ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి క్వార్టర్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) రెట్టింపు కంటే ఎక్కువ లాభాలను నమోదు చేసి రూ. 34,774 కోట్లను గల్లా పెట్టెలో వేసుకున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-–జూన్ కాలంలో మొత్తం 12 ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.15,306 కోట్ల మొత్తం లాభాన్ని నమోదు చేశాయి. ఈ క్వార్టర్లో ఇవి భారీ నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) సంపాదించడానికి అధిక -వడ్డీ ఆదాయం సహాయపడింది. చాలా బ్యాంకులు 3 శాతం కంటే ఎక్కువ ఎన్ఐఎం నమోదు చేశాయి. ఈ క్వార్టర్లో పూణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధికంగా 3.86 శాతం ఎన్‌ఐఎంను సాధించగా, సెంట్రల్ బ్యాంక్ 3.62 శాతం, ఇండియన్ బ్యాంక్ 3.61 శాతంతో రెండో స్థానంలో ఉన్నాయి.
మొదటి క్వార్టర్లో, నాలుగు బ్యాంకులు 100 శాతానికి పైగా లాభాలను సాధించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. లాభం 307 శాతం వృద్ధి చెంది రూ. 308 కోట్ల నుంచి రూ. 1,255 కోట్లకు పెరిగింది. ఆ తర్వాతి స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఉంది. దీని లాభం 178 శాతం పెరిగి 16,884 కోట్లకు చేరుకుంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా 176 శాతం వృద్ధితో రూ. 1,551 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఎస్బీఐ అత్యధిక క్వార్టర్ లాభం రూ.16,884 కోట్లే కావడం విశేషం. పీఎస్‌బీలు ఆర్జించిన మొత్తం లాభంలో ఇది దాదాపు 50 శాతం.
ఎస్బీఐ నంబర్‌వన్
2023 ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రభుత్వ బ్యాంకుల మొత్తం లాభం రూ. 1.05 లక్షల కోట్లు కాగా, ఇందులో ఎస్బీఐ వాటా దాదాపు 50 శాతం ఉంది. మరో ఐదు పీఎస్‌బీలు 50 నుంచి 100 శాతం మధ్య వృద్ధిని నమోదు చేశాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నికర లాభం 95 శాతం పెరిగి రూ. 882 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 88 శాతం వృద్ధితో రూ.4,070 కోట్లకు, యూకో బ్యాంక్ 81 శాతం వృద్ధితో రూ.581 కోట్లకు చేరుకుంది. ఢిల్లీకి చెందిన పంజాబ్ & సింద్ బ్యాంక్ లాభం మాత్రం 25 శాతం తగ్గి రూ. 153 కోట్లకు పడిపోయింది.
ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు పీఎస్‌బీల పునరుద్ధరణకు దోహదపడ్డాయి. 4ఆర్ గుర్తింపు, రిజల్యూషన్, రీక్యాపిటలైజేషన్, మార్పుల వ్యూహం ఫలితంగా మొండిబాకీలు మొత్తం అడ్వాన్స్‌లలో 3.9 శాతానికి.. అంటే 10 సంవత్సరాల కనిష్టానికి పడిపోయాయి. ఇవి గత ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో రూ.8.6 లక్షల కోట్లకు పైగా మొండి బకాయిలను రికవరీ చేశాయి. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో -(- 2016–-17 నుంచి 2020-–21 వరకు) పీఎస్బీలకు ప్రభుత్వం రూ.3,10,997 కోట్ల మూలధనాన్ని సమకూర్చింది. రీక్యాపిటలైజేషన్ ప్రోగ్రామ్ పీఎస్బీలకు మేలు చేసింది. గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇచ్చాయి.