* ఇన్నాళ్లు ట్విటర్‌లో (ప్రస్తుతం X) చేపట్టిన మార్పుల విషయంలో ఎలాన్ మస్క్‌పై అసహనం చేయని వారు లేరు. బ్లూ టిక్ తీసుకురావడం, లోగోలో పక్షి బొమ్మను తీసివేయడం వంటి చర్యలు ఆగ్రహానికి కారణమయ్యాయి. కంపెనీలో జరిగిన పరిణామాలూ పలువురికి ఆగ్రహం తెప్పించాయి. అలాంటి ఎలాన్ మస్క్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మస్క్.. నువ్వు మంచోడివి, గ్రేట్’ అంటూ తెగ పొగిడేస్తున్నారు. అయితే, కొత్తగా తీసుకొచ్చిన యాడ్ రెవెన్యూ మోడలే ఇందుకు కారణం. యాడ్ రెవెన్యూ షేరింగ్ కింద తమకు ట్విటర్ డబ్బులు వేస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబంధిత స్క్రీన్ షాట్లను ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ట్విటర్‌లో వెరిఫై అయిన వారికి యాడ్ రెవెన్యూ షేరింగ్ కింద ట్విటర్ డబ్బులు జమ చేస్తోంది. గత మూడు నెలలుగా నెలకు 5 మిలియన్ ఇంప్రెషన్లను పొందిన వారు రెవెన్యూ షేరింగ్‌కు అర్హులు. అలాగే స్ట్రైప్ పేమెంట్ అకౌంట్ కలిగి ఉండాలి. ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఉండాలి. అలాంటి వారికి వారు పెట్టిన పోస్టులకు వచ్చే రిప్లయ్‌ల మధ్యలో వచ్చే యాడ్స్‌కు గానూ ట్విటర్ ఈ చెల్లింపులు చేస్తోంది. దీంతో తమకు ఇంత మొత్తం వచ్చిందంటూ ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు.
* సెకెండ్ హ్యాండ్ కార్లను విక్రయించే మారుతీ సుజుకీ ట్రూ వాల్యూ సరికొత్త మైలు రాయిని సొంతం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సెకెండ్ హ్యాండ్ కార్ల విభాగంలో 50 లక్షల యూనిట్లను విక్రయించింది. ఈ విషయాన్ని కంపెనీ బుధవారం వెల్లడించింది. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ 2001లో ఈ రంగంలో అడుగుపెట్టింది.
* ప్రముఖ ఆన్‌లైన్ గేమింగ్, ఫాంటసీ స్పోర్ట్స్ స్టార్టప్ మొబైల్ ప్రీమియం లీగ్ మరో సారి ఉద్యోగులను తీసివేయనున్నట్లు సమాచారం. తమ సంస్థలో పనిచేస్తున్న వారిలో 350 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇది భారత్‌లో పనిచేస్తున్న వారిలో 50 శాతానికి సమానం. ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల నిర్ణయించింది. ఈ ప్రకటన చేసిన వారం తర్వాత ఎంపీఎల్ లేఆఫ్స్ వార్తలు రావటం గమనార్హం.
* బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ కోల్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 10.1 శాతం తగ్గి రూ.7,941.40 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. ఏడాదిక్రితం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.8,833.22 కోట్ల లాభాన్ని గడించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.36,086.68 కోట్ల నుంచి రూ.37,521.03 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు ఏడాది ప్రాతిపదికన 11.67 శాతం ఎగబాకి రూ.26,785.68 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది.
* భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త, ఆసియాలోనే అత్యంత సంపన్నుడుగా పేరుగాంచిన
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (ంఉకెష్ ఆంబని ) గురించి ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తనకు చెందిన ఓ లగ్జరీ ఇంటికి ముకేశ్ విక్రయించారన్నది ఆ వార్త సారాంశం. అంబానీకి ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన ఆస్తులు, విలాసవంతమైన ఇల్లు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా తనకున్న లగ్జరీ ఇళ్లలో ఒకదాన్ని అంబానీ తాజాగా విక్రయించినట్లు సమాచారం.
* న్యూయార్క్ లోని మాన్‌హట్టన్‌లో అంబానీకి ఓ విలాసవంతమైన ఇల్లు ఉంది. ఆ ఇంటిని తాజాగా విక్రయించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. మాన్‌హట్టన్ వెస్ట్ విలేజ్‌లో గల ఓ అపార్ట్‌మెంట్‌లోని నాలుగో ఫ్లోర్ లో 2,406 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరీ ఇంటిని అంబానీ 9 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు పేర్కొంది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం.. రూ.74.5 కోట్లన్న మాట.
* దేశంలో వెండి, బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. బుధవారం బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌మార్కెట్ పసిడి ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు 100 రూపాయలకుతగ్గి, 54,950వద్ద ఉంది. తద్వారా 55వేల దిగువకు చేరింది. ఇక 24 క్యారెట్ల 10గాముల బంగారం ధర 110రూపాయలు క్షీణించి 59,950 వద్ద ఉంది. వెండి ధర కూడా అదే బాటలోఉంది. కిలో వెండి ధర రూ.600 క్షీణించి రూ. 76,700 వద్ద ఉంది.