జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్రను విశాఖపట్నం నుంచి చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. రేపటి (ఆగస్టు 10) నుంచి ఆగస్టు 19 వరకు యాత్రను కొనసాగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన నాయకులు.. వారాహి యాత్రకు అనుమతుల కోసం పోలీసులను సంప్రదించారు. అయితే విశాఖలో వారాహి యాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. జగదాంబ సెంటర్‌లో సభకు మాత్రమే అనుమతిని ఇచ్చిన పోలీసులు.. ర్యాలీలపై నిషేధం విధించారు. వాహన ర్యాలీలు, అభివాదం చేయవద్దని స్పష్టం చేశారు.
భవనాలు, ఇతన నిర్మాణాలపై కార్యకర్తలు, అభిమానులు ఎక్కకుండా చూసే బాధ్యత జనసేన పార్టీదేనని పోలీసులు తెలిపారు. ఉల్లంఘనలకు పాల్పడితే అనుమతి పొందినవారిదే బాధ్యత అని షరతు విధించారు. అయితే వారాహి యాత్రకు పోలీసులు విధించిన షరతులపై జనసేన పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.ఇక, రేపటి నుంచి మూడో విడత వారాహి యాత్ర ప్రారంభించనున్నా నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈరోజే విశాఖ చేరుకోనున్నారు. మరోవైపు జగదాంబ జంక్షన్‌లో పవన్ సభ నిర్వహించేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. గత రెండు విడతల యాత్రను మించి మూడో విడత వారాహి యాత్రను సక్సెస్ చేయాలని జనసేన భావిస్తోంది. ఇక, వారాహి యాత్రను పర్య వేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.