Food

ఈ టమాట చాలా బరువు గురు!

ఈ టమాట చాలా బరువు గురు!

ప్రతి ఇంట్లో ఏ వంటకమైనా ఖచ్చితంగా టమాటా ఉండాల్సిందే. టమాటా తగిల్తే కానీ ఆ వంటకానికి రుచి కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మధ్యతరగతి జీవులు టమాటాలు చూడటమే తప్ప కొనే పరిస్థితి లేదు. ఇప్పట్లో కొనలేనంతగా ధరలు పెరుతాయని అంటున్నారు. రెగ్యులర్‌గా వాడే టమాటాల సంగతి అలా ఉంటే ఇప్పుడొక టమాటా గురించి చెప్పాలి. అదే ‘స్టీక్‌హౌస్ టమాటా’. ఇది అలాంటి ఇలాంటి టమాటా కాదండోయ్. ఒక్క టమాటా కిలో పైన తూగుతుంది. అసలు ఈ ప్లాంట్ ఎలా పెరుగుతుంది?  దీనిని ఎలా పెంచాలి?  దీని ప్రత్యేకతలు ఏంటి?  తెలుసుకుందాం.

స్టీక్‌హౌస్ టమాటా అనేది ఒక హైబ్రిడ్ జాతికి చెందిన మొక్క. ఈ మొక్కకి కాసే టమాటాలు ఒకటి 3 పౌండ్లు బరువు అంటే కేజీ పైన బరువున్న టమాటాలు కాస్తాయి. ఈ టమాటాలు చూడటానికి అందంగా ఉంటాయి. సువాసనతో ఉంటాయి. వీటిని సలాడ్‌లు, సాస్‌లు, శాండ్‌విచ్ లలో వాడతారు. లేదంటే పచ్చిగా కూడా తినొచ్చట.ఈ మొక్కలు 5 నుంచి 7 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఈ మొక్కలు చలిని అస్సలు తట్టుకోలేవట.  ఎండలో నాటితే వేగంగా పెరుగుతాయట. వీటికి సూర్యకాంతి అవసరం. ఈ మొక్క  75 నుంచి 80 రోజుల్లో పంటని ఇస్తుంది.  5 నుంచి 7 అడుగుల పొడవు, 24 నుంచి 36 అంగుళాల వెడల్పు పెరుగుతాయి. ముదురు ఎరుపు రంగులో ఉన్నప్పుడు టమాటాలు కోయవచ్చును.

ఈ మొక్కల్ని విశాలమైన తోటలో పెంచవచ్చు. లేదంటే కంటైనర్లలో కూడా పెంచవచ్చును. కనీసం 20 అంగుళాల వెడల్పు ఉన్న పెద్ద కంటైనర్ అయితే వీటిని పెంచడానికి బాగుంటుంది. ఈ మొక్కలకు నీరు చాలా అసవరం. మట్టి పై పొర ఎండినట్లు అనిపిస్తే వెంటనే నీరు పెట్టాలి. స్టీక్‌హౌస్ టమాటా మొక్కలు వేగంగా పెరుగుతాయి. వీటికి నీరు, సరైన ఎరువులను ఉపయోగించి గణనీయమైన ఉత్పత్తిని పొందవచ్చును. ఈ టమాటా విత్తనాల కోసం Steakhouse Tomato Seeds అని వెతికితే పలు ఆన్ లైన్ స్టోర్లలో లభిస్తున్నాయి. ధర కాస్త ఎక్కువగానే పలుకుతున్నాయి.