Politics

విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన రఘురామకృష్ణ రాజు

విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన రఘురామకృష్ణ రాజు

మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ వైసీపీ మంత్రులు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలని, సినిమాలపై పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని చిరంజీవి వ్యాఖ్యానించడంతో… వైసీపీ నేతలు ఆయనను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో చెప్పారు. ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని అన్నారు. రాష్ట్రాన్ని, రోడ్లను అభివృద్ధి చేసుకోమని మాత్రమే చిరంజీవి అన్నారని… దానికి తమ పార్టీ నేతలు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు.

తమ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడకుండా… సినీ నటుల రెమ్యునరేషన్ గురించి మాట్లాడటం ఏమిటని రఘురాజు విమర్శించారు. విజయసాయికి బుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. హీరోల స్థాయిని బట్టి వారి రెమ్యునరేషన్ ఉంటుందని చెప్పారు. సీఎం జగన్ వేల కోట్లు సంపాదించారని అందరూ అంటుంటారని… ఆయన సంపాదించిన మొత్తాన్ని 151 మంది ఎమ్మెల్యేలకు పంచమంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు వరదలతో అల్లాడుతుంటే దాన్ని పట్టించుకోకుండా… మంత్రి అంబటి రాంబాబు ‘బ్రో’ సినిమాపై ఢిల్లీలో ఫిర్యాదు చేయడం ఏమిటని మండిపడ్డారు. ఆ సినిమాలో ఉన్న ఏదో చిన్న క్యారెక్టర్ కు అంబటి ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.