ఒకప్పుడు అమెరికా, యూరప్ దేశాలకు పరిమితమైన పేగు పూత వ్యాధి (ఇన్ఫ్లెమేటరీ బౌల్ డీసీజ్-ఐబీడీ) మన దేశంలోనూ విజృంభిస్తున్నట్లు తాజాగా తేలింది. 2006లో 0.1 శాతం ఉన్న కేసులు ప్రస్తుతం 5.4 శాతానికి పెరిగినట్లు హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) వైద్యుల అధ్యయనంలో తేలింది. ఈ వివరాలు తాజాగా ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెట్ రీజినల్ హెల్త్-ఆగ్నేయాసియాలో ప్రచురితమయ్యాయి. 2020 నుంచి 2022 మధ్య పట్టణ అవుట్ పేషెంట్ క్లినిక్లు, గ్రామీణ ఆరోగ్య శిబిరాలు, మొబైల్ కేంద్రాల ద్వారా 31 వేల మంది రోగులను పరీక్షించారు. ఉదర అల్ట్రాసౌండ్, కొలనోస్కోపీ పరీక్షల్లో ఈ సమస్యను గుర్తించారు. రోగుల సరాసరి వయసు 44 సంవత్సరాలు. ఇదే సంస్థ 2006లో నిర్వహించిన సర్వేలో 0.1 శాతం ఐబీడీ ఉన్నట్లు గుర్తించింది.
ఐబీడీ ఎందుకంటే..జంక్, ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం వినియోగం పెరగడం; అధిక మసాలాలు, వేపుళ్లు, పదేపదే వాడిన నూనెతో వండిన పదార్థాలు తీసుకోవడం వల్ల పేగు పూత సమస్య (ఐబీడీ) వస్తుంది.
జంక్ ఆహారం మంచి బ్యాక్టీరియాను దెబ్బతీస్తుంది. హాని చేసే బ్యాక్టీరియాలు, ఫంగస్ పైచేయి సాధిస్తాయి.
బాధితుల్లో రక్త విరేచనాలు, పొత్తి కడుపు నొప్పి, బరువు కోల్పోవడం, తరచూ మలవిసర్జన, జ్వరం, రక్తహీనత, ఆందోళనలాంటి లక్షణాలుంటాయి. ఒకటి, రెండో దశలోనే చికిత్స తీసుకోకుంటే తీవ్ర సమస్యగా మారుతుంది.
ఆహార అలవాట్లు మార్చుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు ఇతర పీచు ఉన్న ఆహారం మేలు.