ScienceAndTech

విద్యుత్ తో మధుమేహ చికిత్స

విద్యుత్ తో మధుమేహ చికిత్స

ఒకప్పుడు కాలక్షేపం కోసం ఉపయోగపడ్డ ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు ఇప్పుడు మన ఆరోగ్య పరిరక్షణ సాధనాలుగా మారిపోయాయి. బీపీ, గుండె వేగం కొలవడం, వాకింగ్‌ చేసేటప్పుడు ఎన్ని అడుగులు వేశాం తదితర అనేక అంశాలను ఇప్పుడు ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు మనకు తెలియజేస్తున్నాయి. రానున్న కాలంలో శరీరంలో సమస్యను గుర్తించడంతో పాటు చికిత్సను సైతం చేయనున్నాయి. డీఎన్‌ఏను ప్రభావితం చేయనున్నాయి. ఉదాహరణకు డయాబెటిక్‌ పేషెంట్‌ శరీరంలోనే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసి వారికి ఉపశమనం కలిగించడం తరహా చికిత్సలను రానున్న కాలంలో ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు చేస్తాయి. దీనిపై స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్‌ జ్యూరిచ్‌ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.

కణాలు ప్రేరేపితమై:సాధారణంగా ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు ప్రత్యక్షంగా మన శరీరంలో ఉన్న రోగాన్ని నయం చేయలేవు. శరీరానికి డివైజ్‌కు మధ్య ఎలక్ట్రోజెనెటిక్‌ ఇంటర్‌ఫేస్‌ లేకపోవడమే దీనికి కారణం. ప్రస్తుతం జ్యూరిచ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై దృష్టి సారించారు. పరిశోధనలో భాగంగా టైప్‌-1 డయాబెటిక్‌తో బాధపడుతున్న ఎలుకలపై వారు ప్రయోగాలు నిర్వహించారు. మానవుల్లో ఉండే పాంక్రియాటిక్‌ కణాలను ఎలుకల్లో ప్రవేశపెట్టారు. ఆంక్యుపంక్చర్‌ సూదుల ద్వారా కరెంట్‌ను ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ కణాలు ప్రేరేపితమయ్యేలా చేశారు. ఈ చర్యల వల్ల ప్రేరేపితమై డీఎన్‌ఏ మార్పులకు లోనయ్యేటట్టు చేస్తాయి. రోగం నయం అయ్యేందుకు ఉపయోగపడే ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ను వారు అభివృద్ధి చేస్తున్నారు.