నేడు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలుకానుంది. విపక్ష ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాల కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ చర్చను ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ జరగనుంది. ఇందుకోసం పాలక, విపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పాలకవర్గాన్ని గట్టిగా నిలదీస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. మరోవైపు, బీజేపీ… తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఈ చర్చలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. కాంగ్రెస్ తరఫున రాహుల్ చర్చను ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మణిపూర్ హింసపై పాలక, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో… అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. బుధ, గురు వారాల్లోనూ అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ కొనసాగనుంది. ఈ నెల 10న ప్రధాని మోడీ తీర్మానంపై మాట్లాడనున్నారు. అవిశ్వాస చర్చలో రేపు అమిత్ షా పాల్గొనే అవకాశాలున్నాయి.
ఈ నెల 11న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి మణిపూర్ హింసపై ప్రధాని మోడీ స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా ప్రధాని మాట్లాడకపోవడంతో నిరసనలతో సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జులై 26న ప్రధానిపై విపక్ష ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వాన్ని గద్దె దించడం తమ లక్ష్యం కాదని.. ఇలాగైనా ప్రధాని పార్లమెంట్‌లో మాట్లాడతారనే ఆలోచనతో నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేశామని చెబుతున్నాయి విపక్షాలు. లోక్‌సభ ఎన్నికల ముందు జరిగే ఈ అవిశ్వాస తీర్మానం అధికార, విపక్షాలకు కీలకంగా మారింది. 538 మంది సభ్యులు ఉన్న లోక్‌సభలో అవిశ్వాసం నెగ్గాలంటే 270 ఓట్లు అవసరం. అయితే బీజేపీకి ఒంటరిగా 301 మంది ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలతో కలిపి 332 మంది ఎంపీల మద్దతు ఉంది. విపక్ష ఇండియా కూటమికి 142 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. అయితే విశ్వాస పరీక్షలో ఎలాగూ ఓడిపోతామని తెలిసినా విపక్షాలు మాత్రం తమ మైలేజ్ పెంచుకోవడానికి.. ప్రజల నుంచి మద్దతు పొందేందుకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నాయి.