Devotional

తితిదే ఛైర్మన్‌గా భూమన నియామకం

తితిదే ఛైర్మన్‌గా భూమన నియామకం

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి (Bhumana Karunakar reddy) నియమితులయ్యారు. భూమన కరుణాకర్‌ రెడ్డి రెండేళ్ల పాటు తితిదే(TTD) ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. గతంలోనూ భూమన తితిదే ఛైర్మన్‌గా చేశారు. ఛైర్మన్‌గా నియమించిన సీఎం జగన్‌కు ఈ సందర్భంగా భూమన ధన్యవాదాలు తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు పర్యాయాలు తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం ఇవాళ్టి(ఆగస్టు 5)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తితిదే నూతన ఛైర్మన్‌గా కరుణాకర్‌రెడ్డికి అవకాశం లభించింది. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా నందలూరు మండలం ఈదరపల్లెలో భూమన జన్మించారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా పొందారు. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్‌రెడ్డి గతంలోనూ తితిదే ఛైర్మన్‌గా పనిచేశారు. వైఎస్‌ హయాంలో 2006 నుంచి 2008 వరకు తితిదే ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2012 ఉప ఎన్నికలో, 2019 సాధారణ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైకాపా తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.