* నోకియా కేసులో సుప్రీంలో ఒప్పోకు ఎదురుదెబ్బ!
పేటెంట్ ఉల్లంఘన కేసులో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పోకు (Oppo) సుప్రీంకోర్టులో (Supreme court) ఎదురుదెబ్బ తగిలింది. నోకియా (Nokia) దాఖలు చేసిన ఈ కేసులో గతంలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. దేశీయంగా జరిపిన విక్రయాల ద్వారా వచ్చిన మొత్తంలో 23 శాతం నగదును డిపాజిట్ చేయాలని ఆదేశించింది. దిల్లీ కోర్టు ఆదేశాలు పాటించేందుకు ఒప్పోకు మూడు వారాలు గడువు ఇచ్చింది. పది రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.నోకియా పేటెంట్ టెక్నాలజీని వినియోగించుకునేందుకు ఒప్పో.. ఆ సంస్థతో 2018లో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, 5జీ డివైజులకు టెక్నాలజీని వాడుకునేందుకు అనుమతి లేదు. దీనికి తోడు ఒప్పందం గడువు ముగిశాక కూడా టెక్నాలజీని ఒప్పో వినియోగించుకుందని నోకియా పేర్కొంది. ఇలా దాదాపు 7 కోట్ల డివైజులను దేశీయంగా విక్రయించినా.. ఆ సంస్థ ఒక్క రూపాయి కూడా తమకు రాయల్టీ రూపంలో చెల్లించలేదని పేర్కొంది. ఇదే విషయమై దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దేశీయంగా జరిపిన విక్రయాల ద్వారా వచ్చిన 23 శాతం మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కోర్టు ఒప్పోను ఆదేశించింది. దీనిపై ఒప్పో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నోకియా పేర్కొంటున్న మూడు పేటెంట్లలో రెండు పేటెంట్లు వేరే జురిడిక్షన్లలో రిజెక్ట్ అయ్యాయని పేర్కొంది. అయితే.. తమ టెక్నాలజీ ఆధారంగానే హార్డ్‌వేర్ ప్రొడక్షన్ చేపట్టిందంటూ నోకియా పేర్కొని.. ఒప్పో వాదనలను తిప్పికొట్టింది. ఇప్పటికే ఐటీ శాఖ, డీఆర్‌ఐ పరిశీలనలో ఉన్న ఒప్పో సంస్థ సొమ్ము డిపాజిట్ చేయడం ముఖ్యమని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో దిల్లీ హైకోర్టు వాదనలను సమర్థిస్తూ ఒప్పో పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దిల్లీ హైకోర్టు విచారణ జరుపుతున్నందున తాము కలగజేసుకోవడం సబబు కాదని అభిప్రాయపడింది. గతంలో ఇదే వ్యవహారంలో జర్మనీలో ఒప్పో నిషేధం ఎదుర్కొంది.
* టయోటా వెల్ ఫైర్‌లో కొత్త వెర్షన్
వెల్‌ఫైర్ మోడల్‌లో కొత్త వెర్షన్‌ను టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) లాంచ్ చేసింది. రెండు వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉండగా, ధర రూ.1,19,90,000 నుంచి స్టార్టవుతోంది. వైట్, జెట్ బ్లాక్ కలర్స్‌లో ఈ బండి అందుబాటులో ఉంది. అప్‌గ్రేడెడ్ వెర్షన్‌లో వెహికల్ డయాగ్నోస్టిక్స్, డ్రైవర్ మానిటరింగ్ అలర్ట్స్, ఎమెర్జెన్సీ సర్వీసెస్ వంటి 60 కనెక్టెడ్ ఫీచర్లను చేర్చారు. ఆరు ఎస్‌ఆర్‌ఎస్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.కామెట్ ఈవీలో స్పెషల్ ఎడిషన్ ‘ది గేమర్ ఎడిషన్’ ను ఎంజీ మోటార్ ఇండియా లాంచ్ చేసింది. పాపులర్ గేమర్ మోర్టల్ (నమన్ మాథుర్) ఈ కారును డిజైన్ చేశారు. ఇప్పటికే ఉన్న కారు ధరకు అదనంగా రూ.64,999 చెల్లించి ఈ స్పెషల్ ఎడిషన్‌ను కొనుక్కోవచ్చు. ఎంజీ వెబ్‌సైట్, డీలర్‌షిప్‌ల దగ్గర ఎంజీ కామెట్ ఈవీని బుక్ చేసుకోవచ్చు.
* ఆ పథకాలతో పొదుపు మంత్రం పక్కా సక్సెస్
భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా అనుకోని ఆపద సమయాల్లో ఆసరాతో పాటు రిటైర్మెంట్ సమయంలో భరోసా ఉంటుందని అందరూ చెబుతూ ఉంటారు. అలాగే పొదపు విషయానికి వస్తే భారతీయులకు అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి, అయితే వాటిలో రెండు అత్యంత ప్రజాదరణ పొందినవి ఉన్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్),ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) పథకాలు భారతదేశంలో ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందాయి. ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నప్పటికీ అవి జీవిత బీమా కేటగరీలోకి వెళ్తాయి కాబట్టి పొదుపు చేసే వారు వీటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
* భారత్‌లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే?
ప్రపంచ కుబేరుడు ‘ఎలాన్ మస్క్’ (Elon Musk) భారతదేశంలో టెస్లా (Tesla) కంపెనీ ప్రారంభించనున్నట్లు గత కొన్ని రోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ సంస్థ కోసం టేబుల్‌స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.నివేదికల ప్రకారం, ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ కోసం పూణే విమాన్ నగర్‌లోని పంచశీల్ బిజినెస్ పార్క్‌లో కార్యాలయ స్థలాన్నిఅద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే టెస్లా బృందం గత వారం ఎలక్ట్రిక్ కార్ల విక్రయానికి సంబంధించిన ప్రోత్సాహకాలను, ప్రయోజనాలను గురించి వాణిజ్య, పరిశ్రమల మంత్రిని కలిసినట్లు తెలుస్తోంది.భారతదేశంలో టెస్లా యూనిట్ త్వరలోనే ఏర్పాటు కానున్నట్లు సమాచారం. సుమారు 5,580 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఆఫీస్ స్పేస్ కోసం నెలకు అద్దె రూ. 11.65 లక్షల వరకు ఉండనుంది. అద్దె 2023 అక్టోబర్ 01 నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ ఈ స్పేస్‌ను 5 సంవత్సరాలు లీజుకి తీసుకున్నట్లు, ప్రస్తుతం సెక్యూరిటీ డిపాజిట్ కోసం రూ. 34.95 లక్షలు చెల్లించనున్నట్లు సమాచారం. ఆ తరువాత ఈ గడువును పెంచుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.పూణేలోని పంచశీల్ బిజినెస్ పార్క్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇది అంతర్జాతీయ విమానాశ్రయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కాగా గతంలో ఒక సారి బెంగళూరులో అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీలు తయారు చేయడానికి ఒక ఫ్యాక్టరీ కూడా ఏర్పాటుచేయాలని సంస్థ యోచిస్తోంది.
* రైల్వే ప్రయాణికులకు శుభవార్త
మీరు కూడా ఇంటర్నేషనల్ టూర్ చేయాలనుకుంటున్నారా..! మీ బడ్జెట్ ఎక్కువ కాకపోయినా పర్వాలేదు, ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే IRCTC మీ అందరికీ ఒక తీపి కబురునందిస్తోంది. భారతీయ రైల్వే తన ప్రయాణీకులకు ప్రతిసారీ శుభవార్తలను అందిస్తోంది. ఇప్పుడు IRCTC టూర్ ప్యాకేజీ అంతర్జాతీయ టూర్ ప్యాకేజీని పరిచయం చేస్తోంది. ఈ ప్యాకేజీతో మీరు చాలా తక్కువ ధరలో విమాన, హోటల్, భోజన సౌకర్యం పొందుతారు. అవును.. భారతీయ రైల్వే ఈ ప్రత్యేక ప్యాకేజీతో మీరు విదేశాలకు వెళ్లాలనే మీ కలను సులభంగా సాకారం చేసుకోవచ్చు. దీని ప్రకారం ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన బాలిని సందర్శించేందుకు రైల్వే శాఖ కొత్త టూర్ ప్యాకేజీని రూపొందించింది.బాలి, ఇండోనేషియా దాని అందమైన బీచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బీచ్‌లో నిర్మించిన ప్రసిద్ధ చారిత్రక దేవాలయాలు, సాంప్రదాయ సంగీతం, నృత్యాలను చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడకు రావడం ప్రారంభించారు. బాలి ద్వీపం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ద్వీపాలలో ఒకటి. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు, నూతన వధూవరులు ఇక్కడకు వస్తారు. మీరు కూడా అలాంటి అందమైన ప్రదేశాన్ని అన్వేషించాలనుకుంటే, IRCTC ఇప్పుడు టూర్ ప్యాకేజీని పొందవచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూద్దాం.IRCTC బాలి టూర్ ప్యాకేజీ 5 రాత్రులు, 6 రోజులు లక్నో నుండి ఆగస్టు 11న ప్రారంభమవుతుంది. ఈ అంతర్జాతీయ టూర్ ప్యాకేజీకి “అమేజింగ్ బాలి” అని పేరు పెట్టారు. ఈ చౌక ప్యాకేజీలో, IRCTC మీకు అల్పాహారం, భోజనం, రాత్రి భోజనాన్ని కూడా అందిస్తుంది. మీరు IRCTC బాలి టూర్ ప్యాకేజీని ఆస్వాదించాలనుకుంటే, మీరు లక్నో విమానానికి చేరుకోవాలి.
* సహారా డిపాజిటర్లకు నిధులు విడుదల చేసిన అమిత్ షా
సహారా గ్రూప్‌నకు (Sahara Group) చెందిన నాలుగు కోపరేటివ్ సొసైటీల్లో ప్రజలు దాచుకున్న సొమ్మును తిరిగి ఇచ్చే ప్రక్రియను కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు కేంద్రం ఏర్పాటు చేసిన సహారా రిఫండ్ పోర్టల్ (CRCS-Sahara Refund Portal)లో నమోదు చేసుకున్న వారిలో 112 మంది డిపాజిటర్లకు తొలి విడతలో భాగంగా రూ. 10 వేల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు ఈ పోర్టల్ ద్వారా 18 లక్షల మంది రిఫండ్ కోసం నమోదు చేసుకున్నారు. సహారాకు చెందిన నాలుగు కోపరేటివ్ సొసైటీల్లో డబ్బు పోగొట్టుకున్న డిపాజిటర్లకు తిరిగి ఆ సొమ్ము ఇవ్వాలని ప్రధాని మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా అమిత్ షా తెలిపారు. ‘‘కోపరేటివ్‌ల లక్ష్యాన్ని బలోపేతం చేయాలంటే.. వాటిపై ప్రజలకు నమ్మకం కలిగించాలి. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం దేశ ప్రజలు కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్మును కాపాడటం ప్రభుత్వం బాధ్యత’’ అని షా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో డిపాజిటర్లు క్లెయిమ్ చేసిన మొత్తం నగదును పొందుతారని తెలిపారు.సహారా గ్రూప్ సంస్థ సెబీ వద్ద డిపాజిట్ చేసిన రూ.24,979 కోట్ల నుంచి రూ.5,000 కోట్లను సహారా గ్రూప్ కో-ఆపరేటివ్ సొసైటీస్ డిపాజిటర్లకు చెల్లించడానికి సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో అనుమతిచ్చింది. ఆ మొత్తం సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీస్ ఖాతాలో జమ అయ్యింది. ఈ మొత్తాన్ని రానున్న 9 నెలల్లో 10 కోట్ల మంది మదుపరులకు తిరిగి చెల్లిస్తామని కేంద్రం అప్పట్లో తెలిపింది. ఇందులో భాగంగా గత నెల 18న అమిత్ షా రిఫండ్ పోర్టల్‌ను ప్రారంభించారు. రూ.10వేల వరకు డిపాజిట్లు చేసిన వారికి తొలుత చెల్లింపులు చేశాక క్రమంగా ఆ మొత్తాన్ని పెంచుకుంటూ వెళతామని అప్పట్లో అమిత్ షా చెప్పారు.ఈ పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలంటే ఆధార్‌తో అనుసంధానం అయిన రిజిస్ట్రేషన్ నంబర్, ఆదార్ అనుసంధానం అయిన బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అని పేర్కొన్నారు. రిఫండ్ మొత్తం ఆయా ఖాతాల్లో జమ అవుతుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి దగ్గర్లోని కామన్ సర్వీసు సెంటర్లను ఆశ్రయించొచ్చని డిపాజిటర్లకు షా సూచించారు.
* భారీగా పతనమైన వెండి ధర
దేశంలో వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. కేజీ వెండి రూ. 2300 తగ్గి.. రూ. 75,000కి చేరింది. గురువారం ఈ ధర రూ. 77,300గా ఉంది. ప్రస్తుతం100 గ్రాముల వెండి ధర రూ. 7,500గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 78,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్‌కతాలో రూ. 75,000.. బెంగళూరులో రూ. 76,000గా ఉంది.
* లేఆఫ్స్ ప్రకటించిన బెంగళూర్ స్టార్టప్
సంభవ్ జైన్, కుష్ తనేజా స్ధాపించిన బెంగళూర్‌కు చెందిన ఫిన్‌టెక్ యాప్ ఫ్యామ్ పలువురు ఉద్యోగులను విధుల నుంచి (Layoffs) తొలగించింది. వేటుకు గురైన 18 మంది ఉద్యోగులకు మరో చోట ఉపాధి లభించేలా బాధిత ఉద్యోగులకు సహకరిస్తామని కంపెనీ వ్యవస్ధాపకులు పేర్కొన్నారు. ఫ్యామ్ వంటి ఉద్యోగులను ఆదరించే సంస్ధ సిబ్బందిని తొలగించడం బాధాకరమని, వీరి పట్ల కంపెనీ సానుభూతితో వ్యవహరిస్తుందని వారు వృత్తిపరంగా ఎదిగేందుకు, మరో ఉద్యోగంలో కుదురుకునేందుకు సహకరిస్తుందని ఫౌండర్ సంభవ్ జైన్ ట్వీట్ చేశారు.కంపెనీ ఎదుగుదల కోసం వీరంతా కష్టపడి పనిచేశారని, వీరిని వదులుకోవడం విచారకరమైన కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తనేజా ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. తమ టీమ్‌ల్లో నైపుణ్యం కలిగిన వ్యక్తుల కోసం అన్వేషించే సంస్ధలు తమ ఉద్యోగులను నియమించుకోవాలని తనేజా రిక్రూటర్లకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఫౌండర్ల ట్వీట్‌పై యూజర్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది.ఓవైపు లేఆఫ్స్‌కు దిగుతూ మరోవైపు తాము ఉద్యోగుల పక్షమని ఎలా చెబుతారని పలువురు ట్విట్టర్ యూజర్లు ప్రశ్నించారు. ఉద్యోగుల పట్ల ఏ కంపెనీ అయినా సానుభూతితో వ్యవహరిస్తే ఇలాంటి సంక్లిష్ట సమయంలో వారిని విధుల నుంచి తొలగించదని మరో యూజర్ రాసుకొచ్చారు.
* యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్
టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి చెందిన కొత్త ఐఫోన్ వస్తోందంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు .ప్రతీ ఏడాది సెప్టెంబరులో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్‌లో యాపిల్ ఈ సందడి ఉంటుంది. ఈ సందర్భంగా యాపిల్ తన కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తుంది. ఈ క్రమంలో కొత్త ఫ్లాగ్‌షిప్‌లను లాంచ్‌లపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా రానున్న ఐఫోన్ 15 లాంచింగ్ డేట్ లీక్‌అయింది. రానున్న యాపిల్ బిగ్ ఈవెంట్‌కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజా లీక్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో ,ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఎప్పుడు లాంచ్ చేయబడుతుందో తేదీ బహిర్గతమైంది. సాధారణంగా ఈ ఈవెంట్‌ను తేదీని యాపిల్ లీక్‌కాకుండా చివరి గంట వరకూ ఉత్కంఠ రేపుతుంది.తాజా నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 13న యాపిల్ ఈవెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్ 13న లీవ్ తీసుకోవద్దని కంపెనీ తన ఉద్యోగులను కోరినట్టుతెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ 7 ఈవెంట్ బుధవారం జరిగినప్పటికీ, ఐఫోన్ ప్రకటనలలో ఎక్కువ భాగం మంగళవారాల్లోనే జరిగాయి. సెప్టెంబరు 13 బుధవారం నాడు వస్తుంది కాబట్టి, ఈ ఏడాది స్పెషల్ ఈవెంట్‌కూడా అప్పుడే ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది.
* అదరకొట్టిన ఎస్‌బీఐ
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మొదటి త్రైమాసిక ఫలితాలను (Q1 Results) శుక్రవారం ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రెండింతలకు పైగా లాభాన్ని నమోదు చేసింది. స్టాండ్‌లోన్ పద్ధతిలో రూ.16,884 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదు చేసుకున్న రూ.6,068 కోట్లతో పోలిస్తే లాభం 178 శాతం వృద్ధి నమోదైంది. బ్యాడ్ లోన్స్ తగ్గడం, వడ్డీ ఆదాయం మెరుగవ్వడం ఇందుకు దోహదం చేశాయి.ఇక సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.1,08,039 కోట్లకు పెరిగిందని ఎస్‌బీఐ తెలిపింది. గతేడాది ఇదే సమయంలో రూ.74,989 కోట్లుగా ఉందని బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.72,676 కోట్ల నుంచి రూ.95,975 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు (NPA) 3.91 శాతం నుంచి 2.76 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు ఒక శాతం నుంచి 0.71 శాతానికి తగ్గాయి. ఇక ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ.7,325 కోట్ల నుంచి రూ.18,537 కోట్లకు చేరింది. అలాగే మొత్తం ఆదాయం రూ.94,524 కోట్ల నుంచి రూ.1,32,333 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు విలువ శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో 2.93 శాతం మేర క్షీణించి రూ.573.20 వద్ద స్థిరపడింది.