చేతులతో ఎంతో కష్టపడి చేసే చేనేత దుస్తులకు ప్రస్తుతం చాలానే డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రతి ఏటీ ఆగస్టు 7న నిర్వహిస్తారు. దీనిని 2015లో చెన్నైలో ప్రారంభించినట్లు సమాచారం. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపు నిస్తూ 2012 ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగానికి ఒకరోజు ఉండాలనే ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటుచేయడం జరిగింది.ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరుపబడుతోంది. ఈ సందర్భంగా 10 రోజులపాటు జాతీయ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించబడుతుందని తెలుస్తోంది. 2018లో యాదాద్రి – భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన చేనేత కళాకారులు కుట్టు లేని జాతీయ జెండాను రూపొందించారు. 24 ఆకులతో కూడిన అశోక చక్రం సహా జాతీయ పతాకమంతా ఎలాంటి కుట్టు లేకుండా మగ్గంపై తయారు చేశారు. ఇలాంటి అద్భుతాలను చేనేత కార్మికులు ఎన్నో తయారు చేశారు. ప్రస్తుతం చాలా మంది మగ్గంపై రెడీ చేసిన దుస్తులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.