Fashion

రింగు రింగుల జుట్టుతో చల్లదనం

రింగు రింగుల జుట్టుతో చల్లదనం

కర్లీ లేదా స్ట్రైట్ హెయిర్స్ రెండింటిలో ఏవి అందాన్నిస్తాయో ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. కానీ వీటిలో ఏ రకమైన జుట్టు మీ స్కాల్ప్‌ను కాస్త ఎక్కువ కూల్‌గా ఉంచుతాయనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? పరిశోధకులు మాత్రం కర్లీహెయిర్ అందుకు దోహదం చేస్తాయని చెప్తున్నారు. ఇవి దృఢంగా రింగులు తిరిగి ఉంటాయి కాబట్టి ఎండవేడి నుంచి తలభాగాన్ని రక్షిస్తాయని చెప్తున్నారు. తొలి మానవ మనుగడలో కూడా ఈ కర్ల్స్ కీలక పాత్ర పోషించాయని పెన్ స్టేట్‌లోని పరిశోధకులు కనుగొన్నారు.

జంతువుల నుంచి మానవుల వరకు పరిణామ క్రమం ఎక్కువగా భూమధ్యరేఖ అయిన ఆఫ్రికాలో జరిగిందని సైంటిస్టులు అంటున్నారు. వాస్తవానికి ఇక్కడ మిగతా భూభాగాలకంటే కూడా సూర్యుడి వేడి అధికంగా ఉంటుంది. సంవత్సరం పొడవునా రాత్రివేళ సమయానికంటే, పగటివేళ సమయం ఎక్కువగా ఉంటుందని ఇవాన్ పగ్ యూనివర్సిటీ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ నినా జబ్‌లాన్‌స్కీ పేర్కొన్నారు. అందుకే ఇక్కడి వాతావరణంలో తల పైభాగంలోని స్కాల్ప్ చాలా స్థిరమైన సోలార్ రేడియేషన్‌కు గురవుతూ ఉంటుంది.ఇటువంటి పరిస్థితిని తట్టుకునేందుకే భూ మధ్యరేఖ వద్ద నివసించే మానవులకు కర్లీ హెయిర్ పరిణామం చెందాయని పరిశోధకులు అంటున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించడానికి వారు నియంత్రిత వాతావరణంలో థర్మల్ మానికిన్ అండ్ హ్యూమన్-హెయిర్ విగ్‌లను ఉపయోగించారు. గట్టిగా వంకరగా ఉన్న కర్లీ హెయిర్స్ సౌర వికిరణానికి వ్యతిరేకంగా ఉత్తమ రక్షణను అందిస్తాయని, తలను స్ట్రైట్ హెయిర్ కంటే కూడా చల్లగా ఉంచడంలో దోహదపడతాయని కనుగొన్నారు.