* చిప్స్ దొంగిలించాడని కళ్లల్లో కారం చల్లి
నెట్టింట ఒక షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడని ఒక మైనర్ పై దుకాణం యజమాని క్రూరంగా ప్రవర్తించాడు. మైనర్ కళ్లల్లో కారం కొట్టి.. అతని బట్టలు తొలగించి నగ్నంగా మార్చి తీవ్రంగా కొట్టాడు. ఈ హింసకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. మైనర్ పై దాడికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించి అధికారులు వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. చిప్స్ ప్యాకెట్ దొంగిలించిన ఒక మైనర్ బాలుడిని ఓ దుకాణదారుడు చితకబాదిన ఘటన హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహ్రులోని టిక్కర్ బజార్‌లో జరిగిన ఈ సంఘటనలో శివకుమార్ అనే మైనర్ చిప్స్ ప్యాకెట్ ను దొంగిలించాడు. దీంతో ఆగ్రహించిన నిందితుడు రాహుల్ సోనీ.. బాలుడిని చితకబాది, కళ్లలో కారంపొడి చల్లి, అనంతరం జనం ముందు నగ్నంగా మార్చాడు.ఈ దాడి జరుగుతున్న సమయంలో అక్కడున్నవారిలో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాలుడిపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 341, 323, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టంలోని సెక్షన్ 75 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అలాగే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని పోలీసులు ప్రజలను సూచించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందనీ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
* జేసీబీతో ఏటీఎం దోపిడీకి యత్నం
జేసీబీలను తీసుకొచ్చి ఏటీఎంలను ధ్వంసంచేసి డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించడం పెరిగింది. ఇటీవల శివమొగ్గలో ఇటువంటి దోపిడీ యత్నం మరువకముందే మంగళూరు వద్ద సూరత్కల్‌లో ఇదే మాదిరిగా దొంగలు యత్నించారు. విద్యాదాయిని పాఠశాల సమీపంలో జాతీయ రహదారి అండర్‌పాస్ వద్ద సౌతిండియా బ్యాంక్ ఎటీఎం ఉంది.శుక్రవారం తెల్లవారు 2:13 గంటలకు దుండగులు జేసీబీతో వచ్చారు. ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసేందుకు యత్నించగా సైరన్ మోగడంతో జేసీబీ వదిలి పారిపోయారు. అక్కడికి రెండువందల మీటర్ల దూరంలోనే పోలీసుస్టేషన్ ఉంది. పడుబిద్రి నుంచి జేసీబీని తెచ్చినట్లు తేలింది. దొంగల దాడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా పోలీసులు విచారణ చేపట్టారు.
* యూపీలో దారుణం
దొంగతనం ఆరోపణలపై ఇద్దరు బాలురపట్ల కొందరు పైశాచికంగా ప్రవర్తించారు. వారితో బలవంతంగా మూత్రం తాగించారు (Boys Forced To Drink Urine). అలాగే వారి ప్రైవేట్ భాగాలపై మిరపకాయలు రుద్దారు. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. డబ్బులు దొంగిలించారన్న ఆరోపణలతో 10, 15 ఏండ్ల వయస్సున ఇద్దరు పిల్లలను కొందరు కట్టేసి కొట్టారు. వారితో పచ్చి మిర్చి తినిపించారు. బాటిల్‌లో ఉన్న మూత్రాన్ని బలవంతంగా తాగించారు. అలాగే వారిని బోర్లా పడుకోమని చెప్పి దుస్తులు తొలగించారు. బాలుర ప్రైవేట్ భాగాలపై మిరపకాయలు రుద్దించారు. పచ్చని రంగులో ఉన్న ద్రవాన్ని ఇంజెక్షన్ చేశారు. ఈ టార్చర్ భరించలేక ఆ ఇద్దరు పిల్లలు బాధతో విలవిలలాడిపోయారు.కాగా, ఆగస్ట్ 4న పత్రా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్షన్ చికెన్ షాప్ వద్ద జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న పోలీస్ ఈ వీడియోను చూశాడు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆరుగురు వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేసినట్టు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
* సినిమాను మించిన స్టోరి
నర్సుగా నటించి ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడి భార్యనే హతమార్చాలని ప్రయత్నించింది ఓ మహిళ. ఇంజెక్షన్ వేసి ఆమెను చంపాలని వ్యూహం పన్నింది. కానీ అది బెడిసికొట్టి పోలీసులకు చిక్కింది. కేరళలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా నటిస్తూ స్నేహితుడి భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించిన 30 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళలోని పరుమాల ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. కేరళలో నర్సు వేశంలో వెళ్లి స్నేహితుడి భార్యను హత్యచేయాలని పథకం పన్నింది ఓ మహిళ. బాధితురాలి పేరు స్నేహ కాగా.. ఆమె భర్త విదేశాల్లో ఉంటారు. నిందితురాలు పేరు అనూష.. స్నేహ భర్త స్నేహితురాలు. అనూష సోదరి, స్నేహ భర్త ఒకే క్లాస్‌మేట్స్. ఏ కారణంతో తెలియదు గానీ స్నేహితుని భార్యను అనూష అంతమొందించాలనుకుంది.గర్భవతిగా ఉన్న స్నేహ.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. అందుకు తగ్గ వ్యూహాన్ని పన్నింది అనూష. నర్సు వేషంలో వెళ్లి స్నేహను చంపేయాలనుకుంది. శుక్రవారం నర్స్‌గా మారువేషంలో స్నేహ గదిలోకి ప్రవేశించిన నిందితురాలు మరో ఇంజక్షన్ వేయాలని చెప్పింది.”ఆమె ఒక ఖాళీ సిరంజిని ఉపయోగించి బాధితుడి సిరలోకి గాలిని రెండుసార్లు ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నించింది, కానీ విఫలమైంది. ఆమె మళ్లీ ప్రయత్నించినప్పుడు, స్నేహ తల్లి అనుమానం వచ్చి నర్సింగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చింది” అని పోలీసులు తెలిపారు. ఆసుపత్రి అధికారులు నిందితురాలిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి భర్త స్నేహితురాలు అనూషను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
* నలుగురు స్నేహితుల్ని బలిగొన్న షికారు
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రావివెంకటాంపల్లి గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు స్నేహితులు దుర్మరణం చెందగా మరొకరు గాయపడ్డారు. తాడిపత్రి పట్టణానికి చెందిన మోహన్‌రెడ్డి(27) రెండు రోజుల కిందట సెకెండ్ హ్యాండ్ కారు కొన్నాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని స్నేహితులు విష్ణుచౌదరి(24), నరేశ్‌రెడ్డి(27), మధుసాగర్‌రెడ్డి(28), శ్రీనివాసరెడ్డికి శుక్రవారం రాత్రి గ్రామ శివారులోని ఓ ప్రాంతంలో విందు ఇచ్చారు. వారంతా విందు ముగించుకొని కారులో శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో పట్టణానికి తిరిగి వస్తుండగా రవివెంకటాంపల్లి గ్రామం వద్ద కారు అదుపుతప్పి సూచిక బోర్డును, చెట్టును బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో మోహన్‌రెడ్డి, విష్ణుచౌదరి, నరేశ్‌రెడ్డి అక్కడికక్కడే తయారయ్యారు. మధుసాగర్‌రెడ్డి ప్రమాదం జరిగిన సమయంలో ఎగిరి పక్కనే ఉన్న మిద్దెపై పడడంతో ఎవరూ గుర్తించలేదు. ఉదయం 7 గంటల సమయంలో మిద్దె పైనుంచి అరుపులు వినిపించడంతో స్థానికులు గమనించి తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. శ్రీనివాసరెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి అతివేగం లేదా మద్యం మత్తు కారణం అయి ఉండొచ్చని పోలీసులు, స్థానికులు. స్థలిని తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి పరిశీలించిన కేసు దర్యాప్తు.
* శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
నగరంలోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో 1.88 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఆదివారంనాడు సీజ్ చేశారు. జెడ్డా నుండి హైద్రాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుండి కస్టమ్స్ అధికారులు ఇవాళ ఈ బంగారాన్ని సీజ్ చేశారు. ఈ బంగారం విలువ కోటి రూపాయాలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.గతంలో కూడ శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూలై 10న రూ. 1.27 కోట్ల విలువైన 1.93 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. క్యాప్యూల్స్ రూపంలో బంగారాన్ని తీసుకు వచ్చిన ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. గత ఏడాది ఆగస్టు 14న రూ. 13.63 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. లోదుస్తుల్లో బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు ప్రయాణీకుడిని అడ్డుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 6వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏడు కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దీని విలువల రూ. 3.5 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.బంగారం అక్రమ తరలింపును అడ్డుకునేందుకు అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే అక్రమార్కులు కొత్త కొత్త మార్గంలో బంగారాన్ని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ చీరకు బంగారాన్ని స్ప్రే చేసి తీసుకు వచ్చారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు రెండు రోజుల క్రితం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.ఈ చీరపై స్ప్రే చేసిన బంగారం విలువ రూ. 80 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు గుర్తించారు.
* కుటుంబాన్ని మింగేసిన ఆర్థిక సమస్యలు
బెంగళూరులో వారం కిందట ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్టణానికి చెందిన ఓ కుటుంబం బలవన్మరణం చెందడం వెనుక కారణాలను పోలీసులు వెలికితీశారు. కర్ణాటక రాష్ట్రం కాడుగోడి పోలీసుస్టేషన్ పరిధి సిగేహళ్లిలోని ఓ అపార్టుమెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వీరాంజనేయ విజయ్ (31), ఆయన భార్య హైమావతి (29), వారి పిల్లలు జులై 31న విగతజీవులుగా కనిపించారు. ఈ సంఘటన బెంగళూరు నగరంలో సంచలనం కలిగించింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు షేర్‌మార్కెట్‌లో ఉన్న డబ్బంతా పోగొట్టడంతో విజయ్ ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. తన భార్యతోపాటు పెద్ద కుమార్తె మోక్ష (ఏడాదిన్నర), సృష్టి (ఆరు నెలలు)ని హతమార్చి చివరగా తాను ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్టు దర్యాప్తు అధికారి, బెంగళూరు డీసీపీ లక్ష్మణ్ ధ్రువీకరించారు. దర్యాప్తులో భాగంగా ఓ ఐటీ కంపెనీలో టీంలీడర్‌గా పనిచేస్తున్న విజయ్ ల్యాప్‌టాప్‌ను కూడా పోలీసులు పరిశీలించారు. షేర్‌మార్కెట్ ద్వారా చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందుల్లో ఆయన పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లు పేర్కొన్నారు. ఈ మానసిక వ్యథతో కుటుంబం మొత్తం బలవన్మరణానికి గురైనట్లు నిర్ధారించబడింది. కుటుంబసభ్యుల గొంతులు నులిమి కడతేర్చినట్లు ఫోరెన్సిక్ నిపుణులు నిపుణులు. కేసు దర్యాప్తులో ఉంది. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించడంతో శనివారం మచిలీపట్నం బందరు కోటకు అంత్యక్రియలు నిర్వహించారు.
* మణిపూర్‌లో 15 ఇండ్లు దగ్ధం
మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు (Manipur violence) కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 15 ఇండ్లు దగ్ధం కాగా, కాల్పుల్లో కొందరు గాయపడ్డారు. పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని లాంగోల్ గేమ్స్ గ్రామంలో అల్లరి మూక రెచ్చిపోయింది. 15 ఇండ్లకు నిప్పుపెట్టింది. దీంతో అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 45 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. పలు వాణిజ్య సముదాయాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. మిలిటెంట్లు, భద్రతా దళాల మధ్య కాల్పులు కూడా జరిగాయి. కొందరు గాయపడ్డారు.మరోవైపు మణిపూర్ పోలీసులు, అస్సాం రైఫిల్స్ మధ్య వాగ్వాదం జరిగింది. మైతీ ఆధిపత్య జిల్లా బిష్ణుపూర్‌లో హింసాత్మక సంఘటనలను అదుపు చేసేందుకు తమను అనుమతించకపోవడంపై మణిపూర్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సాం రైఫిల్స్ జవాన్లతో వాగ్వాదానికి దిగారు. ఆర్మీ బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలతో క్వక్తా గోథోల్ రోడ్‌ను బ్లాక్ చేయడంపై అభ్యంతరం తెలిపారు. అలాగే అస్సాం రైఫిల్స్ జవాన్లు కుకీ మిలిటెంట్లతో కుమ్మక్కయ్యారని మణిపూర్ పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సైనికులు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
* రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన పెట్రోలు ట్యాంకర్
పెట్రోలు లోడ్‌తో వేగంగా వెళ్తున్న ట్యాంకర్ టైరు పంక్చరై రోడ్డు పక్కన ఆగి ఉన్న బాతుల లోడ్ లారీని ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన శనివారం సాయంత్రం జాతీయ రహదారిపై సింగరాయకొండ మండల పరిధిలోని జీవీఆర్ ఆక్వా కంపెనీ సమీపంలో రాయల్ భోజన్ హోటల్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలవడాన్ని మినహాయిస్తే.. పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన చూడటానికి చిన్నదైనా ఆయిల్ ట్యాంకర్ కావడంతో బోల్తా పడి ఉంటే తీవ్ర నష్టం జరిగేది.పోలీసుల కథనం ప్రకారం.. మిర్యాలగూడ నుంచి నాయుడుపేటకు బాతుల లోడ్‌తో వెళ్తున్న ఐచర్ లారీకి రాయల్ భోజన్ హోటల్ సమీపంలో టైరు పంక్చరైంది. డ్రైవర్ పంక్చర్ వేస్తుండగా అదే సమయంలో విజయవాడ నుంచి నెల్లూరు జిల్లా జొన్నవాడ వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ అతి వేగంగా వచ్చి బాతుల లోడ్ లారీని బలంగా ఢీకొట్టి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం నేరుగా రోడ్డు పక్కనున్న రాయల్ భోజన హోటల్ గదిని ఢీకొట్టి ఆగింది. ఆ సమయంలో రెస్టారెంట్ యజమాని మద్దెల వెంకటేశ్వర్లు గదిలో నిద్రిస్తున్నాడు.అతని పక్కగా ట్యాంకర్ వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ సిద్దయ్యకు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని హైవే అంబులెన్స్‌లో ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అదే 5 గంటల సమయంలో జరిగి ఉంటే రెస్టారెంట్ బయట కుర్చీలు, మంచాలు వేసి జనం కూర్చుని ఉండేవారు. ప్రాణాపాయం కూడా జరిగేది.
* చిట్టీల పేరుతో ఘరానా మోసం
రంగారెడ్డి జిల్లాలో మరో చిట్టీల మోసం వెలుగు చూసింది. షాద్ నగర్ లో చిట్టీల వ్యాపారి వసంత రూ.2కోట్లతో పరారైంది. జీరో చిట్టీల పేరుతో పెద్ద మొత్తంలో నిర్వాహకురాలు డబ్బులు వసూలు చేసింది. చిట్టీల నిర్వాహకురాలు 20 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వసంత దంపతులు పరారీలో ఉండగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.