అన్నవరం దేవస్థానంలో వసతిగదిని ఒకసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు తీసుకునే అవకాశం లేకుండా అధికారులు నిబంధన పెట్టారు. వసతిగదిని తీసుకునే సమయంలో భక్తుడి ఆధార్ నంబరును సిబ్బంది నమోదు చేస్తారు. ఇలా ఒక ఆధార్ నంబరుపై గదిని పొందిన తర్వాత మళ్లీ 90 రోజుల వరకూ కేటాయింపునకు అవకాశం లేకుండా సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దారు. దీంతో పాటు భక్తులు గది తీసుకునే సమయంలో, ఖాళీ చేసే సమయంలో వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఏయే వసతి సముదాయం వద్ద ఎన్ని గదులు ఉన్నాయి, ఇందులో ఎన్ని బుక్ అయ్యాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయన్న వివరాలతో కొండ దిగువున సీఆర్వో కార్యాలయం వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు ఈ విధానం అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్మ ప్రచార మాసోత్సవాలను కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తూర్పు రాజగోపురం వద్ద సహస్ర దీపాలంకరణ మందిరంలో సత్యదేవుని వ్రతం చేశారు. మంత్రి, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్, ఆలయ ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈవో ఆజాద్‌లు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ధర్మ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన సభలో పండితులను సత్కరించి మంత్రి మాట్లాడారు. ‘ప్రధాన దేవాలయాల్లో ఒక్కో చోట నెల రోజుల పాటు ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాం. విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం దేవస్థానాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను సెప్టెంబరు 7న ప్రారంభించనున్నాం’ అని పేర్కొన్నారు.