అమెరికాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. జనావాసాలకు వ్యాపించి ప్రజల ప్రాణాలు బలికొంటోంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యూఎస్‌లోని హవాయి ద్వీపంలో చెలరేగిన కార్చిచ్చు 6 ప్రాణాలు బలిగొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ ప్రాంత మేయర్ తెలిపారు. మరో ఆరుగురికి కాలిన గాయాలతో పాటు.. శ్వాస సంబంధ సమస్యలు తలెత్తినట్లు వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.ద్వీపంలో తీవ్ర బీభత్సం సృష్టిస్తున్న కార్చిచ్చుకు బలమైన గాలులు తోడవడంతో అంతకంతకూ విస్తరిస్తున్నాయని మేయర్ ఆందోళన వ్యక్తం చేశారు. అనేక భవనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయని తెలిపారు. విద్యుత్ సరఫరా పూర్తిగా దెబ్బతిని వేలాది కుటుంబాలు అంధకారంలో చిక్కుకున్నాయని చెప్పారు. ఇప్పటికే అత్యవసర ప్రతిస్పందనా బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని వెల్లడించారు. కార్చిచ్చు మరింత బీభత్సంగా విస్తరిస్తుండటంతో అధ్యక్షుడు జో బైడెన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్మీ, నేవీ కూడా రంగంలోకి దిగాలని ఆదేశించారు.