DailyDose

విద్యుత్ కార్మికుల స‌మ‌స్య‌లు తీర్చాలి:పురంధేశ్వరి-TNI నేటి తాజా వార్తలు

విద్యుత్ కార్మికుల స‌మ‌స్య‌లు తీర్చాలి:పురంధేశ్వరి-TNI నేటి తాజా వార్తలు

మళ్ళీ వివాదంలో రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే ఎంపీ పదవిపై అనర్హత వేటు పడితే..మళ్ళీ దాన్ని తొలగించడంతో ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టిన రాహుల్..అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతూ..బి‌జే‌పిపై విరుచుకుపడ్డారు. మొదట తనని ఎంపీగా పునర్నియమించినందుకు స్పీకర్‌కు ధన్యవాదాలు చెప్పారు. అలాగే గతంలో మాదిరిగా అదాని గురించి మాట్లాడనని, బి‌జే‌పిపై దాడి చేయనని అన్నారు.హృదయంతో మాట్లాడతానని చెప్పి..భారత్ జోడో యాత్ర గురించి కాసేపు చెప్పారు. తర్వాత మణిపూర్ అంశంపై స్పందించారు. మణిపూర్ లో తాను పర్యటించానని, కుమారుల మృతదేహాల వద్ద ఉన్న తల్లులతో మాట్లాడానని,  భయానక సంఘటనల గురించి చెప్పేటపుడు ఆ మహిళలు స్పృహ కోల్పోయారని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఆ రాష్ట్రంలో పర్యటించలేదని, బీజేపీ ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించారన్నారు. అక్కడ మహిళలని హత్య చేయడం ద్వారా…భారత మాతను హత్య చేశారని ఆరోపించారు.ఇక రావణాసురుడు మేఘనాథుడు, కుంభకర్ణుడు చెప్పిన మాటలనే వినేవాడని, మోదీ కూడా ఇద్దరి మాటలనే వింటారని, వారిద్దరూ అమిత్ షా, అదానీ అని దుయ్యబట్టారు. బీజేపీ నేతలు దేశభక్తులు కాదని, దేశ ద్రోహులు అని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో బి‌జే‌పి సభ్యులు..రాహుల్ పై ఫైర్ అయ్యారు.అదే సమయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. అవినీతి, వారసత్వ రాజకీయాలు భారత దేశాన్ని విడిచిపెట్టిపోవాలన్నారు. అయితే స్మృతి ఇరానీ మాట్లాడుతుండగానే రాహుల్ గాంధీ లోక్ సభ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. ఇక ఆయన సభ నుంచి వెళ్లిపోతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని స్మృతి ఇరానీ ఆరోపించారు. కానీ ఎక్కడ కూడా కెమెరాల్లో కనిపించలేదు. దీంతో అధికారులు సి‌సి‌టి‌వి ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. మొత్తానికి రాహుల్ మరొకసారి వివాదంలో ఇరుక్కున్నారు.

తిరుమ‌ల‌లో త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ సాధరణంగా ఉంది.  స్వామివారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులకు 10 గంటల సమయం పడుతోంది.   టికెట్ లేని సర్వదర్శనానికి  18  గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి, నడకదారి దివ్యదర్శనానికి 04 గంటల సమయం పడుతోంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కాగా 2023 జూలై 08 మంగళవారం రోజున  73 వేల 879 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 26 వేల144 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మరోవైపు తిరుమల వెళ్లే భక్తులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్  చెప్పింది. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి తిరుమలకు చేరుకునే వారికి అందించే దర్శన టికెట్ల కోటాను టీటీడీ పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా మొన్నటి వరకు రోజూ ఆర్టీసీ ప్రయాణికులకు 600 టికెట్లు ఇస్తున్నారు..అయితే  ఇప్పుడు ఆ సంఖ్యను 1000కు పెంచింది. బస్సు ఛార్జీకి తోడు శ్రీవారి దర్శనానికి రూ.300 దర్శన టికెట్‌ను ప్రయాణికులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

రేవంత్ పై  కేటీఆర్ ఫైర్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదని, తెలంగాణకు పట్టిన వ్యాధి అని విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ఐటీ హబ్ ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై రైఫిళ్లతో దాడికి దిగిన రేవంత్.. ఇవాళ తాను నిఖార్సైన తెలంగాణ వాది అని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.హంతకుడే సంతాపం చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా గుడ్డి గుర్రాల పళ్లు తోమారా అని నిలదీశారు. కరెంట్, నీళ్లు ఇవ్వకుండా రైతులను చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా అని ప్రశ్నించారు. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవని, ఒక్క బీఆర్ఎస్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కేటీఆర్ అన్నారు.

విద్యుత్ కార్మికుల స‌మ‌స్య‌లు తీర్చాలి:పురంధేశ్వరి

 విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలన్నారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెను ప్రారంభిస్తే వినియోగదారులకు వచ్చే సమస్యలు పరిష్కరించడానికి అనేక సాంకేతిక సమస్యలు ఏర్పడతాయన్నారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లను పరిష్కరించడం ద్వారా సమ్మె సమస్యను పరిష్కరించాలని ఆమె సూచించారు. 2022 నుంచి పీఆర్సీ అమలు చేయాలన్న డిమాండును పరిష్కరించాలన్నారు.విద్యుత్ రంగంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించక పోవడం వల్ల విద్యుత్ ఉధ్యోగులు సమ్మెకు దిగుతున్నారని పురంధేశ్వరి పేర్కొన్నారు. సుమారుగా 26 వేలమంది కాంట్రాక్ట్ కార్మికుల జీత భత్యాలను ప్రభుత్వం నేరుగా చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. దశల వారీగా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఎందుకు మొండి వైఖరి అవలంభిస్తోందని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రశ్నించారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్‌

ఆగష్టు 15 పంద్రాగస్టుపై శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌ విధించారు. సీఐఎస్‌ఎఫ్‌, పోలీసుల తనిఖీలతో ముమ్మరం చేయనున్నారు. అంతేకాదు.. ఆగష్టు 15 వరకు సందర్శకులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు.ఇక ప్రయాణికులతో వెళ్లేవారికి అధికారులు సూచనలు చేస్తున్నారు. వీడ్కోలు పలికేందుకు ఒకరిద్దరే రావాలని సూచిస్తున్నారు.

జగన్ ను కలిసిన టీటీడీ నూతన ఛైర్మన్‌

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఛైర్మన్‌ గా నియమితులైన  భూమన కరుణాకర్‌ రెడ్డి ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ను సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం కలిశారు. టీటీడీ ఛైర్మన్‌గా   తనకు అవకాశం కల్పించటంపై ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రేపు ఉదయం తిరుమలలో టీటీడీ చైర్మన్‌ గా భూమన బాధ్యతలు చేపట్టనున్నారు.కాగా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన భూమన కరుణాకర్‌రెడ్డి 1958, ఏప్రిల్‌ 5న వైఎస్సార్‌ జిల్లా నందలూరు మండలం ఈదరపల్లెలో జన్మించారు. ఆయన తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో 2004–06 మధ్య తుడా (తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) చైర్మన్‌గా భూమన పనిచేశారు. ఆ తర్వాత 2006–08 మధ్య టీటీడీ బోర్డు చైర్మన్‌గా అత్యంత సమర్థవంతంగా పనిచేశారు.

పుంగనూరు ఘటనపై సీబీఐ విచారణకు బాబు డిమాండ్

పుంగనూరు నియోజకవర్గంలోని  అంగళ్లులో తనను చంపాలనిచూశారని  టీడీపీ చీఫ్ చంద్రబాబు  ఆరోపించారు. విజయనగరంలో  బుధవారంనాడు చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.తనపై అంగళ్లులో జరిగిన ఘటనపై  సీబీఐ విచారణ చేయాలని  ఆయన డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక ఎవరి కుట్ర ఉందో తేల్చాలన్నారు. మమ్మల్ని చంపి  రాజకీయం చేయాలని  భావిస్తున్నారా అని  ఆయన  ప్రశ్నించారు.  ప్రాజెక్టుల సందర్శనకు  తాను వెళ్తుండగా  అంగళ్లు వద్ద వైఎస్ఆర్‌సీపీ నేతలు పథకం  అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ఈ విషయమై  ఎన్‌ఎస్‌జీతో  అధికారులు స్థానిక పోలీసులతో మాట్లాడారన్నారు. తన సీఎస్ఓ చిత్తూరు ఎస్పీతో కూడ మాట్లాడిన విషయాన్ని చంద్రబాబు గుర్తు  చేశారు.వైఎస్ఆర్‌సీపీ నేతలు దాడి చేస్తే  తాను  పారిపోవాలని వైఎస్ఆర్‌సీపీ నేతలు పన్నాగం పన్నారన్నారు.  తనపై  వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు రాళ్లు వేసిన సమయంలో  ఎన్‌ఎస్‌జీ సిబ్బంది  అడ్డుగా నిలిచారన్నారు.అయినా కూడ పోలీసులు  పట్టించుకోలేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెడుతున్నందుకే  తనపై దాడి చేశారన్నారు. తన కార్యక్రమాన్ని వైఎస్ఆర్‌సీపీ అడ్డుకుందని చెప్పారు.తనపై  దాడి చేసేందుకు  వచ్చి హత్యాయత్నం కేసు పెట్టారన్నారు.ఎర్రగొండపాలెం, నందిగామలో  ఇలానే దాడులు చేస్తే  ఎన్ఎస్‌జీ కమెండో,  సీఎస్ఓ గాయపడ్డారని చంద్రబాబు గుర్తు  చేశారు. తాను  పుంగనూరుకు వెళ్లడం లేదని  చెప్పినా వినలేదన్నారు. అంగళ్లులో  వైఎస్ఆర్‌సీపీ  శ్రేణులను  పోలీసులు ఎందుకు  హౌస్ అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు.  పుంగనూరులో  ఘర్షణలకు సంబంధించిన వీడియోను  చంద్రబాబు మీడియా సమావేశంలో  చూపారు. తనపై హత్యాయత్నం  చేస్తే  అందరూ  భయపడుతారని  మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి  పై  చంద్రబాబు  విమర్శలు చేశారు.  పిచ్చివాడి చేతిలో రాయిగా అధికారాన్ని వైఎస్ఆర్‌సీపీ  నేతలు  వాడుకుంటున్నారన్నారు.పుంగనూరు ఘటనలపై  సీబీఐ సమగ్రంగా విచారణ చేయాలని  ఆయన  డిమాండ్  చేశారు.

అర్చకుడిపై  ఓ వ్యక్తి దాడికి తెగబడిన ఘటనపై జనసేన సూటి ప్రశ్న

పశ్చిమ గోదావరి జిల్లాలో పంచారామాల్లో ఒకటైన భీమవరం శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకుడిపై ఓ వ్యక్తి దాడికి తెగబడిన ఘటనపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ స్పందించారు. ఎవరి కళ్లలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి యజ్ఞోపవీతాన్ని తెంచారని ఆయన ప్రశ్నించారు. పంచారామ క్షేత్రంలో అర్చకుడిపై దాడి చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్‌ డిమాండ్ చేశారు. సోమేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నాయకుడు దాడికి తెగబడి యజ్ఞోపవీతాన్ని తుంచేయడం పాలక వర్గం అహంభావానికీ, దాష్టీకానికి ప్రతీక అంటూ తీవ్రంగా మండిపడ్డారు.ఆలయ సహాయ అర్చకుడు పండ్రంగి నాగేంద్ర పవన్‌పై ఆలయ బోర్డు ఛైర్మన్ భర్త యుగంధర్ చేసిన దాడిని సనాతన ధర్మంపై దాడిగా భావించి ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. వైదిక ఆచారాల్లో యజ్ఞోపవీతాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తామని.. వేదాలు చదివి భగవంతుని సేవలో ఉండే అర్చకులపై దాడి చేయడం, వారిని ఇబ్బందిపెట్టడం రాక్షసత్వమే అన్నారు. ప్రశాంతంగా పవిత్రంగా ఉండాల్సిన ఆలయ ప్రాంగణాల్లో అహంకారం, అధికార దర్పం చూపడం క్షమార్హం కాదన్నారు. అన్నవరంలో పురోహితులను వేలం వేయాలని ఒక అర్థం లేని నిర్ణయం తీసుకున్నారని, జనసేన తీవ్రంగా వ్యతిరేకించేసరికి వెనక్కి తగ్గారని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఇప్పుడు పంచారామ క్షేత్రంలో అర్చకుడిపై దాడికి తెగబడ్డారన్నారు. ఇది స్థానిక నాయకుడు చేసిన దాడిగా సరిపుచ్చలేమన్నారు. ఎవరి కళ్ళలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి, పవిత్ర యజ్ఞోపవీతాన్ని తెంచేశారో ఆ పరమేశ్వరుడికే తెలియాలన్నారు. ఈశ్వరుని సన్నిధిలో దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనతో పాటు రాష్ట్రంలో హిందూ ఆలయాల నిర్వహణలో ప్రభుత్వ వైఖరి గురించి, ఆలయాలపై దాడులు గురించి కేంద్రానికి నివేదిక అందిస్తామని పవన్‌ పేర్కొన్నారు.

కేంద్రంపై రాహుల్ గాంధీ మరోసారి ఫైర్

 అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఇదిలా ఉండగానే రాహుల్ గాంధీ మరోసారి ట్విట్టర్ వేదికగా బీజేపీపై విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీ కిరోసిన్ చల్లిందని.. ఇప్పుడు మంటలు పెట్టే పనిలో బీజేపీ బిజీగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మణిపూర్, హర్యానా అల్లర్లకు బీజేపీదే బాధ్యత అని అన్నారు. బీజేపీ నేతలు భారతమాత హంతకులు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతకుమందు పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా మాట్లాడిన రాహుల్.. మణిపూర్‌లో బీజేపీ నేతలు భారతమాతను చంపేశారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మోదీపై కేటీఆర్ మండిపాటు

9ఏళ్లలో ప్రధాని మోదీ ఏ ఒక్క మంచి పనైనా చేశారా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నిజామాబాద్ ఐటీ హబ్ ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. దేశ యువతకు ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. 2014లో సిలిండర్ ధర రూ.400గా ఉంటే బీజేపీ నేతలు ఆనాడు గగ్గోలు పెట్టారని.. ఇప్పుడు సిలిండర్ ధర రూ.1200కి చేరిందని విమర్శించారు. లీటర్ పెట్రోల్ ధర రూ.120 చేశారని మండిపడ్డారు.