🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿మనిషి తనకు మానవ జన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు.
పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో సమర్పించు కుంటూ ఉంటాడు.
🌸ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమో గానీ.. అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా…
🌿ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు… భగవంతుడిదే ఈ యావత్‌సృష్టి…
అలాంటివాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే. కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు వూరుకోదు…
🌸పూర్వం ఒక యోగి భగవంతుణ్ని అర్చించడానికి సిద్ధమయ్యాడు.
అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది. పూజలో ఒక్కొక్క ఉపచారాన్నీ చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు…
🌿”పరమేశ్వరా… నీవు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు, కనుక నిన్ను ఎలా ఆవాహన చేయాలి..
🌸అన్నింటికీ ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి..
🌿నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లెందుకు..
🌸పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా..
🌿నిత్యనిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి..
🌸ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి..
🌿గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అవసరమా..
🌸ఏ లేపనాలూ అవసరం లేని నీకు గంధం ఎలా పూయాలి..
🌿నిత్య పరిమళుడవైన నీకు పూలు పెట్టడం ఎందుకు..
🌸మహిమతోనే వెలిగిపోయే నీకు ఆభరణాలు తొడగాలా..
🌿నిరంజనుడవైన నీకు ధూపం వేయడం సరి అయినదేనా..
🌸జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా..
🌿నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు..
🌸విశ్వానికే ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తి పరచగలనా..
🌿అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చేయాలి..
🌸అద్వయుడవైన నీకు నమస్కారం ఎలా చేయాలి..
🌿వేదాలే నిన్ను స్తుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా స్తుతించాలి..”
🌸ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు, భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా అత్యల్పుడే…
వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణనలోకి రానే రాదు.
🌿 అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది…
నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు, వస్తువులు అంతకన్నా కావు…
🌸ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరతాడు, భక్తితో స్మరిస్తే చాలునంటాడు, కానీ మనిషి మనసు చంచలం, చపలం.
స్థిరంగా ఒకచోట ఉండదు,
🌿లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు. అందుకే… శంకరభగవత్పాదులు…
🌸ఓ పరమేశ్వరా… నా మనసు ఒక కోతి వంటిది. అది ఎప్పుడూ సంసారవాంఛ అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది…
భార్యా పుత్రుల ప్రేమ అనే చెట్టుకొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది…
🌿క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ పరుగులు తీస్తుంటుంది, అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను, దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ అధీనంలో ఉంచుకో’ అని ప్రార్థిస్తారు…
🌸సామాన్య భక్తులను తరింప జేయడానికి ఆయన చేసిన విన్నపం ఇది…
🌿ఓ పరమేశ్వరా… బంగారు కొండ మేరు పర్వతమే నీ చేతిలో ఉంది, అపార ధనవంతుడైన కుబేరుడు నీ పాదదాసుడై ఉన్నాడు…
🌸కల్పవృక్షం, కామధేనువు, చింతామణి నీ ఇంటిలోనే ఉన్నాయి, షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు.
🌿సమస్త మంగళాలనూ కలిగించే జగన్మాత సర్వమంగళయై నీ పక్కనే ఉంది. కనుక నీకు నేనేమీ ఇవ్వలేను, నా దగ్గర ఉన్నది ఒక్క మనసే, అది నీకు సమర్పిస్తున్నాను..
🌸అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు.
అచంచల విశ్వాసం, అకుంఠిత భక్తి, అన్నింటినీ నివేదించగల మనసు ఉంటే చాలు, భగవంతుడు ఏ రూపంలో ఉన్నా పూజల్ని అందుకుంటాడు.
🌿అట్టహాసాలు, ఆర్భాటాలు నిజమైన పూజలు కావు, హృదయార్పణమే పూజ, నిశ్చల ధ్యానమే భక్తి, అంతేకానీ లోకమంతా చూడాలని చేసే నటనలు పూజలు కావు… ఈ సత్యాన్ని మనిషి గ్రహించాలి…స్వస్తి..🚩🌞🙏🌹🎻
🙏 సమస్త లోకా సుఖినోభవంతు🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸