ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పక్క రాష్ట్రంలోని చంద్రబాబు, జగన్‌కు అర్థమైంది. కానీ రాష్ట్రంలోని విపక్షాలకు అర్థం కావడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. పల్లె, పట్టణ ప్రగతిపై శాసనసభలో చేపట్టిన స్వల్ప కాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. హైదరాబాద్ అభివృద్ధిని, భూముల విలువను చంద్రబాబు గుర్తించారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనొచ్చు అని చంద్రబాబు అన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఒప్పుకున్న చంద్రబాబుకు ధన్యవాదాలు. కేసీఆర్‌కు రైతులపై ప్రేమ ఉన్నందునే మీటర్లకు ఒప్పుకోలేదని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలను ఏపీ సీఎం జగన్ కూడా మెచ్చుకున్నారు. దిశ ఘటన విషయంలో ఐ సెల్యూట్ టు కేసీఆర్ అని జగన్ కూడా అన్నారు. తెలంగాణ శాంతి భద్రతలను మెచ్చుకున్న జగన్‌కు కూడా ధన్యవాదాలు. జగన్, చంద్రబాబుకు అర్థమైన విషయాలు విపక్షాలకు అర్థం కావట్లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.