DailyDose

రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానన్న స్టార్ హిరోయిన్-TNI నేటి తాజా వార్తలు

రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానన్న స్టార్ హిరోయిన్-TNI నేటి తాజా వార్తలు

 గద్దర్ మృతి పట్ల మంత్రి గంగుల సంతాపం

 ప్రముఖ కవి, ప్రజా గాయకుడులు ప్రజా యుద్దనౌక గద్దర్ మృతి పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ గా పేరొందిన విఠల్ కవిగా, గాయకుడిగా ఆట, పాటలతో లక్షలాది మంది అభిమానాన్ని చూరగొన్నారని, ప్రజల్లో చైతన్యం నింపారని మంత్రి గంగుల తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గద్దర్ అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానన్న స్టార్ హిరోయిన్

 ఇటీవల రాహుల్ గాంధీ పెళ్లి విషయం వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఓ మహిళ సోనియా గాంధీని.. రాహుల్‌కి పెళ్లి ఎప్పుడు అని అడగగా.. అమ్మాయిని చూడమని సోనియా గాంధీ స్పందించింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. అయితే రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానని ఓ స్టార్ నటి చెప్పుకొచ్చింది. ఆమెనే షెర్లిన్ చోప్రా. తన అందం, అభినయంతో అందరిని ఆకట్టుకునే షెర్లిన్ చోప్రా బాలివుడ్‌తో పాటు టాలివుడ్‌లోను పలు చిత్రాల్లో నటించింది. అంతేకాదు ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ఈ మధ్యకాలంలో బోల్డ్ కామెంట్స్‌తో తరుచుగా వార్తల్లో నిలుస్తోంది. అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై మాట్లాడి మరోసారి వార్తల్లోకెక్కింది. ఏకంగా రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానని చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరలవుతున్నాయి.ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ పెళ్లికి సంబంధించి గత కొన్ని రోజులగా పలు వార్తలు బయటకు వస్తున్నాయి. భారత్ జోడో యాత్ర చేస్తున్న సమయంలోనే రాహుల్ తన పెళ్లి గురించి స్పష్టత ఇచ్చారు. పెళ్లి చేసుకుంటానని.. తన భార్య ఎలా ఉండాలని కోరుకుంటున్నారో కూడా వివరించారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం హర్యానాకు చెందిన కొంతమంది మహిళలు సోనియా గాంధీ నివాసానికి వచ్చారు. ఆ సమయంలోనే వారు రాహుల్ గాంధీ పెళ్లికి సంబంధించిన విషయం గురించి మాట్లాడారు. అయితే ఇప్పుడు రాహుల్‌తో పెళ్లికి సంబంధించి నటి షెర్లిన్ చోప్రా చేసిన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

13 ఏళ్ల ఇండియన్ బైక్ రేసర్ దుర్మరణం

ఇండియన్ నేషనల్ మోటార్ సైకిల్ రేసింగ్‌లో విషాదం నెలకొంది. రేస్‌లో పాల్గొంటూ జరిగిన ప్రమాదంలో 13 ఏళ్ల బాల రేసర్, స్పెయిన్‌లో జ‌రిగిన వ‌రల్డ్ ఛాంపియ‌న్‌షిప్ ఫైనల్‌కు చేరిన తొలి ఇండియ‌న్ బైక్ రేస‌ర్ శ్రేయాస్ ప్రాణాలు పోగొట్టుకొన్నాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నైలో నేష‌న‌ల్ మోటార్‌ సైకిల్ రేసింగ్ చాంపియ‌న్‌షిప్ (ఎన్ఎంఆర్సీ)లో జ‌రిగిన రేసింగ్ ప్రమాదంలో శ్రేయాస్ ప్రాణాలు కోల్పోయాడు. బెంగ‌ళూర్ కిడ్‌గా పేరొందిన శ్రేయాస్ బైక్ నుంచి ప‌డిపోయిన‌ప్పుడు 200 సీసీ మోటార్‌బైక్‌ను న‌డుపుతున్నాడు. రేస్ మూడో రౌండ్ సంద‌ర్భంగా ఈ ప్రమాదం సంభవించింది. శ్రేయాస్‌ను వెంట‌నే ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మ‌ర‌ణించాడ‌ని వైద్యులు నిర్ధారించారు. శ్రేయాస్ మ‌ర‌ణంతో వారాంతంలో జ‌ర‌గాల్సిన మిగిలిన రేస్‌ల‌ను ర‌ద్దు చేసిన‌ట్టు మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ వెల్లడించింది.

మల్లవల్లి రైతులకు అండగా ఉంటామని జనసేన అధినేత హామీ

కృష్ణా జిల్లా బాపులపాడు వారికి మల్లవల్లి రైతులకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. 2016లో పారిశ్రామికవాడ కోసం 1,460 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం.. సాగుదార్లకు ఎకరాకు రూ.7.50 లక్షల చొప్పున పరిహారం అందించింది. అయితే, అర్హులైన వారికి పరిహారం రాలేదంటూ అప్పట్నుంచి కొందరు పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్లవల్లి పారిశ్రామికవాడలో రైతులను పవన్‌ కలిశారు. రైతుల భూములు తీసుకున్న ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ”కులాలు, పార్టీలు, ప్రాంతాల వారిగా రైతులను విడదీయలేం. రైతుల్లో ఐక్యత లేకుంటే అనేక సమస్యలు వస్తాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక మల్లవల్లి రైతుల సమస్యలపై దృష్టి సారిస్తాం. రైతులపై దాడి చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. పరిస్థితులకు అనుగుణంగా పనిచేసే పోలీసులను నేను తప్పు పట్టను. ప్రభుత్వం, ఎమ్మెల్యేలు చెప్పినట్లే పోలీసులు వింటారు. మల్లవల్లి రైతులకు పరిహారం వచ్చే వరకు అండగా ఉంటాం. రైతుల ఇళ్లలోకి చోరబడితే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. 2016లో తెదేపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. మల్లవల్లి రైతులకు తెదేపా అండగా ఉండాలి.. భాజపా కూడా రైతులకు అండగా నిలబడాలి.పరిహారం అడిగితే పోలీసులతో కొట్టించారని రైతుల ఆవేదన. కొంతమంది రైతులను నడవలేని పరిస్థితి తెచ్చారు. మరికొందరిని జైలుకు పంపి ఇబ్బందులు పెట్టారు. ప్రభుత్వ అవసరాలకు ప్రజల నుంచి భూములు తీసుకోవచ్చు. అయితే, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. మల్లవల్లి విషయంలో రైతులకు న్యాయం జరగలేదు. పరిహారాన్ని కొందరు రైతులకే ఇచ్చారు. ఆ తర్వాత రకరకాల కారణాలతో పరిహారం ఆపేశారు” అని పవన్. 

కోకాపేటలో బీజేపీ నేతల ఆందోళన

హైదరాబాద్ కోకాపేటలో బీజేపీ నేతల ఆందోళనకు దిగారు. కోకాపేటలో ప్రభుత్వభూముల వేలంపై నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు  చేశారు. అయితే పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి అక్కడి  నుంచి తరలించారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే, హైదరాబాద్ కోకాపేటలో రెండో విడత భూముల వేలం గురువారం నిర్వహించారు. నియోపొలిస్‌ లే అవుట్‌లోని 45.33 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఏడు ప్లాట్లను ఈ వేలంకు ఉంచారు. అయితే కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధ‌ర ప‌లికాయి. అత్య‌ధికంగా ఎక‌రం భూమి ధ‌ర రూ. 100.75  కోట్లు ప‌లికింది. కోకాపేట భూముల వేలం ద్వారా ప్ర‌భుత్వానికి రూ. 3,319.60 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. వేలంలో అత్య‌ధికంగా ఎక‌రం భూమి రూ. 100.75 కోట్లు ప‌ల‌క‌గా, అత్య‌ల్పంగా రూ. 67.25 కోట్లు ప‌లికింది. ఎక‌రం భూమి స‌గ‌టున రూ. 73.23 కోట్లు ప‌లికింది.ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ద్వారా రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో ఉన్న 100 ఎకరాల భూమిని విక్రయించడానికి సిద్ధమైంది. ఆగస్టు 10న ఇ-వేలం నిర్వహించనున్నారు. నగదు కొరతతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం భూముల వేలంతో రూ. 3,000-రూ. 3,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని భావిస్తోంది.

ఈశాన్య రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీలతో మోదీ భేటీ

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఎంపీలను 8 క్లస్టర్లుగా విభజించి విడివిడిగా సమావేశమవుతున్న ప్రధాన మంత్రి  మోదీ సోమవారం (ఆగస్టు 7) ఈశాన్య రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. దక్షిణా రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీలు సహా ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల ఎంపీలతో ప్రధాని సమావేశాలు ముగిశాయి. 2024లో మరోసారి అధికారం సాధించడమే లక్ష్యంగా ఎలా వ్యవహరించాలో వారికి ప్రధాని చెప్పారు. అయితే సోమవారం నాటి ఈశాన్య రాష్ట్రాల ఎంపీలతో భేటీలో ఏం చెబుతారన్న విషయం కంటే ఆ సమావేశం కోసం తయారు చేస్తున్న భోజనాల మెనూ ఎక్కువ ఆసక్తి రేకెత్తిస్తోంది.సిక్కిం సహా మొత్తం 8 ఈశాన్య రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేక భాష, సంస్కృతి, ఆహారపు అలవాట్లను కలిగి ఉన్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలను సెవెన్ (7) సిస్టర్స్ అని, వాటికి సిక్కింను జోడించినపుడు ‘సెవెన్ సిస్టర్స్ వన్ బ్రదర్’ అంటూ వ్యవహరిస్తుంటారు. భారతీయ జనతా పార్టీ మాత్రం విభిన్న ప్రత్యేకతలకు ఆలవాలమైన ఈ 8 రాష్ట్రాలను అష్టలక్ష్ములుగా అభివర్ణిస్తోంది. అందుకు తగ్గట్టే విభిన్న రుచులతో మెనూ తయారు చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీల సమావేశానకి ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు శర్బానంద సోనోవాల్, కిరెన్ రిజిజు ఆతిథ్య ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానితో పాటు పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర రోడ్డు-రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా హాజరవుతున్నారు. భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం సోమవారం నాటి సమావేశంలో ఏర్పాటు చేసే విందులో 8 రాష్ట్రాల ప్రత్యేకతలను చాటే విభిన్న రుచులతో మెనూ తయారవుతోంది. ముందు ఈశాన్య రాష్ట్రాలకు ప్రవేశద్వారంగా చెప్పుకునే అస్సాంతో మొదలుపెడదాం. ఈ రాష్ట్ర ప్రత్యేక వంటకాలైన జోహా రైస్ (Joha Rice), ఆలూ పిటిక (Allo Pitika), ధెకియా క్సాక్ (Dhekia Xaak) మెనూలో భాగం కానున్నాయి. అస్సాంలో మాత్రమే పండించే ఒక ప్రత్యేక రకం బియ్యంతో చేసేదే జోహా రైస్. దీనికి ప్రత్యేక రుచితో పాటు సువాసన కూడా ఉంటుంది. అస్సాంలోని రోజువారీ భోజనంలో భాగమయ్యే ఆహార పదార్థం ఆలూ పిటిక. మెత్తగా ఉడికించి, పిసికేసిన ఆలూలో పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ ముక్కలు వేసి మెత్తని ముద్దలా చేస్తారు. ఆ ముద్దకు ఆవాల నూనె జోడిస్తే ఆలూ పిటిక రెడీ. ఇక ధెకియా క్సాక్ అనేది కాడలతో కూడిన ఒక రకమైన ఆకుకూర. అత్యధిక మాంసకృత్తులు కల్గిన ఈ ఆకుకూర అస్సాంలో విరివిగా లభిస్తుంది. దీనికి కాంబినేషన్‌గా మరికొన్ని రకాల కూరగాయలు కలిపి వంటకాలు చేస్తారు. అలాగే అస్సాం రాష్ట్ర ప్రత్యేక తీపి వంటకం బిలాహిర్ టోక్, టమాట చట్నీ కూడా ఈ మెనూలో భాగం కానున్నాయి.

అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగింపు

 అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించారు. దీంతో సోమ, మంగళవారాల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాగా, టీఎస్ఆర్టీసీ (TSRTC) విలీన బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం ల‌భించింది. ఉన్నతాధికారుల‌తో చ‌ర్చించిన మీద‌ట గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఎట్ట‌కేల‌కు బిల్లును ఆమోదించారు. గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తితో ఆర్టీసీ విలీన బిల్లుకు అడ్డంకులు తొల‌గిపోయాయి.గ‌వ‌ర్న‌ర్ గ్రీన్ సిగ్నల్‌తో టీఎస్‌ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం దిశ‌గా బిల్లును అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ పేర్కొన్నారు. కాసేప‌ట్లో స‌భ ముందుకు ఆర్టీసీ విలీన బిల్లు రానుంది. టీఎస్ఆర్టీసీ విలీన బిల్లును గ‌త రెండు రోజులుగా గ‌వ‌ర్న‌ర్ పెండింగ్‌లో ఉంచ‌డంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు భ‌గ్గుమ‌న్నాయి. సంస్ధ ఉద్యోగులు, కార్మికులు ఛ‌లో రాజ్‌భ‌వ‌న్‌కు పిలుపు ఇచ్చారు.

* ఫ్లైట్లో ఏసీ లేక ప్రయాణికుల ఇబ్బందులు

విమానంలో ప్రయాణం అంటే సామాన్యులకు అదో తీరని కోరిక. విలాసవంతమైన జీవితానికి అది ప్రతీక. కానీ ఫ్లైట్ లో ఏసీ పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఈ ఘటన చంఢీగర్ నుంచి జైపూర్ కు వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ (6E7261)లో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇండిగో కంపెనీకి చెందిన ఓ ఫ్లైట్ (6E7261) చండీఘర్ నుంచి జైపూర్ కు బయలుదేరింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన దగ్గర నుంచి ల్యాండింగ్ అయ్యే వరకు దాదాపు రెండుగంటల పాటు ఏసీ లేకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ఇదే విషయాన్ని ఫ్లైట్ సిబ్బందిని నిలదీయగా టెక్నికల్ ప్రాబ్లం అంటూ బదులిచ్చారు. ఇక ఏసీ లేకపోవడంతో ప్రయాణికులు చెమటతో తడిచిపోయారు. ఈ క్రమంలోనే కొందరు ప్రయాణికులు గాలి కోసం పేపర్లను తీసుకొని ఊపుకున్నారు. ఇక చెమటతో తడిసిపోయిన ప్రయాణికులకు తుడుచుకోండి అంటూ ఫ్లైట్ సిబ్బంది టిష్యూ పేపర్స్ ఇవ్వడం కొసమెరుపు. ఇక ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ పంజాబ్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు.ఇండిగో విమానాల్లో ఒక్కరోజులో సాంకేతిక లోపం తలెత్తడం ఇది మూడోసారని అన్నారు. ఢిల్లీకి ఎగురుతున్న ఇండిగో విమానం ఇంజిన్‌లో ఒకటి పనిచేయకపోవడంతో శుక్రవారం పాట్నా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చిందని, విమానం బయలుదేరిన మూడు నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన తెలిపారు. పాట్నాలోని జై ప్రకాష్ నారాయణ్ విమానాశ్రయంలో ఉదయం 9:11 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని అన్నారు. మరో సంఘటనలో రాంచీకి బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన గంటలోపు ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఇండిగో సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ)లను కోరారు.

*  బీఆర్ఎస్‌తో పొత్తు, కేసీఆర్ పాలన

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఎంఐఎం అగ్ర నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌తో పొత్తుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు . రాష్ట్రంలో తమ ప్రయాణం బీఆర్ఎస్‌తోనే అని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రిగా వుండటం గర్వంగా వుందని.. ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మిగిలిన రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలన్నారు. సీఏఏ, యూసీసీలకు వ్యతిరేకంగా ప్రకటించినందుకు కేసీఆర్‌కు అక్బరుద్దీన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి ఘర్షణలు లేవని.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ ఇలా ఏ పథకం తీసుకున్నా మంచి ఫలాలను ఇస్తోందని ఒవైసీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని ఆయన వెల్లడించారు. కాగా.. గత నెలలో అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ప్రయత్నించిన వారిని క్షమిస్తున్నానని అన్నారు. తనపై దాడి జరుగుతుంటే పట్టించుకోకుండా వెళ్లినవారిని కూడా క్షమిస్తున్నానని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. చావు బతుకుల మధ్య వున్న తనను బతికించిన ఎమ్మెల్యే బలాలకు జీవితాంతం రుణపడి వుంటానని ఆయన తెలిపారు. ఇకపోతే.. 2011 ఏప్రిల్ 30న చాంద్రాయణగుట్ట పరిధిలోని కార్వాన్‌లో జరుగుతున్న ఓ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న అక్బరుద్దీన్ ఒవైపీపై దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. అక్కడితో ఆగని దుండగులు ఆపై కత్తులు, డాగర్లతో అక్బరుద్దీన్‌పైనా.. ఆయన అనుచరులపైనా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అక్బరుద్దీన్ తీవ్రంగా గాయపడి చావు అంచులదాకా వెళ్లొచ్చారు. అయితే అక్బరుద్దీన్ గన్‌మెన్ జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు దుండగులు హతమయ్యారు. అక్బరుద్దీన్‌పై దాడికి పాల్పడింది ఎంబీటీ పార్టీకి చెందిన మొహమ్మద్ పహిల్వాన్‌గా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓ ఆస్తికి సంబంధించిన వివాదం కారణంగానే అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరిగిందని టాక్. 

గద్దర్ మరణంపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి

ప్రజా గాయకుడు గద్దర్ కాసేపటి క్రితమే జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొన్ని రోజులుగా గద్దర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే గద్దర్ మరణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రజా కవి – గాయకుడు, బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ అని సీఎం జగన్ కొనియాడారు. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే అని అన్నారు. ఆయన నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికారని సీఎం జగన్ అన్నారు. ఇప్పుడు ఆయన లేరన్న వార్త ఊహించనదని పేర్కొ్న్నారు.ఆయన ప్రజల మధ్య లేనప్పటికీ.. సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయని సీఎం జగన్ అన్నారు. గద్దర్ గారికి మొత్తంగా తెలుగు జాతి సెల్యూట్ చేస్తోందని జగన్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనమంతా బాసటగా ఉందామని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు.