‘మొరగని కుక్కా లేదు, విమర్శించని నోరూ లేదు.. ఈ రెండూ లేని ఊరు లేదు. ఎవరేం చెప్పినా.. మన పని మనం చేసుకుంటూ పోవాలి. అర్థమైందా రాజా..’అంటూ నటుడు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్’ గురువారం తెరపైకి రానుంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఆ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఒకప్పుడు నాకు ‘సూపర్‌స్టార్’ బిరుదు ఇస్తుంటే నిరాకరించాను. వెంటనే అందరూ నేను వెనకడుగు వేశానన్నారు. శివాజి గణేశన్, కమల్‌హాసన్‌లాంటి వాళ్లు నటిస్తుండగా నాకెందుకు ఆ ‘సూపర్‌స్టార్’ అనుకున్నా. ఇప్పుడు కూడా అలాంటి సమస్యే వస్తోంది. కానీ నేను వాటి గురించి పట్టించుకోను. మొరగని కుక్క లేదు. విమర్శించని నోరూ లేదు.. ఇవి రెండూ లేని ఊరూ లేదు. ఎవరేం చెప్పినా మన పని మనం చేసుకుంటూ పోతుండాలి. అర్థమైందా రాజా’ అని తన శైలిలో రజనీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ మధ్య రజనీకాంత్‌ను ఏపీ మంత్రులు విమర్శించిన విషయం తెలిసిందే. వారికి సమాధానం చెబుతున్న తీరులోనే రజనీ ప్రసంగించారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. భవిష్యత్ సూపర్‌స్టార్ విజయ్ అని రజనీకాంత్ సూపర్‌స్టార్ హోదా నుంచి ఇక తప్పుకోవాలని పలువురు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా మాట్లాడారని కూడా ప్రచారం జరుగుతోంది.