Kids

నవజాత శిశువులు ఎంత ఏడ్చినా కన్నీళ్లు ఎందుకు రావు?

నవజాత శిశువులు ఎంత ఏడ్చినా కన్నీళ్లు  ఎందుకు రావు?

పుట్టిన కొద్దిరోజుల వరకు అప్పుడే పుట్టిన పసిపాపలు విపరీతంగా ఏడ్చినా కన్నీళ్లు బయటకు రాకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. అప్పుడే పుట్టిన శిశువుకు కన్నీళ్లు (Tears) ఎందుకు రావనే విషయం మీరెప్పుడైనా ఆలోచించారా..? దీనిపై శాస్త్రవేత్తలు (Scientists) పరిశోధన నిర్వహించారు. పరిశోధనలలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. షాకింగ్‌గా ఉన్నాయి. ఇలా జరగడం శిశువు శరీర అభివృద్ధికి సంబంధించినది. ఒక వ్యక్తి ఏడ్చినప్పుడల్లా కన్నీళ్లకు ఒక ప్రత్యేక రకమైన వాహిక బాధ్యత వహిస్తుంది. నవజాత శిశువులో ఇది పూర్తిగా అభివృద్ధి చెందదు. డెవలప్ కావడానికి కొంత సమయం పడుతుంది. అందుకే అప్పుడే పుట్టిన శిశువుకు (Newborn Babies)ఎంత ఏడ్చినా కన్నీళ్లు రావు. ఈ వాహిక అభివృద్ధి చెందిన తర్వాతే కన్నీళ్ల రావడం ప్రారంభం అవుతాయి.నవజాత శిశువులు ఎక్కువగా ఏడుస్తారని, అయితే వారి కన్నీళ్లు రావడానికి సాధారణంగా రెండు వారాలు పడుతుందని శిశువైద్యురాలు తాన్యా ఆల్ట్‌మన్ చెప్పారు. కొంతమంది పిల్లలకు ఇది అభివద్ది చెందాలంటే సమయం ఎక్కువగా పట్టవచ్చు. కొంతమంది పిల్లలలో ఈ నాళం అభివృద్ధి చెందడానికి 2 నెలలు కూడా పట్టవచ్చని వెల్లడించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కంటి ఎగువ కనురెప్పకు దిగువన బాదం ఆకారపు గ్రంధి ఉంది. ఈ గ్రంథి నుండి కన్నీళ్లు వస్తాయి. ఈ గ్రంథి కళ్లలో తేమను గ్రహిస్తుంది. దీని కారణంగా కళ్ల కదలిక తేలికవుతుంది. కన్నీటిని ఉత్పత్తి చేసే ఈ గ్రంథి మేఘంలాగానూ, నాళం గొట్టంలానూ ప్రవర్తిస్తుందని, దీని ద్వారా కళ్లలో నుంచి నీళ్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.