జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కూడా వారాహి యాత్ర పేరుతో దశలవారీగా జనంలోకి వెళ్తున్నారు. ఇప్పటికే.. రెండో విడతల యాత్రతో పలు జిల్లాల్లో పర్యటించారు. తాజాగా.. విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రకు రెడీ అయ్యారు పవన్‌కళ్యాణ్. విశాఖ వేదికగా ఇవాల్టి నుంచి ఈ నెల 19 వరకు జనసేన మూడో విడత వారాహి యాత్ర కొనసాగించనున్నారు. ఇక విశాఖలో వారాహి యాత్ర ఫీవర్ ఇప్పటికే ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. జీవీఎంసీకి చెందిన ఓ కాంట్రాక్ట్ డ్రైవర్.. ఏకంగా చెత్త తీసుకెళ్తే వాహనంతోనే యాత్రకు సంబంధించి అనౌన్స్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉత్తరాంధ్రలో 10 రోజులపాటు పర్యటించనున్న పవన్.. విశాఖలోని పలు ప్రాంతాలను సందర్శించనున్నారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపనున్నారు. కాగా వారాహి యాత్రలో భాగంగా.. ఇవాళ జగదాంబ జంక్షన్‌లో ఏర్పాటు చేసే సభలో ప్రసంగించనున్నారు. అనంతరం జనవాణి కార్యక్రమం, క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు. ఇక యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రధానంగా మూడో విడత యాత్రలో విశాఖలోని కబ్జాలపైనే పవన్‌కళ్యాణ్ ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్లు జనసేన వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆయా అంశాలపై పవన్ ఆరా కూడా తీసినట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ వారాహి యాత్రకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన పోలీసులు.. ఆయా ప్రాంతాల్లో పర్యటనలకు పర్మిషన్ ఇస్తారా? లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.
మరోవైపు విశాఖ యాత్రకు వస్తున్న పవన్‌కళ్యాణ్‌కు మంత్రి అమర్నాథ్ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఏం సాధించారని ఉత్తరాంధ్రకు వస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అమర్నాథ్. ఇక.. మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జనసేన నేతలు. వారాహి యాత్రతో వైసీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. మొత్తంగా.. విశాఖ నుంచి ప్రారంభం కానున్న పవన్‌కళ్యాణ్.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. రెండో విడత యాత్రలో వాలంటీర్ వ్యవస్థపై పవన్ కామెంట్స్.. ఏపీలో తీవ్ర దుమారం రేపగా.. విశాఖలో ఏం మాట్లాడతారో?.. రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలి.