ఇందుది కృష్ణా జిల్లా పెనమలూరు. సాధారణ మధ్యతరగతి కుటుంబం. తండ్రి గెస్ట్ లెక్చరర్. తల్లి గృహిణి. ఎం.ఎస్. చేయడం కోసం యూఎస్ వెళ్లింది. ప్రపంచ బ్యాంకు ఉద్యోగం తెచ్చుకుంది.
చిన్నప్పటి నుంచి కష్టపడి చదివే మనస్తత్వం… స్పష్టమైన గమ్యం… లక్ష్యంపై ఏకాగ్రత… నిండైన ఆత్మవిశ్వాసం ఇందు సొంతం. తల్లిదండ్రులు మాధవి, సత్యనారాయణ. విజయవాడలో బీటెక్ పూర్తి చేసి, అమెరికాలో ఎం.ఎస్. పబ్లిక్ పాలసీ చేసింది. ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం సాధించిన వైనాన్ని ఆమె ‘సాక్షి’తో వివరించింది.
* పర్యావరణ పరిరక్షణ
‘‘అమెరికాలో ఎం.ఎస్. చదివి అక్కడే ఉద్యోగం చేయాలని ఉండేది. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా వెళ్లాను. అక్కడికి వెళ్లిన తరువాత నా దృక్కోణం విస్తరించింది. ప్రపంచ స్థాయిలో మానవజాతిని ప్రభావితం చేయగల ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సంస్థల్లో పని చేయాలని నిర్ణయించుకున్నా. ‘యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్– మేసన్’లో ఎంఎస్, పబ్లిక్ పాలసీ కోర్సులో చేరాను. యూనివర్సిటీ స్థాయిలో అనేక అంశాలపై అధ్యయనం చేసి అమెరికాలోనే ప్రఖ్యాతి గాంచిన ప్రొఫెసర్ టిమ్ స్మీడింగ్ వద్ద నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాను. యూనివర్సిటీ స్థాయిలో నేను ఇచ్చిన ప్రజెంటేషన్‌లు, పరిశోధనల ఆధారంగా ప్రపంచ బ్యాంకు ఉద్యోగం ఇచ్చింది.
* దక్షిణ ఆసియా వాతావరణం
నాకు ఉద్యోగంలో దక్షిణ ఆసియా దేశాలకు చెందిన వాతావరణ విభాగం బాధ్యతలను కేటాయించారు. వాతావరణ మార్పును అధ్యయనం చేసే నిపుణురాలిగా, జాయింట్ మల్టీ బ్యాంకు డెవలప్‌మెంట్ మధ్య సమన్వయకర్తగా, విధానాల రూపకల్పనలు, వాటికి సాంకేతికతను అన్వయించడం, అమలు చేయటం, వివిధ దేశాలలో ఉండవలసిన కచ్చితమైన వాతావరణ కాలుష్యం ప్రామాణికతల నిర్ణయం, సంబంధిత దేశాల వాతావరణ కాలుష్య కార్యక్రమాల్లో అమలు తేడాలను విశ్లేషించడం నా విధులు. వీటికి సంబంధించిన నివేదికల తయారీ, ఒప్పందాల అమలు పర్యవేక్షణ, సమావేశాల్లో చర్చించటం మా విభాగం నిర్వర్తించాల్సిన ప్రత్యేక విధులు. అమెరికా ప్రభుత్వం నాకు ప్రత్యేకంగా జీ4 వీసా జారీ చేసింది. విధులకు హాజరుకావాలని ప్రపంచ బ్యాంకు నుంచి ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే అమెరికాకు వెళ్లి విధుల్లో చేరాలి’’ అని చెప్పారు ఇందు కిలారు.
సాధించిన విజయాలివి
* కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో జాతీయ స్థాయి క్యాంపస్ ఇంజినీరు పరీక్షకు హాజరై రాష్ట్రం నుంచి ఎంపికైన ఇద్దరిలో ఇందు ఒకరు.
* యూఎస్ యూనివర్సిటీలో ఏకగ్రీవంగా యూనిటీ అండ్ డైవర్సిటీ సంఘానికి ఏకగ్రీవంగా కోఆర్డినేటర్‌గా ఎన్నిక. ఆ బాధ్యతల్లో విదేశీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి. విద్యార్థులు, యూనివర్సిటీ అధికారులకు మధ్య వారధిగా పనిచేసి మల్టీ టాస్కింగ్ విజర్డ్‌గా గుర్తింపు.
* క్రిసాలిస్ అనే ఎన్‌జీఓ సంస్థలో మేనేజ్‌మెంట్ బోర్డు అడ్వయిజర్‌గా సేవలు అందించడం.
* టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, టీచ్ ఫర్ చేంజ్ సంస్థలకు సేవలు అందించడం.
* ఎం.ఎస్.లో అత్యుత్తమ గ్రేడ్స్ సాధించి మూడు సెమిస్టర్లలో రూ 65 లక్షల రూపాయల ఉపకార వేతనం పొందడం.
* విదేశీ విద్యార్థినిగా స్నాతకోత్సవ సభలో యూనివర్సిటీ ఫ్లాగ్ బేరర్‌గా ఎన్నిక. ఔట్‌స్టాండింగ్ స్టూడెంట్ అవార్డు, బెస్ట్ స్టూడెంట్ ఎంప్లాయ్‌గా గోల్డెన్ బ్రిక్ అవార్డు, బెస్ట్ పైరో ఫ్రైజ్ విన్నర్, బెస్ట్ పేపర్ ఇన్ సైన్స్ అండ్ పబ్లిక్ పాలిసీ పురస్కారం.
* ప్రతిష్ఠాత్మకమైన యూరోపియన్ యూనియన్ ప్రాజెక్టు.
గ్లోబల్ వార్మింగ్‌పై అధ్యయనం…ప్రపంచ బ్యాంకు టీమ్‌తో కలిసి దక్షిణ ఆసియా దేశాలలో గ్లోబల్ వార్మింగ్ తగ్గింపుపై ప్రత్యేక ప్రాజెక్టు రూపొందించాలి. ప్రధానంగా భారత్–పాకిస్థాన్ దేశాలలో వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేస్తాను. ఇండియన్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా గ్రౌండ్ లెవల్‌లో కూలింగ్ సొల్యూషన్స్‌పై సాంకేతికంగా పాలసీని రూపొందించి దాని అమలుకు కృషి చేస్తాను. ఉష్ణోగ్రతలు 1.5–2 డిగ్రీల వరకు తగ్గించగలిగితే వ్యవసాయం, ఆరోగ్యం, కార్మికులకు అనువైన వాతావరణం నెలకొంటుంది.