి. పురాతన కాలం నాటి రాగి, బంగారు చెంబులు, గ్లాసులు, కొన్ని చిన్న చిన్న దేవుడి ప్రతిమలు, నాణాలు బయట పడ్డాయి. వీటిల్లో జర్మనీలో తయారు చేసిన రెండు గ్లాసులున్నాయి. వాటిని తిరిగి దేవాలయ అధికారులకు అప్పగించారు.పెద కోనేరు అద్భుతమైన నిర్మాణం. ఎనిమిది వందల ఏళ్ల క్రితం నిర్మించినట్లు భావిస్తున్నారు. పైనుండి శ్రీ చక్రం ఆకారంలోనూ, కింద శంఖం ఆకారంలోనూ కోనేరు ఉంది. ఇకపోతే కోనేరు పూడిక తీత పనుల్లో ఆంజనేయస్వామి ఆలయం బయటపడింది. ఆ తర్వాత మెట్లపై చెక్కిన రెండు శివ లింగాలు, గణేషుడి విగ్రహం, మరొక హనుమంతుడు విగ్రహం కూడా బయటపడ్డాయి. ఇంకా అద్భుతం ఏంటంటే.. కోనేరులో ఒక సొరంగ మార్గం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ కోనేరు క్రమంగా కుంచించుకుపోతుండటంతో అప్రమత్తమైన అధికారులు.. ఈ పురాతన కోనేరును పరిరక్షించేందుకు పూడికతీత పనులు చేపట్టారు.

మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం

మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నయారిట్​ రాష్ట్రంలో ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు భారతీయులు సహా 18మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. 23మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. నయారిట్​ రాష్ట్ర రాజధాని టెపిక్​కు సమీపంలోని బరాంక బ్లాంకాలో స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42మంది ఉన్నట్టు సమాచారం. టిజువానా ప్రాంతానికి బస్సు వెళుతుండగా.. లోయలో పడిపోయింది. మృతుల్లో భారతీయులు, డొమెనిక్​ రిపబ్లిక్​, ఆఫ్రికెన్​ దేశస్థులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  మృతదేహాలను వెలికితీశారు. కాగా.. మృతదేహాలను గుర్తించేందుకు కష్టంగా ఉందని తెలుస్తోంది.  మరోవైపు మెక్సికో బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేప్టటారు. మలుపులు ఉన్న రోడ్డుపై డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడటే మెక్సికో రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.  త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. బస్సులో ఉన్నవారందరూ వలస వచ్చిన వారని తెలుస్తోంది. మరణించిన వారిలో ఆరుగురు భారతీయులు ఉన్నారని సహాయక సిబ్బందిలో ఒకరు తెలిపారు.

మార్గదర్శి కేసు:ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురయింది. ఈ సంస్థకు చెందిన కేసులను తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీకి బదిలీ చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసు న్యాయపరిధి అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. మరోవైపు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదంటూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కేసును విచారించి తీర్పును వెలువరించే స్వేచ్ఛను తెలంగాణ హైకోర్టుకే వదిలేస్తూ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.

ఇండిగో విమానంకు తప్పిన పెను ప్రమాదం

దేశీయ విమానయాన సంస్థ ‘ఇండిగో’కు చెందిన ఓ విమానంకు పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్‌ అయిన 3 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం పట్నా విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఇంజిన్‌ వైఫల్యం కారణంగానే.. విమానం టేకాఫ్‌ అయిన మూడు నిమిషాలకే అత్యవసరంగా దించేశారు. దాంతో ఇండిగో విమానంలో ఉన్న వారు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.అధికారుల వివరాల ప్రకారం… పట్నాలోని జయప్రకాశ్‌ నారాయణ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈరోజు ఉదయం ఇండిగో 6ఈ 2433 నంబర్ విమానం ఢిల్లీకి బయల్దేరింది. టేకాఫ్‌ అయిన 3 నిమిషాలకే విమానంలోని ఒక ఇంజిన్‌ పని చేయలేదు. ఇది గమనించిన పైలట్‌.. వెంటనే ఏటీసీకి సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన ఏటీసీ అధికారులు విమానాన్ని అత్యవసరంగా (ఎమర్జెన్సీ ల్యాండింగ్‌) దించేశారు. ఉదయం 9.11 గంటలకు విమానం ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. దాంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.ప్రస్తుతం పట్నాలోని జయప్రకాశ్‌ నారాయణ్‌ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలన్నీ సజావుగానే సాగుతున్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులను మరో విమానంలో ఢిల్లీ పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జులైలో కూడా ఓ ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన గంటకు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయింది. టైర్‌ పేలి ఉంటుందన్న అనుమానంతో ప్యారిస్‌ బయల్దేరిన విమానాన్ని వెనక్కి మళ్లించి.. ఢిల్లీలో అత్యవసరంగా దించేశారు.

జగన్‌ది జైలు లైఫ్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి పేద ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వైకాపా నేతలపై వేసిన పరువునష్టం కేసు విషయమై కోర్టులో లోకేశ్‌ వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మంగళగిరి తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని జగన్‌ అధికారంలోకి వచ్చారని విమర్శించారు.‘‘జగన్‌ది జైలు లైఫ్‌ అయితే నాది కాలేజ్‌ లైఫ్‌. నేను ఏ ఆరోపణ చేసినా ఆధారాలతోనే చేస్తా. నేను తప్పు చేస్తే కచ్చితంగా మా నాన్నే జైలుకు పంపుతారు. సీఎం జగన్ ఓ నియంత.. తల్లిని, చెల్లిని బయటకు పంపారు. మాపై చేసిన ఆరోపణల్లో ఒక్కటీ నిరూపించలేకపోయారు. మేం ఏ తప్పూ చేయలేదు.. అందుకే ఒక్కటీ నిరూపించలేకపోయారు. జగన్ మాదిరిగా తండ్రిని అడ్డుపెట్టుకుని పత్రిక, వ్యాపారాలు చేయలేదు. చట్టాన్ని ఉల్లంఘించి కేసులు పెడితే ఊరుకునేది లేదు. నేనెవరినీ వదిలిపెట్టను.. మీడియాపైనా పరువునష్టం కేసులు పెడతాను’’ అని లోకేశ్‌ హెచ్చరించారు.

 రాహుల్ కు మరో శుభవార్త

రాహుల్ గాంధీ రాహుల్ కు మరో శుభవార్త..లోకసభ సభ్యత్వం పునరుద్దరణ కానున్నట్లు సమాచారం అందుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపేరు వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఇవాళ భారీ ఊరట లభించింది. సూరత్ కోర్టు తీర్పు పై తాజాగా స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.గరిష్ట శిక్ష విధింపులు ట్రైల్ కోర్టు సరైన కారణం చూపించలేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయం తెలిపింది. ఇది ఇలా ఉండగా, ఏ క్షణంలోనైనా రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోకసభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అధికారికంగా సుప్రీంకోర్టు “స్టే” ఉత్తర్వులు అందగానే నోటిఫికేషన్ జారీ చేయనుంది లోకసభ సెక్రటేరియట్. సుప్రీం కోర్టు స్టే ఉత్తర్వులు తో సోమవారం నుంచి సభా కార్యక్రమాలకు హాజరుకానున్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్, ప్రతిపక్షాల కూటమి “ఇండియా” ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం పై వచ్చే మంగళవారం నుంచి గురువారం జరిగే చర్చలో పాల్గొననున్నారు రాహుల్ గాంధీ.

కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు

ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ (Rudraparayag) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ యాత్ర (Kedarnath Yatra) మార్గంలో గౌరీకుండ్ (Gaurikund) వద్ద కొండ చరియలు (Landslide) విరిగిపడ్డాయి. బండరాళ్లు దూసుకెళ్లడంతో అక్కడ కొన్ని షాపులు నేలమట్టమయ్యాయి. దుకాణ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. మరికొంత మంది గల్లంతైనట్లు అధికారులు భావిస్తున్నారు.ఘటనతో జాతీయ విపత్తు దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సహాయక చర్యలు ప్రారంభించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఓవైపు భారీ వర్షం, మరోవైపు కొండలపై నుంచి జారి పడుతున్న బండరాళ్ల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో కొందరు పర్యాటకులు తప్పిపోయినట్లు వెల్లడించారు.గల్లంతైన వారు వినోద్ (26), ములాయం (25), అషు (23), ప్రియాంషు చమోలా (18), రణబీర్ సింగ్ (28), అమర్ బోహ్రా, అనితా బోహ్రా, రాధిక బోహ్రా, పింకీ బోహ్రా, పృథ్వీ బోహ్రా (7), జటిల్ (6), వకీల్ (3)గా గుర్తించినట్లు తెలిపారు. గత రాత్రి నుంచి గౌరీకుండ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం ఈ ప్రమాదానికి దారితీసింది. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు.

 బిజెపి ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయి:రేవంత్‌

న్యాయం గెలిచింది.. బిజెపి ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పై బిజెపి నేతలు వేసిన కేసులలో సుప్రీం కోర్టుస్టే ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచింది.. బిజెపి ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయి..కుట్ర పూరితంగా రాహుల్ గాంధీ ఎంపీ.. పదవిపై అనర్హత వేటు వేయడం, అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించడం లాంటి చర్యలు దుర్మార్గం అన్నారు రేవంత్‌ రెడ్డి.సుప్రీం కోర్టు తీర్పు పట్ల దేశంలో హర్షాతిరేకం వ్యక్తం అవుతోందని… న్యాయం గెలిచింది. ప్రజల్లో చట్టం, న్యాయం పట్ల మళ్ళీ విశ్వసం పెరిగిందని వివరించారు. బిజెపి కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలు రాహుల్ గాంధీకి అండగా నిలిచారని చెప్పారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపేరు వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఈరోజు భారీ ఊరట లభించింది. సూరత్ కోర్టు తీర్పు పై తాజాగా స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.