అది మధ్య ప్రాచ్యంలోని ఒక పురాతన స్థావరం. ఫ్రాన్స్‌లోని కోట్ డి అజూర్ యూనివర్సిటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు 2018లో తవ్వకాలు జరుపుతుండగా ఒక చిన్నపిల్లల సమాధి బయట పడింది. అందులోని అస్థిపంజరంపై ఒక హారం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఇటీవల జోర్డాన్‌లో గల ఒక నియోలిథిక్ విలేజ్ (7,400–6,800 BCE) సమీపంలో, అలాగే బాజా వద్ద ఒక సిస్ట్ రకం సమాధిని ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. ఇక్కడ ఖననం చేయబడి, అస్థిపంజరంగా మారిన ఒక ఎనిమిదేళ్ల వయస్సుగల వ్యక్తి ఛాతీ, మెడపై 2,500 కంటే ఎక్కువ పూసలతో పొదిగిన ఒక పురాతన రాతి నెక్లెస్ ఉన్నట్లు గుర్తించారు. ఆ వ్యక్తి దవడ ఆకారం ఆధారంగా, అస్థిపంజరం అమ్మాయిది అయి ఉంటుందని అంచనా వేశారు.తవ్వకాల్లో రెండుచోట్ల బయటపడిన పురాతన రాతి హారాలతోపాటు పూసల సాంద్రతలో డబుల్ హోల్స్గల రాక్ లాకెట్స్, చెక్కబడిన మదర్-ఆఫ్-పెర్ల్ రింగ్స్ కూడా కనుగొనబడ్డాయి. ఆ ఆభరణాల వెనుకున్న చరిత్రను విశ్లేషించిన పురావస్తు శాస్త్రవేత్తలు, అవి ‘చనిపోయిన పిల్లల ఆభరణాలు’ అని పేర్కొన్నారు. 9000 ఏళ్ల కిందట మధ్య ప్రాచ్యంలో మృతి చెందిన పిల్లల సమాధులలో ఇటువంటి ఆభరణాలు ఉంచి ఖననం చేయడాన్ని అప్పటి ప్రజలు సామాజిక హోదాగా పరిగణించేవారని పేర్కొన్నారు. ఆ సెంటిమెంట్ చాలా చోట్ల ఇప్పటికీ కొనసాగుతోందట. ఈ విషయం తెలుసుకున్న ఫ్రాన్స్‌కు చెందిన ఆభరణాల వ్యాపారస్తులు నాటి పురాతన హారాన్ని మల్టీ – రో నెక్లెస్ పేరుతో రీ డిజైన్ చేయగా ప్రజెంట్ మార్కెట్లో దానికి మంచి డిమాండ్ పలుకుతోందట. మిడిల్ ఈస్ట్ ప్రజలు ఈ హారాన్ని చనిపోయిన తమ ఆత్మీయుల సమాధిలో ఉంచి ఖననం చేయడాన్ని ఇప్పటికీ పుణ్య కార్యంగా భావిస్తూ, సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.