DailyDose

ఐఐటీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ట్విస్ట్-TNI నేటి నేర వార్తలు

ఐఐటీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ట్విస్ట్-TNI నేటి నేర వార్తలు

ఐఐటీ విద్యార్థిని ఆత్మహత్య 

ఈ మధ్యకాలంలో ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్యల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని కంది ఐఐటీ క్యాంపస్‌లో మమైతా నాయక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. విద్యార్థిని ఆత్మహత్యపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మమైతా మొబైల్ ఫోన్, సూసైడ్ లెటర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్‌లో అనేక విషయాలు నిర్ధారణ అవుతాయి.అయితే.. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు మాత్రం క్యాంపస్‌లో రాగింగ్ వల్లే మమైతా చనిపోయి ఉంటుందని ఆరోపిస్తున్నాయి. కాగా.. ఈ కేసులో మొబైల్ ఫోన్, సూసైడ్ లెటర్ కీలకంగా మారాయి. అంతేకాకుండా విద్యార్థిని రూమ్‌లో రెండు సూసైడ్ లెటర్స్ లభించడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ లెటర్స్ నిజంగా మమైతా రాసిందా లేక ఏవరైనా రాసి అక్కడ పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాసర ట్రిపుల్ ఐటీ ఎదుట ఉద్రిక్తత

బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న జాదవ్ బబ్లు అనే విద్యార్థి మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బుధవారం బాసర ట్రిపుల్ ఐటీ ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలు సంఘాలు, పార్టీల నాయకులు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి వద్ద తమ నిరసన తెలుపగా ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీ వద్ద తెలంగాణ జన సమితి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్, కళాశాల విసీలపై వ్యతిరేక నియమాలు చేశారు. త్రిబుల్ ఐటీ ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బ్యారిగెట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్న భద్రతా సిబ్బంది వారిని అదుపులో తీసుకొని బాసర పోలీస్ స్టేషన్ కు తరలించారు.

విశాఖ జిల్లా మర్రిపాలెంలో విషాద ఘటన

ఏపీలోని విశాఖ జిల్లా మర్రిపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి నీటి సంపులో దూకి ఆత్మహత్య (Suicide) కు పాల్పడింది. వివరాలు .. మర్రిపాలెం ప్రకాష్‌నగర్‌లో అపార్టుమెంట్‌లో నివాసముంటున్న వాచ్‌మెన్‌ కుటుంబం ( Watchman Family ) మంగళవారం అర్ధరాత్రి తల్లి సంధ్య, కుమారుడు గౌతమ్‌ ( 9 ), కూతురు అలేఖ్య (5) నీటి సంప్‌ ( Water Sump)లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. వీరి ఆత్మహత్యకు పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఎయిర్‌పోర్ట్‌ జోన్‌ పోలీసులు మృతదేహాలు కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చనిపోయేముందు భర్తతో ప్రేమగా మాట్లాడి సూసైడ్‌

ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. నిండు నూరేళ్లు కలిసి జీవించాలని కలలు గన్నారు. ఇరువురి ఇళ్లల్లో పెళ్లికి అంగీకరించకపోయినా పట్టుబట్టి మరీ ఒప్పించారు. చివరికి అంగరంగ వైభవంగా వివాహం కూడా చేసుకున్నారు. ఆరు నెలలపాటు కాపురం తర్వాత ఏం జరిగిందో తెలియదు.. ఏ కష్టం వచ్చిందో తెలియదుగానీ ఇరువురూ ఒకరి తర్వాత ఒకరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. మొదట భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆ విషయం తెలిసిన భర్త కూడా మరుసటి రోజు రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇరుకుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామానికి చెందిన బాలపుల్లయ్య, ఓబుళమ్మ దంపతులు కుమారుడు మంజునాథ్‌కు (27). పుట్లూరు మండలం గరుగుచింతలపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు, లక్ష్మీదేవిల కుమార్తె రమాదేవి (24). మంజునాథ్‌, రమాదేవి ప్రేమించుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినా పట్టుబట్టి ఓప్పించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కొత్త కాపురం పెట్టిన ఈ జంట సంతోషంగానే ఉండేవారు. మంజునాథ్‌ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు.ఎంతో అన్యోన్యంగా ఈ జంట ఉండేది. ఐతే ఏం జరిగిందో తెలియదు సోమవారం (ఆగస్టు 7) సాయంత్రం పట్టణంలోని చల్లవారిపల్లి గ్రామ సమీపంలో రైలు కిందపడి రమాదేవి మృతి చెందింది. ఆత్మహత్యకు ముందు భర్తతో ప్రేమగా మట్లాడి ఈ దారుణానికి పాల్పడింది. అల్లుడు మంజునాథ్‌ కుటుంబం వరకట్న వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని రమాదేవి తల్లిదండ్రులు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య రమాదేవి మరణించిందన్న వార్త విన్న సోమవారం రాత్రి రెండుసార్లు రైలు కిందపడేందుకు మంజునాథ్‌ కూడా వెళ్లాడు. ఐతే కుటుంబ సభ్యులు అడ్డుపడి ఎలాగో ఇంటికి తీసుకొచ్చారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అందరూ నిద్రలో ఉండగా మంజునాథ్‌ ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఆ తర్వాత తాడిపత్రి రైల్వేస్టేషన్‌ సమీపంలోకి వచ్చి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

దురవాట్లకు బానిసై  ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు

దురవాట్లకు బానిసై ఉరేసుకుని డి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లక్షెట్టిపేట మునిసిపాలిటీ పరిధిలోని గంపలపల్లి ఆంధ్ర బోర్ కాలనీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. కాలనీకి చెందిన జెల్ల మహేష్ (20) అనే యువకుడు దురలవాట్లకు బానిసయ్యాడు. జీవితంపై విరక్తి కలిగి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దురలవాట్లకు బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఓ ట్రక్కు బీభత్సం

 హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఆపిల్‌ పండ్ల లోడుతో వస్తున్న ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో అక్కడే ఉన్న కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. సిమ్లా (Shimla) జిల్లా చైలా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నార్కండ్‌ నుంచి యాపిల్ పండ్ల లోడుతో వస్తున్న ట్రక్కు రాజ్‌ఘర్‌ -సోలన్‌ రహదారి గుండా బయటకు వచ్చే క్రమంలో సైన్జ్‌-రాజ్‌ఘర్‌ రహదారి వైపు వెళ్లబోయి.. సిమ్లా జిల్లా చైలా రోడ్డులోకి ప్రవేశించింది. ఈ క్రమంలో ట్రక్కు బ్రేకులు పెయిల్‌ కావడంతో రోడ్డు పక్కనే ఉన్న కార్లపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదు కార్లు ధ్వంసం అయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

బాచుపల్లి యాక్సిడెంట్ లో చిన్నారి దుర్మరణం

స్కూల్ కు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయిన చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. హైదరాబాద్ బాచుపల్లిలో జరిగిన ఈ ప్రమాదంపై వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. గుంతలమయమైన రోడ్డులో తండ్రితో కలిసి వెళుతున్న చిన్నారి ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కిందపడిన మృతిచెందినట్లు వెలువడిన కథనాలు హైకోర్టు దృష్టికి వెళ్లాయి. వీటి ఆధారంగానే ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. చిన్నారి యాక్సిడెంట్ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎస్ తో పాటు ఆర్ ఆండ్ బి, హోం, మున్సిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు అందాయి. అలాగే జిహెచ్ఎంసి, రాచకొండ పోలీస్ కమీషనర్, బాచుపల్లి ఎస్ ఎస్‌హెచ్‌వో అధికారులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఫేస్‌బుక్‌లో పరిచయమైన బాలికను కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ 

ఫేస్‌బుక్‌లో పరిచయమైన బాలికను కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ (girl kidnapped) చేశారు. ఒక ఇంట్లో నిర్బంధించి 28 రోజులపాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. 13 ఏండ్ల బాలిక తల్లితో కలిసి ఉంటున్నది. జూలై 9న ఆరుగురు వ్యక్తులు ఆ బాలికను ఆమె ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. కుమార్తె కనిపించకపోవడంతో కూలీ పనులు చేసుకునే తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ప్రేమ వ్యవహారంగా భావించిన పోలీసులు దీని గురించి పట్టించుకోలేదు.కాగా, ఆగస్ట్‌ 5న ఆ బాలికను ముజఫర్‌పూర్‌లోని ఒకచోట వదిలేసినట్లు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఆమె తల్లికి ఫోన్‌ వచ్చింది. దీంతో స్థానికుల సహాయంతో కుమార్తె ఆచూకీ తెలుసుకుని ఇంటికి తీసుకువచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి తన స్నేహితులతో కలిసి తనను కిడ్నాప్ చేశాడని, 28 రోజులపాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత బాలిక చెప్పింది.మరోవైపు బాలిక తల్లి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు స్పందించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తామని పోలీస్‌ అధికారి తెలిపారు. దాని ఆధారంగా ఆరుగురు నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మహిళ ఖాతాలో  లక్షలు కాజేసిన వాలంటీరు

ఒంటరి మహిళ బ్యాంకు ఖాతా నుంచి గ్రామ వాలంటీరు రూ.1.70 లక్షలు కాజేసిన ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొట్రా నాగమణి ఇటీవల తన ఖాతాలో రూ.13,500 నగదు జమ చేసి మొత్తం ఎంత నగదు ఉందని బ్యాంకు సిబ్బందిని ఆరా తీశారు. ఇప్పుడు జమ చేసిన మొత్తం మాత్రమే ఉందని చెప్పడంతో ఆమె కంగుతిన్నారు. ఖాతా నుంచి తాను ఎప్పుడూ నగదు తీసుకోలేదని చెప్పడంతో సిబ్బంది బ్యాంకు స్టేట్‌మెంటు పరిశీలించారు. వేలిముద్ర ద్వారా నగదు తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ వాలంటీరు పలుమార్లు తన వేలిముద్ర తీసుకుని మోసం చేసి నగదు స్వాహా చేశాడని వాపోయారు.  బాధితురాలి ఫిర్యాదుపై విచారణ ఎస్సై జీజే విష్ణువర్ధన్‌ చేస్తున్నామని తెలిపారు.

మద్యం మత్తు వల్లే ఘోర ప్రమాదం

బీచ్‌రోడ్డులో సాగర్‌నగర్‌ రాడిసన్‌ బ్లూ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదానికి మద్యం మత్తు, అతి వేగమే కారణమని సీపీ త్రివిక్రమ్‌ వర్మ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. సోమవారం రాత్రి సాగర్‌నగర్‌ నుంచి రుషికొండ వైపు అతి వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి రాడిసన్‌ బ్లూ సమీపంలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో రాయగడ ప్రాంతానికి చెందిన పృధ్వీరాజ్‌ (28), ప్రియాంక (21), మజ్జి మణికుమార్‌ (20) మృతి చెందారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నగరానికి చెందిన వినయ్‌ సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి వద్ద కారు తీసుకుని బాలు, రవి, భరత్‌ కుమార్‌, మణికుమార్‌, రవికిరణ్‌తో కలిసి జోడుగుళ్లపాలెం వద్ద బీరు బాటిళ్లు తీసుకుని రుషికొండ వైపు బయలుదేరారని తెలిపారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారంతా సాగర్‌నగర్‌ ఆర్చి వద్ద యువకులతో వాగ్వాదానికి దిగి రహదారిపై మద్యం సీసాలు పగలగొట్టి హల్‌చల్‌ చేశారన్నారు. అంతేకాకుండా అక్కడి యువకుల నుంచి సెల్‌ఫోన్‌ లాక్కొని అతివేగంగా పరారయ్యేందుకు యత్నించగా… సాగర్‌నగర్‌ రాడిసన్‌ బ్లూ వద్ద కారు అదుపుతప్పడంతో ప్రమాదానికి గురయ్యారని తెలిపారు.